Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 29వ వారం

వికీపీడియా నుండి
భారత స్వాతంత్ర్య చట్టం 1947

భారత స్వాతంత్ర్య చట్టం 1947 అన్నది బ్రిటిషు ఇండియాను భారతదేశం, పాకిస్తాన్ అన్న రెండు స్వతంత్ర డొమినియన్లుగా విభజించేందుకు యునైటెడ్ కింగ్ డమ్ పార్లమెంటు చేసిన చట్టం. జూలై 18, 1947న ఈ చట్టం రాజసమ్మతి పొందింది, భారత స్వాతంత్ర్యం, పాకిస్తాన్ ఏర్పాటు ఆగస్టు 15 తేదీన జరిగాయి. ఐతే వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటన్ ఆగస్టు 15వ తేదీన అధికార బదిలీ కోసం ఢిల్లీలో ఉండవలసి రావడంతో, పాకిస్తాన్ 14 ఆగస్టు 1947న ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది. సంప్రదింపుల అనంతరం జవహర్ లాల్ నెహ్రూ, వల్లభ్ భాయి పటేల్, ఆచార్య కృపలానీ ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ, మహమ్మద్ అలీ జిన్నా, లియాఖత్ అలీ ఖాన్, అబ్దుల్ రబ్ నిష్తార్ ల ప్రాతినిధ్యంలోని ముస్లిం లీగ్, సిక్ఖుల ప్రతినిధిగా సర్దార్ బల్దేవ్ సింగ్ లతో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ మౌంట్‌బాటన్ ఒప్పందానికి వచ్చాక, యు.కె. ప్రధానమంత్రి క్లెమెంట్ అట్లీ ప్రభుత్వం, భారత గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ కలిసి చట్టాన్ని తయారుచేశారు. అధికార బదిలీ కోసం సంప్రదింపులు చేసేందుకు వచ్చిన క్యాబినెట్ మిషన్ సమైక్య భారత సమాఖ్య ప్రతిపాదన (మే 16 ప్రతిపాదన) కు కాంగ్రెస్, ముస్లిం లీగ్ ల ఆమోదం లభించింది. కానీ క్యాబినెట్ మిషన్ సభ్యుడు క్రిప్స్ ఎవరికి అనుకూలమైన నిర్వచనం వారికి చెప్తూ ఆమోదం పొందడంతో వారు వెళ్ళగానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జవహర్ లాల్ నెహ్రూ ప్రసంగిస్తూ దాన్ని పూర్తిగా తిరస్కరించాడు. దాంతో ఆగ్రహించిన ముస్లిం లీగ్ నాయకుడు జిన్నా ప్రత్యక్ష కార్యాచరణ దినానికి పిలుపునిచ్చారు.
(ఇంకా…)