Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2019 41వ వారం

వికీపీడియా నుండి
Mv Raghu nandi award frm NTR.jpg

ఎం. వి. రఘు

మాడపాక వెంకట రఘు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పేరు గాంచిన అవార్డులు, రివార్డులు పొందిన ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు. ఇతను వివిధ భాషలలో యాభైకి  పైగా సినిమాలకు, 10 డాక్యుమెంటరీలకు ఛాయగ్రాహణం నిర్వర్తించాడు. రెండు సినిమాలకి దర్శకత్వం వహించాడు. ఛాయగ్రాహకునిగా మరియు దర్శకునిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డులతో పాటు వివిధ సాంస్కృతిక సంస్థల నుండి యాభైకి పైగా అవార్డులు పొందిన లబ్దప్రతిష్ఠుడు. అతను1954 అక్టోబరు 5న పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో ఎం. ఎస్. చిన్నయ్య, నాగేశ్వరమ్మ దంపతులకు జన్మించాడు. అతని రైల్వే ఉద్యోగి, తల్లి గృహిణి. చిన్నయ్యకు ఫోటోగ్రఫిలో చాలా ఆసక్తి ఉండేది. తన 620 కొడాక్ బాక్స్ కెమెరాతో తరచూ ఫోటోలు తీసి స్వంతంగా డెవలప్ చేసేవాడు. వాళ్ళ ఇంట్లోనే ఒక డార్క్ రూమ్ ఉండేది. రఘుకు బాల్యం నుండే ఫోటో రీళ్ళను కడగటం వంటి పనులు బాగా అలవడ్డాయి. చిన్నయ్యకు సినిమారంగంలో అడుగుపెట్టాలని ఆశ ఉన్నా, అప్పటి పరిస్థితులు అనుకూలించక ఆ కల సాకారం కాలేదు. ఫోటోగ్రఫిలో తండ్రి అనేక అవార్డులను గెలుచుకోవటం, తనయుడైన రఘుకు పెద్దయిన తర్వాత కెమెరామెన్ కావలనే స్ఫూర్తిని కలుగజేసింది. దానికి ఆయన కుటుంబము మంచి ప్రోత్సాహాన్నిచ్చింది. తొమ్మిదేళ్ల వయసులో తండ్రికి గుంటూరు బదిలీ అవడంతో కుటుంబముతో సహా గుంటూరు వచ్చాడు. అక్కడున్న ఆ తర్వాత పదేళ్ళు రఘు, తండ్రితో పాటు గుంటూరులోని లీలామహల్ థియేటర్లో విడుదలైన ఇంగ్లీషు సినిమాలన్నీ చూసేవాడు.

(ఇంకా…)