వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2019 48వ వారం
స్వరూపం
మహారాజా నందకుమార్ |
---|
బెంగాల్ కు చెందిన మహారాజా నందకుమార్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో బర్ద్వాన్, నదియా, హుగ్లీ జిల్లాలకు పన్ను వసూళ్ళ అధికారి. సమకాలీన పత్రాలలో "నున్ కొమార్" గా వ్యవహరించబడ్డాడు. నాటి బెంగాల్ గవర్నర్ జనరల్ అయిన వారన్ హేస్టింగ్స్ యొక్క క్రౌర్యానికి బలియైన వారిలో నందకుమార్ ప్రముఖుడు. వారన్ హేస్టింగ్స్ చేసిన అవినీతి గురించి సాక్షాధారాలతో బెంగాల్ సుప్రీమ్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేసిన అనంతరం ఒక కల్పిత ఫోర్జరీ చేసిన కేసులో ఇరికించబడ్డాడు. విలియం ఫోర్ట్ లోని సుప్రీమ్ కోర్ట్ లో విచారించబడి 1775 ఆగస్టు 5 న కలకత్తాలో బహిరంగంగా ఉరి తీయబడ్డాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో ఒక బ్రిటిష్ కోర్ట్ తీర్పు ద్వారా ఉరితీయబడ్డ తొలి వ్యక్తి మహారాజా నందకుమార్. మహారాజా నందకుమార్ పై జరిగిన నేర విచారణ కేసును "న్యాయాన్ని అవహేళన చేసిన కేసు" గా చరిత్రకారులు పరిగణిస్తారు. ఇతని ఉరితీతను బ్రిటిష్ ఇండియాలో జరిగిన "తొలి న్యాయ హత్య" గా ఎడ్మండ్ బర్కీ, లార్డ్ మెకాలే లాంటి బ్రిటిష్ ప్రముఖులు పేర్కొన్నారు. మహారాజ నందకుమార్ పై జరిగిన నేర విచారణ – విధించిన మరణదండన తీవ్ర విమర్శకు గురై బ్రిటిష్ పార్లమెంటును కుదిపింది. (ఇంకా…) |