వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2021 49వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మొదటి ప్రపంచ యుద్ధం

మొదటి ప్రపంచ యుద్ధం, ఐరోపాలో ఉద్భవించిన ప్రపంచ యుద్ధం. ఈ యుద్ధం1914 జూలై 28 నుండి 1918 నవంబరు 11 వరకు జరిగింది. దీనిని మహా యుద్ధం (గ్రేట్ వార్) అనీ, అన్ని యుద్ధాలనూ ముగించే యుద్ధం (వార్ టు ఎండ్ ఆల్ వార్స్) అని కూడా పిలుస్తారు. ఇది చరిత్రలో అతిపెద్ద యుద్ధాల్లో ఒకటిగా నిలిచింది. 6 కోట్ల మంది యూరోపియన్లతో సహా మొత్తం 7 కోట్ల మంది సైనిక సిబ్బంది ఈ యుద్ధంలో పాల్గొన్నారు. 90 లక్షల మంది సైనికులు, 70 లక్షల మంది పౌరులూ మరణించారు. ఆస్ట్రియాకు చెందిన ఆర్చ్‌డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్‌ హత్య ఈ యుద్ధానికి నాంది పలికింది. ఆస్ట్రియా-హంగరీ సింహాసనానికి వారసుడైన ఆర్చ్‌డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్‌ను 1914 జూన్ 28 న సారయెవోలో యుగోస్లావ్ జాతీయవాది గవ్రిలో ప్రిన్సిప్ హత్య చేయడంతో జూలై సంక్షోభం తలెత్తింది. ఈ హత్యకు స్పందనగా జూలై 23 న ఆస్ట్రియా-హంగరీ సెర్బియాకు అల్టిమేటం ఇచ్చింది. దానికి సెర్బియా ఇచ్చిన సమాధానం వారిని సంతృప్తిపరచలేదు. రెండు దేశాలూ యుద్ధానికి సిద్ధపడ్డాయి.

ఈ యుద్ధంలో ఐరోపా లోని గొప్ప శక్తులన్నీ రెండు ప్రత్యర్థి కూటములుగా ఏర్పడ్డాయి. అవి: ట్రిపుల్ ఎంటెంట్ (రష్యా సామ్రాజ్యం, ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్), ట్రిపుల్ అలయన్స్ (జర్మనీ, ఆస్ట్రియా-హంగరీ, ఇటలీ). తదనంతర కాలంలో ట్రిపుల్ ఎంటెంట్ కు మిత్రరాజ్యాలు అని, ట్రిపుల్ అలయన్స్ కు సెంట్రల్ పవర్స్ అనీ పేర్లు వచ్చాయి. ట్రిపుల్ అలయన్స్ స్థాపనోద్దేశం ఆత్మ రక్షణే కానీ, దాడి చెయ్యడం కాదు. ఈ కారణం వల్లనే ఇటలీ 1915 ఏప్రిల్ దాకా యుద్ధంలో దిగలేదు. ఆ తరువాత ఆస్ట్రియా-హంగరీతో ఉన్న విభేదాల కారణంగా, అది ట్రిపుల్ అలయన్స్ నిబంధనలకు వ్యతిరేకంగా దాడి మొదలుపెట్టిందని చెబుతూ ఇటలీ, అలయన్స్ నుండి బయటికి వచ్చి మిత్రరాజ్యాల పక్షాన యుద్ధంలో చేరి పోరాడింది. ఈ కూటములు రెండూ తరువాతి కాలంలో మరిన్ని దేశాలు చేరడంతో విస్తరించాయి. ఇటలీ, జపాన్, అమెరికాలు మిత్రరాజ్యాలతో చేరాయి. ఓట్టోమన్ సామ్రాజ్యం, బల్గేరియాలు సెంట్రల్ పవర్స్‌తో చేతులు కలిపాయి.
(ఇంకా…)