వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 02వ వారం
ఓజోన్ క్షీణత |
---|
సూర్యకాంతిలోని అతినీలలోహిత కిరణాలను దిగువ స్ట్రాటోస్ఫియరులో ఉండే ఓజోన్ వాయువు శోషించుకుని (పీల్చుకుని) భూమిని రక్షిస్తుంది. ఓజోన్ సాంద్రత అధిక మోతాదులో ఉండే ఈ ప్రాంతాన్ని ఓజోన్ పొర అని, ఓజోన్ కవచం అనీ అంటారు. ఈ ఓజోన్ పొరలో ఓజోన్ సాంద్రత తగ్గడాన్ని ఓజోన్ క్షీణత అని అంటారు. ఓజోన్ క్షీణతకు సంబంధించి 1970 ల చివరి నుండి గమనించిన రెండు సంఘటన లున్నాయి: భూ వాతావరణంలోని మొత్తం ఓజోన్‌లో (ఓజోన్ పొర) నాలుగు శాతం క్రమంగా తగ్గడం ఒకటి, వసంతకాలంలో భూమి ధ్రువ ప్రాంతాల చుట్టూ స్ట్రాటోస్ఫియరు లోని ఓజోన్‌లో పెద్దయెత్తున తగ్గుదల రెండోది. ఈ రెండో దృగ్విషయాన్ని ఓజోన్ రంధ్రం అంటారు. ఈ స్ట్రాటోస్ఫియరు సంఘటనలతో పాటు వసంతకాలంలో ధ్రువీయ ట్రోపోస్పిరిక్ ఓజోన్ క్షీణించిన సంఘటనలు కూడా ఉన్నాయి. "ఓజోన్ రంధ్రం" 1982 లో మొట్టమొదటిసారిగా కనుగొన్నప్పటి నుండి 2019 లోనే అత్యంత చిన్న పరిమాణంలో ఉందని నాసా ప్రకటించింది.
|