వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2019 05వ వారం
వెల్చేరు నారాయణరావు ప్రముఖ తెలుగు సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు మరియు పండితుడు. బ్రిటీష్ యుగంలో భారతీయ సాహిత్యం, ముఖ్యంగా తెలుగు సాహిత్యం పాశ్చాత్య సాహిత్య పరిశోధన వల్ల ఎలాంటి ప్రథలకు లోనైందో పరిశోధించి సమగ్రమైన అధ్యయనంతో ఆ లోపాలను సరిచేసే ప్రయత్నాలు చేస్తున్న విశిష్ట పరిశోధకుడు. వెల్చేరు నారాయణరావు విశిష్టమైన అవగాహనతో, లోతైన పరిశోధనతో, విస్తృతమైన అధ్యయనంతో తెలుగు విమర్శారంగంలో తనదైన స్థానాన్ని పొందాడు.ఆయన తొలి విమర్శా గ్రంథమైన "తెలుగులో కవితా విప్లవాల స్వరూపం"లో కవిత్వంలోని విప్లవాల గురించి వివరించాడు. విప్లవాత్మక కవితల రూపం, విషయం, వ్యక్తీకరణ – ఈ పార్శ్వాలన్నీ ఆ కవిత పుట్టిన సందర్భాన్ని ప్రతిబింబిస్తాయని ఈ సిద్ధాంతసారం. వెల్చేరు నారాయణ రావు తెలుగులో, ఆంగ్లంలో పలు గ్రంథరచన, ఎన్నో ప్రామాణిక పత్రికల్లో వ్యాసరచన, పరిశోధనాత్మక గ్రంథాల్లో వ్యాసరచన ద్వారా భాగస్వామ్యం చేశాడు. అంతేకాక తెలుగు కావ్య, నాటక, నవల, కథలను ఆంగ్లంలోకి అనువదించి వాటి విశిష్టత తులనాత్మకంగా అధ్యయనం చేసి ముందుమాటలుగా రాశాడు. ఈ అనువాదాలు అంతర్జాతీయ స్థాయి ప్రామాణిక పత్రికల్లో ప్రచురించి ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల ప్రచురణలుగా వెలువరించడం వల్ల వాటికి ప్రామాణికత కట్టబెట్టి ప్రపంచ స్థాయిలో తెలుగు సాహిత్యానికి గుర్తింపు దక్కడానికి తనవంతు కృషి చేస్తున్నాడు. ఇండియన్ లిటరేచర్, జర్నల్ ఆఫ్ ఏషియన్ స్టడీస్, జర్నల్ ఆఫ్ లిటరరీ ట్రాన్స్ లేషన్, జర్నల్ ఆఫ్ సౌత్ ఏషియన్ లిటరేచర్ తదితర ప్రామాణిక చారిత్రిక, సాంస్కృతిక, సాహిత్య పత్రికల్లో ఆయన రచనలు ప్రచురణ పొందాయి.
(ఇంకా…)