వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2020 16వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
న్యాయపతి రాఘవరావు
న్యాయపతి రాఘవరావు (ఏప్రిల్ 13, 1905 - ఫిబ్రవరి 24, 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు రచయిత. 1905వ సంవత్సరం ఏప్రిల్ 13 న ఒరిస్సాలోని బరంపురం లో జన్మించాడు. తండ్రి న్యాయపతి రామానుజస్వామి ప్రముఖ న్యాయవాది. రాఘవరావుకి బాల్యం నుంచి పిల్లలంటే ప్రాణం. వారికి కథలు చెప్పటమన్నా, నటించి చూపటమన్నా మహా ఇష్టం. పాఠశాలలో వక్తృత్వ పోటీల్లో కథలు చెప్పే పోటీల్లో ప్రథమ బహుమతులన్నీ అతని సొత్తే. పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసి మద్రాసు లో పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసి, దానికి రాజీనామా చేసి. ఆకాశవాణిలో కాంట్రాక్టు పద్ధతిపైన చేరాడు. ఆ రోజుల్లో బీ.బీ.సీ లోని పిల్ల కార్యక్రామాల తరహాలో మనదేశంలో కూడ రేడియో చిన్న పిల్లల కొరకు రేడియో ప్రసారలను ఆరంబించాలని అప్పటి ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఒక నిర్ణస్యం తీసుకుంది. మద్రాసు రేడియోలో పిల్లల కార్య క్రమాలను దుర్గాభాయ్ దేశముఖ్ నిర్వహించేవారు. 1933 లో రాఘవ రావు, కామేశ్వరి జంటకు ఆ అవకాశం వరించింది. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు రేడియో అన్నయ్య గా పేరొందారు. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్........ పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు.
(ఇంకా…)