వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 10వ వారం
చాద్ |
---|
చాద్ (ఆంగ్లం: Chad) మధ్య ఆఫ్రికా లోని ఒక భూపరివేష్టిత దేశం. అధికారిక నామం చాద్ గణతంత్రం ("రిపబ్లిక్ ఆఫ్ చాద్"). ఉత్తరాన లిబియా, తూర్పున సుడాన్, దక్షిణంగా సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, వాయువ్యంగా కామెరూన్, నైజీరియా, పశ్చిమంగా నైగర్ దీనికి సరిహద్దులుగా ఉన్నాయి. ఇక్కడి జనాభా సుమారు 1.60 కోట్లు. ఇందులో 16 లక్షలమందికి పైగా రాజధాని అంజమేనా నగరంలో నివసిస్తున్నారు. చాద్ ను పలు ప్రాంతాలుగా విభజించవచ్చు. ఉత్తరాన ఎడారి ప్రాంతం, మధ్యలో ఉష్ణమండల సహేలియన్ ప్రాంతం, దక్షిణాన సారవంతమైన సుడాన్ సవన్నా ప్రాంతం ఉన్నాయి. ఆఫ్రికాలోని రెండవ అతిపెద్ద సరస్సు అయిన చాద్ పేరు మీదుగా ఈ దేశానికా పేరు వచ్చింది. చాద్ సరస్సు ఆఫ్రికాలోనే అతిపెద్ద తడి ప్రాంతం. చాద్ అధికార భాషలు అరబిక్, ఫ్రెంచి. ఇక్కడ సుమారు 200కి పైగా జాతుల, భాషల వారు నివసిస్తున్నారు. ఇస్లాం (51.8%), క్రైస్తవం (44.1%) ఇక్కడ ప్రధానంగా ఆచరించే మతాలు. సా.పూ 7వ సహస్రాబ్ది మొదట్లో ఇక్కడ మానవులు నివసించారు. సా.పూ 1వ సహస్రాబ్దిలో సహేలియన్ భూభాగంలో అనేక చిన్న రాజ్యాలు ఏర్పడి కొంతకాలానికి అంతరించి పోయాయి. వీరంతా ఈ ప్రాంతం గుండా వెళ్ళే సహారా రవాణా మార్గాలను నియంత్రించడానికి ప్రయత్నించారు. 1920 లో దీనిని ఫ్రాన్స్ ఆక్రమించి తమ ఫ్రెంచి ఈక్విటోరియల్ ఆఫ్రికా వలస ప్రాంతంలో భాగం చేసుకున్నది. 1960 లో ఫ్రాంకోయిస్ టొంబల్‌బయె నాయకత్వంలో ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఉత్తర భాగంలో ముస్లింలలో ఇతని విధానాల పట్ల వచ్చిన వ్యతిరేకత వల్ల 1965 లో అంతర్యుద్ధం ఏర్పడింది. 1979 లో విప్లవకారులు అప్పటి పాలనను అంతం చేశారు కానీ అధికారం కోసం అంతర్గతంగా కుమ్ములాటలు మొదలయ్యాయి. హిసేనీ హబ్రి వచ్చి ఈ పరిస్థితిని చక్కదిద్ది అధికారంలోకి వచ్చాడు. 1978 లో చాద్ లిబియా మధ్య యుద్ధం వచ్చింది. అప్పుడు ఫ్రాన్స్ కలుగ జేసుకుని 1987 సంవత్సరంలో ఈ యుద్ధాన్ని అణిచివేసింది. 1990 హబ్రిని అతని కింద పనిచేసే సైనికాధికారి ఇద్రిస్ దెబీ పడగొట్టి అధికారంలోకి వచ్చాడు. 1991 లో సరికొత్తగా చాద్ నేషనల్ ఆర్మీ ఏర్పాటయింది. 2003 నుంచి సుడాన్ తో ఏర్పడ్డ సరిహద్దు విబేధాల వల్ల ఆ దేశం నుంచి వలస వచ్చిన వారితో ఈ దేశం మరిన్ని కష్టాల్లో పడింది. చాద్ రాజ్యాంగంలో అనేక పార్టీలకు అవకాశం ఉన్నా దెబీ విధానాలతో ప్రతిపక్షాలకు సరైన అవకాశం లేకుండా పోయింది. 2021 ఏప్రిల్ లో దెబీని కొంతమంది విప్లవ కారులు చంపేయడంతో అతని కుమారుడు మహమత్ దెబీ, సైన్యాధికారులతో కలిసి మధ్యంతర సంఘం ఏర్పాటు చేసి నేషనల్ అసెంబ్లీని రద్దు చేసి తాత్కాలిక ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. చాద్ దీర్ఘకాలంగా అనేక రాజకీయ పోరాటాల మధ్య హింసను ఎదుర్కొన్నది. మానవ అభివృద్ధి సూచీ ప్రకారం అట్టడుగు స్థాయిలో ఉన్నది. 2003 నుంచి ఈ దేశంలో ముడి చమురు నిక్షేపాలు కనుగొని వాటి వ్యాపారం ప్రారంభించారు. అంతకుమునుపు వీరు ఎక్కువగా పత్తి ఎగుమతి చేసేవారు. మానవ హక్కుల ఉల్లంఘన కూడా ఈ దేశంలో ఎక్కువగా ఉన్నది.
|