Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2019 37వ వారం

వికీపీడియా నుండి
మోక్షగుండం విశ్వేశ్వరయ్య
మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతదేశపు ప్రముఖ ఇంజనీరు, పండితుడు, రాజనీతిజ్ఞుడు. మైసూరు సంస్థానానికి 1912 నుండి 1918 దివానుగా పనిచేశాడు. 1955 లో ఆయనకు భారతదేశపు అత్యున్నత పురస్కారమైన భారతరత్న లభించింది. ఆయన ప్రజలకు చేసిన సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం తరపున ఐదవ కింగ్ జార్జి నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ బిరుదునిచ్చి సత్కరించాడు. భారతదేశంలో ఆయన జన్మదినమైన సెప్టెంబరు 15 ను ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారు. మైసూరులో గల ప్రముఖ ఆనకట్ట కృష్ణరాజ సాగర్ కు ఆయన ఛీఫ్ ఇంజనీరుగా పనిచేశాడు. హైదరాబాదును మూసీ నది వరదల నుంచి రక్షించడానికి పథకాలను రూపొందించాడు. విశ్వేశ్వరయ్య 1861, సెప్టెంబరు 15న బెంగుళూరు నగరానికి 60 మైళ్ళ దూరంలోగల చిక్కబళ్ళాపూర్ తాలూకా, ముద్దెనహళ్ళి అనే గ్రామంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు మోక్షగుండం శ్రీనివాస శాస్త్రి, వెంకటలక్ష్మమ్మ. వీరి పూర్వీకులు ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని మోక్షగుండం గ్రామానికి చెందిన వారు. మూడు శతాబ్దాల కిందట వారు మైసూరు రాష్ట్రానికి వలస వెళ్ళారు. కాబట్టి వీరు తెలుగు మాట్లాడగలిగే వారు.
(ఇంకా…)