వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 34వ వారం
మహాడ్ సత్యాగ్రహం |
---|
మహాడ్ సత్యాగ్రహం ఊరి చెరువు నుండి మంచినీరు తాగడానికి బి.ఆర్. అంబేడ్కర్ ఆధ్వర్యంలో దళితులు చేసిన శాంతియుత విప్లవం. ఇది ప్రస్తుత మహారాష్ట్ర రాష్ట్రంలోని రాయగడ జిల్లాలో ఉన్న మహాడ్ ప్రాంతంలో 1927లో మార్చి 21వ తేదీన జరిగింది. దీనినే చవదార్ చెరువు సత్యాగ్రహం అనీ, మహాడ్ ముక్తిసంగ్రామం అనీ పిలుస్తారు. ఈ సంఘటనని తలుచుకుంటూ ఈరోజుని భారతదేశంలో సామాజిక సాధికారికత దినోత్సవంగా జరుపుకుంటారు. సైనిక ఉద్యోగాల నుంచి పెన్షన్ పుచ్చుకున్న మహార్ జాతికి చెందిన జనం మహాద్‌లో నివాసాలు ఏర్పరచుకున్నారు. మహాద్‌లో బాబా సాహెబ్ మూడు సూత్రాలను సూచించాడు. అవి -1. చనిపోయిన జంతువుల మాంసాన్ని తినడం మానెయ్యండి. 2. ఎంగిలి భోజనాన్ని స్వీకరించకండి. 3. పెద్దా, చిన్నా అన్న ఆలోచన మనస్సులోంచి తీసేసి ఉన్నత వర్గాల జీవన విధానాలని స్వీకరించండి. వ్యవసాయాన్ని కూడా వృత్తిగా చేపట్టండి అని సలహా ఇచ్చాడు. భారతీయ కుల వ్యవస్థలో దళితులు ఎన్నో విధాల వివక్షకు గురయ్యారు. ఇందులో ఒకటి జనం నీళ్ళు తాగడం కోసం ఉన్న చెరువులను వాళ్ళని వాడుకోనివ్వకపోవడం. దీనికి వ్యతిరేకంగా బాంబే రాష్ట్ర శాసనమండలి 1923 ఆగస్టులో ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో ఉన్న చెరువులలో ఎవరైనా నీళ్ళు తాగవచ్చని ఒక తీర్మానాన్ని ప్రతిపాదించింది. `మహాద్ చెరువు సార్వజనికమైనది, దీని నీటిని అస్పృశ్యులతో పాటు జనం యావన్మందీ వాడుకోవచ్చు' అని ఈ తీర్మానం సారాంశం. అయితే, సవర్ణ హిందువుల నుండి వచ్చిన వ్యతిరేకత వల్ల ఈ తీర్మానం ఆచరణలో పెట్టడం సాధ్యపడలేదు. మహాద్ మున్సిపాలిటీ చేసిన తీర్మానాన్ని వెంటనే అమలు చేయాలనే లక్ష్యంతో బాబాసాహెబ్ ముందు నడవగా ఐదువేల మందితో దళిత సమాజం చవ్‌దార్ చెరువు గట్టుకు చేరుకుంది.
|