Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2019 03వ వారం

వికీపీడియా నుండి

శ్రీరంజని

శ్రీరంజని (సీనియర్)గా ప్రసిద్ధి చెందిన మంగళగిరి శ్రీరంజని (1906 - 1939) ప్రముఖ పాతతరం చలన చిత్ర నటి. ఈవిడ మరో నటి శ్రీరంజని (జూనియర్)కు అక్క మరియు దర్శకుడు ఎం.మల్లికార్జునరావుకు తల్లి. 1906లో గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట మండలంలోని మురికిపూడి గ్రామంలో జన్మించింది. ఈవిడ 1920, 1930లలో గ్రామోఫోన్ కంపెనీ ఆఫ్ ఇండియా వారు విడుదలచేసిన నాటకాలను రికార్డులలో గాయనిగా తన ప్రైవేటు గీతాల ద్వారా ప్రసిద్ధి పొందింది. చిత్రాలలో నటించకముందు ఈమె పౌరాణిక నాటకాలలో అభిమన్యుడు, సత్యవంతుడు, కృష్ణుడు వంటి పురుష పాత్రలు వేసేది, అప్పట్లో ఆవిడ కృష్ణ విలాస నాటక సమాజంలో సభ్యురాలు. సి.పుల్లయ్యతీసిన లవకుశ (1934) ఈవిడ మొదటి చిత్రం. ఈవిడ మొత్తం 9 చిత్రాలలో నటించింది. 1939లో క్యాన్సర్ వ్యాధి కారణంగా మరణించింది. శ్రీరంజని బెజవాడ హనుమాన్‌ దాసు గారి దగ్గర సంగీతం నేర్చుకుంది. మహాకవి కాళిదాసు (1960), ప్రమీలార్జునీయం (1965) వంటి చిత్రాల నిర్మాత కె.నాగమణి గారు కూడా హనుమాన్‌దాసు గారి దగ్గరే హార్మోనియంనేర్చుకుంది. శ్రీరంజని నాటకాలలో నటిస్తున్నప్పుడు నాగుమణి గారు హార్మోనియం వాయించేది. పరిచమయిన కొన్నాళ్ళకి వారిద్దరు భార్యాభర్తలయ్యారు. వారికి ఇద్దరు పిల్లలు కలిగారు. శ్రీరంజని తను చనిపోయేముందు పిల్లల సంరక్షణార్థం తన భర్తను తన చెల్లెలు మహాలక్ష్మిని పెళ్ళి చేసుకోమని చెప్పారు. తర్వాత ఆమె పేరును కూడా శ్రీరంజనిగా మార్చారు. ఆవిడ శ్రీరంజని జూనియర్ గా ప్రసిద్ధి పొందింది, అందువలనే శ్రీరంజనికి సీనియర్ శ్రీరంజని అని పేరు వచ్చింది.

(ఇంకా…)