వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2018 43వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జింకు ఆక్సైడ్

జింకు ఆక్సైడ్ అనునది ZnO ఫార్ములా కలిగిన అకర్బన సమ్మేళనం. ఇది తెల్లని చూర్ణం. ఇది నీటిలో కరుగుతుంది. దీనిని రబ్బర్లు, ప్లాస్టిక్లు, సిరామిక్స్, గాజు, సిమెంటు, కందెనలు, రంగులు, ఆయింట్‌మెంట్లు, జిగుర్లు, పిగ్మెంట్లు, ఆహారపదార్థాలు, బ్యాటరీలు, ఫెర్రైట్లు, అగ్ని నిరోధకాలు, ప్రథమ చికిత్స టేపులు మరియు ఇతర రసాయనాల ఉత్పత్తులలో వాడుతారు. ఇది ప్రకృతిలో "జింకైట్" అనే ఖనిజం ద్వారా లభ్యమవుతుంది. ZnO అనునది II-IV అర్థవాహక వర్గంలో శక్తి అంతరం ఎక్కువగా ఉన్న అర్థవాహకం. దీనిలో ఆక్సిజన్ ఖాళీలు ఉండడం వలన లేదా జింకు మధ్యంతరాలు ఉండడం వలన n-రకం అర్థవాహకాలను తయారుచేయుటకు "మాదీకరణం" (doping) చేస్తారు. ఈ అర్థవాహకాలు అనేక అనుకూల ధర్మాలను కలిగి ఉండి మంచి కాంతి పారదర్శక పదార్థంగా, ఎలక్ట్రాన్ ప్రవాహిగా, ఎక్కువ శక్తి అంతరం కలిగిన పదార్థంగా మరియు గది ఉష్ణోగ్రత వద్ద గట్టి పదార్థంగా ఉంటుంది. ఈ ధర్మాలు అభివృద్ధి చెందుతున్న కొన్ని అనువర్తనాలకు ఉపయోగపడతాయి. అవి ద్రవ స్పటికాలలో పారదర్శక ఎలక్ట్రోడులుగా, విద్యుత్ పొదుపులోనూ, ఉష్ణ నిరోధక కిటికీలలోనూ మరియు ఎలక్ట్రానిక్స్ లో పలుచని ఫిలిం ట్రాన్సిస్టరులుగానూ, కాంతి ఉద్గారక డయోడు (LED) లలో ఉపయోగపడతాయి. స్వచ్ఛమైన ZnO తెల్లని చూర్ణం. కానీ ఇది ప్రకృతిలో అరుదైన ఖనిజమైన "జింకైట్" నుండి లభిస్తుంది. జింకైట్ ధాతువు సాధారణంగా మాంగనీస్ మరియు ఇతర మలినాలను కలిగి ఉండి పసుపు నుండి ఎరుపు రంగులలో ఏదో ఒక రంగుగా కనిపిస్తుంది.


(ఇంకా…)