వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2021 36వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాగార్జునసాగర్

నాగార్జున సాగర్ తెలంగాణ లోని నల్గొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా సరిహద్దుల్లో కృష్ణానదిపై నిర్మింపబడిన ఆనకట్ట వల్ల ఏర్పడిన జలాశయం. ఇది దేశంలోని జలాశయాల సామర్థ్యంలో రెండవ స్థానంలో, ఆనకట్ట పొడవులో మొదటి స్థానంలో ఉంది. కృష్ణానదిపై నిర్మించబడ్డ ఆనకట్టల్లో నాగార్జునసాగర్ అతి పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఈ ప్రాంతానికున్న చారిత్రక ప్రాధాన్యం వలన ఈ ప్రాజెక్టుకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు అని పేరుపెట్టారు. నాగార్జునసాగర్ ప్రముఖ బౌద్ధ చారిత్రక స్థలం. శాతవాహనుల కాలమునాటి శ్రీ పర్వతమే నాగార్జున కొండ. ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతంలో బోధనలు చేసినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. జలాశయం నిర్మాణ సమయంలో ఇక్కడ లభించిన అమూల్యమయిన చారిత్రక కట్టడాల శిథిలాలను జలాశయం మధ్యలో నాగార్జునకొండ ప్రదర్శనశాలలో భద్ర పరచారు. ఈ జలాశయానికి 11,560 మిలియన్ ఘనపు మీటర్ల నీటిని నిలువ చేయగల సామర్థ్యం ఉంది. దీని ద్వారా నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సాగునీరు అందించ బడుతున్నది. ఇక్కడ జల విద్యుత్ కేంద్రాలున్నాయి.
(ఇంకా…)