Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2019 52వ వారం

వికీపీడియా నుండి

చరణ్ సింగ్

చౌదరి చరణ్ సింగ్ (1902 డిసెంబరు 23 - 1987 మే 29) భారతదేశానికి 5వ ప్రధానమంత్రిగా 1979 జూలై 28 నుండి 1980 జనవరి 14 వరకు తన సేవలనందించాడు. చరిత్రకారులు, ప్రజలు తరచూ అతనిని 'భారతదేశపు రైతుల విజేత' గా గుర్తించారు. చరణ్ సింగ్ 1902లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రము, మీరట్ జిల్లాలోని నూర్‌పూర్ గ్రామంలోని జాట్ కులంలో జన్మించాడు. అతను మహాత్మా గాంధీ అద్వర్యంలో జరిగిన భారత స్వాతంత్ర్యోద్యమంలో చేరాడు. అతను గజియాబాద్ జిల్లాలోని ఆర్యసమాజ్, అదే విధంగా మీరట్ జిల్లాలోని భారత జాతీయ కాంగ్రెస్ లలో 1931 నుండి క్రియాశీలకంగా ఉన్నాడు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో రెండు సార్లు జైలు పాలయ్యాడు. భారత స్వాతంత్ర్యానికి ముందు అతను 1937 లో యునైటెడ్ ప్రొవిన్సెస్ శాసనసభలో సభ్యునిగా ఉన్నాడు. అతను గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించే చట్టాలపై ఎక్కువ ఆసక్తిని కనబర్చేవాడు. భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా తన సైద్ధాంతిక, ఆచరణాత్మక విధానాన్ని నిర్మించాడు. 1962 - 1967 మధ్య కాలంలో అతను "రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలలోని ముగ్గురు ప్రధాన నాయకుల"లో ఒకనిగా ఉన్నాడు.  1950లలో ఉత్తరప్రదేశ్ లోని అప్పటి ముఖ్యమంత్రి పండిట్ గోవింద్ వల్లబ్ పంత్ పర్యవేక్షణలో భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని అత్యంత విప్లవాత్మక భూ సంస్కరణల చట్టాలను రూపొందించడంలోను, వాటిని ఆమోదించడంలోనూ చరణ్ సింగ్ మంచి గుర్తింపు పొందాడు.

(ఇంకా…)