వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2018 44వ వారం
దేవులపల్లి కృష్ణశాస్త్రి (నవంబర్ 1, 1897 - ఫిబ్రవరి 24, 1980) ప్రసిద్ధ తెలుగు కవి. తెలుగు భావ కవితా రంగంలో కృష్ణశాస్త్రి ఒక ప్రముఖ అధ్యాయం. ఆయన రేడియాలో లలితగీతాలు, నాటికలు, సినిమాల్లో పాటలు రాయడం ద్వారా ప్రఖ్యాతి పొందాడు. చిన్న వయసునుండే రచనలు ఆరంభించాడు. 1929 లో రవీంద్రనాధ టాగూరును కలసిన తరువాత ఆయన కవిత్వంలో భావుకత వెల్లివిరిసింది. 1945లో ఆకాశవాణిలో చేరి అనేక పాటలు, నాటికలు రచించాడు. దేవులపల్లి కృష్ణశాస్త్రి తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం దగ్గరలోని రావు వారి చంద్రపాలెం అనే గ్రామంలో ఒక పండిత కుటుంబంలో 1897 నవంబరు 1న జన్మించాడు. అతని తండ్రి, పెదతండ్రి గొప్ప పండితులు. వారింట్లో నిరంతరం ఏదో సాహిత్యగోష్ఠి జరుగుతూ ఉండేది. కృష్ణశాస్త్రి చిన్న వయసునుండే రచనలు ఆరంభించాడు. పిఠాపురంహైస్కూలులో అతని విద్యాభ్యాసం సాగింది. పాఠశాలలో తన గురువులు కూచి నరసింహం, రఘుపతి వెంకటరత్నం ఆంగ్ల సాహిత్యంలో తనకు అభిరుచి కల్పించారని దేవులపల్లి చెప్పుకొన్నాడు. 1918లో విజయనగరం వెళ్ళి డిగ్రీ పూర్తి చేసి తిరిగి కాకినాడ పట్టణం చేరాడు. పెద్దాపురం మిషన్ హైస్కూలులో ఉపాధ్యాయవృత్తి చేపట్టాడు. ఆ కాలంలో వ్యావహారిక భాషావాదం, బ్రహ్మసమాజం వంటి ఉద్యమాలు ప్రబలంగా ఉన్నాయి.
(ఇంకా…)