Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2020 42వ వారం

వికీపీడియా నుండి
మహారాష్ట్ర
మహారాష్ట్ర భారతదేశంలో వైశాల్యపరంగా మూడవ పెద్దరాష్ట్రం, జనాభా పరంగా రెండవ పెద్ద రాష్ట్రం (ఉత్తరప్రదేశ్ తరువాతి స్థానం). మహారాష్ట్రకు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్నాటక, గోవా రాష్ట్రాలతోనూ, కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా-నగరుహవేలి తోనూ సరిహద్దులున్నాయి. పశ్చిమాన అరేబియా సముద్రం ఉంది. ముంబయి నగరం మహారాష్ట్ర రాజధాని, అతిపెద్ద నగరం. మహారాష్ట్ర ప్రాంతము ఋగ్వేదంలో రాష్ట్రఅనీ, అశోకుని శాసనాలలో రాష్ట్రీకము అనీ, అతరువాత హువాన్‌త్సాంగ్ వంటి యాత్రికుల రచనలలో మహారాష్ట్ర అనీ ప్రస్తావింపబడింది. మహారాష్ట్రి అనే ప్రాకృత పదం నుండి ఈ పేరు రూపాంతరం చెంది ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ విషయమై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మహాకాంతార (అంటే పెద్ద అడవులు) అన్నపదం నుండి మహారాష్ట్ర పదం పుట్టిందని అంటారు. అయితే ఈ విశ్లేక్షణలకు బలమైన ఆధారాలు లేవు. మహారాష్ట్ర గురించి క్రీ.పూ. 3వ శతాబ్దం నుండే లిఖితపూర్వకమైన ఆధారాలు లభించాయి. అప్పుడు మహారాష్ట్రి అనే భాషగురించి ప్రస్తావన జరిగింది. ఒకప్పుడు ఈ ప్రాంతం "దండకారణ్యం" అనబడింది. తరువాత అశోకుడు పాలించిన మగధ సామ్రాజ్యంలో మహారాష్ట్ర ఒక భాగమైంది. ఇప్పటి ముంబాయి నగరానికి ఉత్తరాన ఉన్న సోపార రేవు పట్టణంనుండి కొచ్చి (భారతదేశం) తోను, తూర్పు ఆఫ్రికా, మెసపొటేమియా లతోను వర్తక సంబంధాలుండేవి.
(ఇంకా…)