వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2019 42వ వారం
స్వరూపం
ఉత్తర సర్కారుల్లో ఐరోపా వారి యుద్ధాలు |
---|
ఉత్తర సర్కారులపై ఆధిపత్యం కోసం ఐరోపా దేశాలైన బ్రిటిషు, ఫ్రెంచి, డచ్చి, పోర్చుగీసు దేశీయులు తమలోతాము, స్థానిక నాయకులతోనూ అనేక యుద్ధాలు చేసారు. ఈ యుద్ధాల కారణంగా ఆ ప్రాంతాలపై ఆధిపత్యం మారుతూ వచ్చింది. పర్యవసానాల పరంగా గాని, యుద్ధ ఫలితాల కారణంగా గానీ వీటిలో ప్రధానమైనవి -బొబ్బిలి యుద్ధం, చెందుర్తి యుద్ధం, మచిలీపట్నం ముట్టడి. 1758 జూలై నాటికి ఉత్తర సర్కారుల్లో ఫ్రెంచి వారి ప్రాబల్యం బలంగా ఉంది. డి బుస్సీ తిరుగులేని నాయకుడిగా ఫ్రెంచి వారి ప్రాబల్యాన్ని ఆ ప్రాంతంలో నెలకొల్పాడు. హైదరాబాదు నిజాముతో వారికి మైత్రి ఉంది. బొబ్బిలి యుద్ధం పర్యవసానంగా బొబ్బిలి సంస్థానం నేలమట్టమైంది. విజయనగర రాజు, బుస్సీకి అనుంగు అనుచరుడూ అయిన విజయరామరాజు ఈ యుద్ధాంతాన హతుడయ్యాడు. అతడి స్థానంలో వరుసకు అతడి సోదరుడు ఆనందరాజు రాజయ్యాడు. విజయరామరాజు మరణించాక, వారసత్వం విషయంలో బుస్సీ చేసిన ఏర్పాటు పట్ల అతడు ఆగ్రహంగా ఉన్నాడు. ఈ లోగా బుస్సీ, నిజాము కోరిక మీద అతడికి సాయం చేసేందుకు ఔరంగాబాదు వెళ్ళాడు. ఆ సమయంలో, ఆనందరాజు విశాఖపట్నాన్ని (తెల్లవారు విజాగపటం అనేవారు) ఆక్రమించుకుని అక్కడ ఉన్న ఫ్రెంచి సేనానిని బందీగా పట్టుకున్నాడు. (ఇంకా…) |