Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2019 15వ వారం

వికీపీడియా నుండి

గిరీశం

గిరీశం కన్యాశుల్కం నాటకంలో గురజాడ అప్పారావు సృష్టించిన కాల్పనిక పాత్ర. కన్యాశుల్కం నాటకానికి ఉన్న తొలి, మలి కూర్పులు రెంటిలోనూ గిరీశం ప్రధాన పాత్ర. కన్యాశుల్కం నాటకంలో అతనిది ప్రధాన పాత్రే అయినా నాయక పాత్ర కాదు. కన్యాశుల్కంలో విజయనగరంలో అప్పులు, చేసిన తప్పులు చుట్టుముట్టడంతో శిష్యుడు వెంకటేశానికి చదువుచెప్పే మిషతో అతని ఊరైన కృష్ణరాయపుర అగ్రహారానికి వెళ్తాడు. అక్కడ బాల్యవివాహం వల్ల మీదపడ్డ వైధవ్యంతో కాలం గడుపుతున్న వెంకటేశం అక్క బుచ్చమ్మను ప్రేమలోకి దింపి పెళ్ళాడదామని, తద్వారా రకరకాలుగా డబ్బు, ఆస్తి కలిసివస్తుందని ఆలోచిస్తాడు. బుచ్చమ్మ చెల్లెలికీ ముసలివాడితో పెళ్ళిచేయబోగా, దాన్ని తప్పించేందుకు అని వంక పెట్టి బుచ్చమ్మను తీసుకుపోతాడు. విజయనగరంలో సంస్కర్త, న్యాయవాది అయిన సౌజన్యారావు పంతులు వద్ద వినయం నటించి నమ్మిస్తాడు. ఇతను మొదట్లో ఉంచుకున్న మధురవాణి బండారం బయటపెట్టడంతో కథ అడ్డం తిరుగుతుంది. గిరీశం వేశ్యాసాంగత్యం, మోసాలు, అబద్ధాలు, ఆడంబరాలు మరిగిన పాత్ర. అవసరానికి ఏదోక చక్రం అడ్డువేసి రోజులు గడుపుకుంటూ, వీలుంటే కొండకు వెంట్రుక వేద్దామని చూస్తూంటాడు. ఈ పాత్ర లక్ష్యం, దాని సిద్ధి, అసలు స్వభావంలోని కీలకం వంటి విషయాల మీద విమర్శకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

(ఇంకా…)