Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2018 42వ వారం

వికీపీడియా నుండి

మెక్‌మహాన్ రేఖ
ఈశాన్య భారతదేశానికి, టిబెట్‌కూ మధ్యన సరిహద్దు మెక్‌మహాన్ రేఖ. దీన్ని 1914 లో జరిగిన సిమ్లా సమావేశంలో హెన్రీ మెక్‌మహాన్ ప్రతిపాదించాడు. చైనా ప్రభుత్వం ఇది చెల్లదంటోంది. చైనా దీన్ని చట్టబద్ధతను వివాదాస్పదం చేసినప్పటికీ ఈ రేఖయే రెండు దేశాల మధ్య సరిహద్దుగా వ్యవహారంలో ఉంది. బ్రిటిషు ప్రభుత్వానికి విదేశాంగ మంత్రిగాను, సిమ్లా సమావేశంలో ప్రధాన వ్యవహర్తగానూ ఉన్న హెన్రీ మెక్‌మహాన్ పేరిట ఈ రేఖను పిలుస్తున్నారు. ఆ ఒప్పందంపై మెక్‌మహాన్‌, టిబెట్ ప్రభుత్వం తరపున లాంచెన్ సాత్రా సంతకాలు చేసారు. ఈ రేఖ పశ్చిమాన భూటాన్ నుండి 890 కి.మీ., తూర్పున బ్రహ్మపుత్రా నది మలుపు నుండి 260 కి.మీ. వరకు విస్తరించి ఉంది. ఎక్కువగా ఈ రేఖ హిమాలయ శిఖరాల మీదుగా సాగుతుంది. సిమ్లా ఒప్పందాన్ని (మెక్‌మహాన్ రేఖతో సహా) భారత ప్రభుత్వం తొలుత తిరస్కరించింది. 1907 ఆంగ్లో రష్యన్ ఒప్పందానికి ఇది వ్యతిరేకంగా ఉండడం ఇందుకు కారణం. ఈ ఒప్పందం 1921 లో రద్దయింది. అయినా, మెక్‌మహాన్ రేఖను 1935 వరకూ ఎవరూ పట్టించుకోలేదు. 1935 లో ఒలాఫ్ కారో అనే బ్రిటిషు సివిల్ సర్వీసు అధికారి, మెక్‌మహాన్ రేఖను అధికారిక మ్యాపులపై ముద్రించేలా బ్రిటిషు ప్రభుత్వాన్ని ఒప్పించాడు. మెక్‌మహాన్ రేఖను భారత్ చట్టబద్ధమైన సరిహద్దుగా గుర్తించగా, చైనా మాత్రం సిమ్లా ఒప్పందాన్ని, ఈ రేఖనూ కూడా గుర్తించేందుకు నిరాకరించింది. టిబెట్ సార్వభౌమిక దేశం కాదనీ, దానికి ఒప్పందాలు కుదుర్చుకునే అధికారం లేదనీ చైనా వాదన.
(ఇంకా…)