Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2021 03వ వారం

వికీపీడియా నుండి
కొండపల్లి శేషగిరి రావు
కొండపల్లి శేషగిరి రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు. భారతీయ సాంప్రదాయ చిత్రలేఖనంలో కృషి చేశాడు. ఆయన వరంగల్ జిల్లా, పెనుగొండ గ్రామంలో ఒక బ్రాహ్మణ భూస్వామ్య కుటుంబంలో జన్మించాడు. బెంగాల్ శాంతినికేతన్ లో చిత్రలేఖనం అభ్యసించి, జె ఎన్ టి యు ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో అధ్యాపకుడిగా వృత్తి జీవితం మొదలు పెట్టాడు. అతని చిత్రలేఖనాప్రస్థానం అప్రతిహతంగా సాగింది. అతని చిత్రాలలో శకుంతల, దమయంతి, రామాయణం వంటి పురాణాలలోని వివిధ సన్నివేశాలు పలువురి ప్రశంసలు అందుకున్నాయి. డాక్టరేట్లు, హంస అవార్డులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదరించింది. అతని చిత్రాలను దేశ పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీ, సాలార్ జంగ్ మ్యూజియంలలో ప్రదర్శించారు. చిన్నతనంలోనే ఆయనలోని సృజనాత్మకతను పరిశీలించిన ఆ పాఠశాల డ్రాయింగ్‌ మాస్టర్‌ దీనదయాళ్‌ ఆనాడే కొండపల్లి గొప్ప కళాకారుడవుతాడని గ్రహించారు. చుట్టూ వ్యాపించి ఉన్న కళాసంపద ఆయన కళాభిమానాన్ని తట్టిలేపింది. వేయిస్తంభాల గుడిలోని ప్రతీ స్తంభం ఆయనకు రోజుకో పాఠం చెప్పింది. రామప్ప గుడి ఆయన్ని తన హృదయాంతరాలలో నింపుకుంది. ఆ గుడిలోని శిల్ప సౌందర్యం, శిల్పక్షేత్రాల శిల్పకళా సొగసులను సుదీర్ఘ, సునిశిత అధ్యయనంతో తన సొంతం చేసుకొన్న కొండపల్లి వాటినుంచి స్ఫూర్తిపొంది కొన్ని వందల చిత్రాలతో ఆ శిల్పకళకు దర్పణం పట్టారు. శిల్పుల మనోగతాల్ని, వారి అభిరుచిలో తొంగిచూసిన ప్రత్యేకతల్ని, విశిష్టతల్ని తాను అవగతం చేసుకోవడమే కాక ప్రజా బాహుళ్యానికి చాటే ప్రయత్నం చేశారు.(ఇంకా…)