Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2021 35వ వారం

వికీపీడియా నుండి
మహాభాగవతం

మహాభాగవతం లేదా భాగవత పురాణం లేదా శ్రీమద్భాగవతం హిందూ మత సంప్రదాయంలోనూ, సాహిత్యంలోనూ, ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణం. ఇది భగవంతుని కథ గాను, భగవంతునికి శరణాగతులైన భక్తుల కథగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాథ. ప్రధానంగా విష్ణువు, కృష్ణుడు, ఇతర భగవదవతారాలు గురించి ఈ గ్రంథంలో చెప్పబడ్డాయి.

ఋషుల కోరికపై సూతుడు తాను శుక మహర్షి ద్వారా విన్న ఈ భాగవత కథను వారికి చెప్పినట్లుగాను, దానిని వేద వ్యాసుడు గ్రంథస్తం చేసినట్లుగాను ఈ కథ చెప్పబడింది. భాగవతంలో వివిధ భాగాలను "స్కంధాలు" అంటారు. వివిధ స్కంధాలలో భగవంతుని అవతార కార్యాల వర్ణనలు, భక్తుల గాథలు, పెక్కు తత్వ బోధలు, ఆరాధనా విధానాలు, ఆధ్యాత్మికమైన సంవాదాలు పొందుపరచబడినాయి. భగవంతుని లీలలు సవివరంగా వర్ణింపబడ్డాయి. అతని 21 అవతారాలు వర్ణింపబడ్డాయి. వైష్ణవులందరికీ ఇది పరమ పవిత్రమైన గ్రంథం. ఇది మొత్తం ద్వాదశ (12) స్కంధములుగా విభజించబడింది.
(ఇంకా…)