Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2020 35వ వారం

వికీపీడియా నుండి

ఆంటోనీ లావోయిజర్

ఆంటోనీ-లారెంట్ఆం డి లావోయిజర్ (ఆంటోనీ లావోయిజర్) (1743 ఆగస్టు 26 - 1794 మే 8) ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త. రసాయన శాస్త్రంలో అతను చేసిన కృషికి గుర్తింపుగా ఆయనను "ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు" అని పిలుస్తారు. అతను "హిస్టరీ ఆఫ్ కెమిస్ట్రీ" , "హిస్టరీ ఆఫ్ బయాలజీ" గ్రంధాల రచనతో మంచి గుర్తింపు పొందాడు. దహన చర్యలను గురించి అధ్యయనం చేసాడు. పదార్థాల భౌతిక స్థితులకు సంబంధం లేకుండా క్రియాజనకాల, క్రియాజన్యాల ద్రవ్యరాశులను ఖచ్చితంగా లెక్కించగలిగాడు. తన పరిశీలనల ఆధారంగా ద్రవ్యనిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించాడు. దహన క్రియలో ఆక్సిజన్ పాత్రను ఆవిష్కరించడం ద్వారా ప్రసిద్ధుడైనాడు. ఆక్సిజన్ కు 1778లో, హైడ్రోజన్ కు 1783 లలో నామకరణం చేసింది ఈయనే. మెట్రిక్ వ్యవస్థ నిర్మాణంలో సహాయపడ్డాడు. మొదటిసారి విస్తృతమైన మూలకాల జాబితాలను రాసాడు. ఇది రసాయన పదార్థాల నామీకరణ విధానానికి దోహదపడింది. సిలికాన్ మూలక ఉనికిని 1787లో అంచనా వేసాడు. సల్ఫర్ (గంధకం) ఒక మూలకమని మొదటిసారి తెలియజేసాడు. పదార్థం దాని స్థితిలోనూ, ఆకారంలో మార్పు వచ్చినప్పటికీ దాని ద్రవ్యరాశిలో మార్పు ఉండదని నిరూపించాడు. ఆయన పారిస్ నగరంలో ఉన్నత వర్గానికి చెందిన సంపన్న కుటుంబంలో ఆగష్టు 26, 1743 న జన్మించాడు. అతని తండ్రి పారిస్ పార్లమెంటులో న్యాయవాదిగా ఉండేవాడు. అతనికి ఐదు సంవత్సరాల వయసులో తన తల్లి మరణించింది. పారిస్ విశ్వవిద్యాలయం లోని కాలేజ్ డెస్ క్వారె లో పాఠశాల తన 11వయేట 1754లో విద్యను ప్రారంభించాడు.


(ఇంకా…)