వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2020 18వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్
జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది అంతరిక్షంలో ఉండి పనిచేసే టెలిస్కోపు. దీన్ని హబుల్ స్పేస్ టెలిస్కోప్ కు వారసురాలిగా రూపకల్పన చేసారు. జేమ్స్ వెబ్ లో హబుల్ కంటే మెరుగైన పరారుణ రిజల్యూషన్, సున్నితత్వం ఉన్నాయి. విశ్వంలో తొలి గెలాక్సీలు ఏర్పడడం వంటి కొన్ని సుదూర సంఘటనలను, వస్తువులనూ పరిశీలించడంతో సహా ఖగోళ శాస్త్రానికీ, విశ్వం ఆవిర్భావానికీ సంబంధించిన రంగాలలో విస్తృతమైన పరిశోధనలు దీని ద్వారా చెయ్యవచ్చు. నక్షత్రాలు, గ్రహాల ఆవిర్భావాన్ని అర్థం చేసుకోవడం, బయటి గ్రహాలను, నోవాలనూ నేరుగా పరిశీలించడం మొదలైనవి జేమ్స్ వెబ్ ద్వారా కలిగే ఇతర ప్రయోజనాలు. జేమ్స్ వెబ్ ప్రాథమిక దర్పణాన్ని ఆప్టికల్ టెలిస్కోప్ ఎలిమెంట్ అంటారు. ఇది బెరీలియంతో తయారు చేసి, బంగారు పూత పూసిన 18 షట్కోణ ఫలకాలతో కూడుకున్న పెద్ద దర్పణం. దీని వ్యాసం 6.5 మీటర్లు. 2.4 మీటర్ల హబుల్ టెలిస్కోపు దర్పణం కంటే ఇది చాలా పెద్దది. హబుల్, సమీప అతినీలలోహిత, దృగ్గోచర, పరారుణ (0.1 నుండి 1 μm) వర్ణపటం లోని వికిరణాన్ని గమనిస్తుంది. జేమ్స్ వెబ్ ఇంకా తక్కువ పౌన:పున్యం (ఫ్రీక్వెన్సీ) లో, దీర్ఘ-తరంగదైర్ఘ్యం గల దృగ్గోచర కాంతి నుండి మధ్య-పరారుణ (0.6 నుండి 28.3 μm) వరకు గమనిస్తుంది.
(ఇంకా…)