వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2021 26వ వారం
స్వరూపం
కె.వి.రెడ్డి |
---|
కదిరి వెంకటరెడ్డి (1912 జూలై 1- 1972 సెప్టెంబరు 15) తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత. తెలుగు సినిమా స్వర్ణయుగంగా భావించే కాలంలో విజయవంతమైన, విమర్శకులు ఆణిముత్యాలుగా అభివర్ణించిన పలు సినిమాలు తీసిన దర్శకుడు. అతను దర్శకునిగా మొత్తం 14 సినిమాలు తీయగా వాటిలో 10 వాణిజ్యపరంగా మంచి విజయాన్ని సాధించినవే. దర్శకునిగా దాదాపు మూడు దశాబ్దాల కాలం పనిచేశాడు.
కె.వి.రెడ్డి చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో తన మేనమామల వద్ద పెరిగాడు. చిన్నతనంలో అతని అల్లరికి పట్టపగ్గాలు ఉండేవి కాదు. చదువూ చక్కగానే చదివేవాడు. తర్వాతి కాలంలో తనను సినిమా రంగంలోకి తీసుకువచ్చి దర్శకుడిని చేసిన వ్యాపారవేత్త మూలా నారాయణస్వామితో తాడిపత్రి లోనే కలిసి చదువుకున్నాడు. మేనమామల ప్రోద్బలంతో, సహాయంతో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చేరిన కె.వి. అక్కడే మెట్రిక్, డిగ్రీ పూర్తిచేశాడు. ఉద్యోగ ప్రయత్నాలు విఫలమై, చిన్న వ్యాపారం చేస్తూండగా మూలా నారాయణస్వామి పిలవగా సినిమా నిర్మాణ శాఖలో కెరీర్ ప్రారంభించాడు. |