Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 35వ వారం

వికీపీడియా నుండి
సహాయ నిరాకరణోద్యమం

సహాయ నిరాకరణోద్యమం భారత స్వాతంత్ర్య సమరంలో మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగిన ఒక ప్రధాన ఉద్యమం. బ్రిటిషు ప్రభుత్వపు వెన్ను విరిచిన ప్రజా ఉద్యమం. 1920 సెప్టెంబరు 4 న మొదలై 1922 ఫిబ్రవరిలో ముగిసింది. 1919 మార్చి 21 నాటి రౌలట్ చట్టానికి, 1919 ఏప్రిల్ 13 న జరిగిన జలియన్ వాలా బాగ్ ఊచకోతకూ నిరసనగా సంపూర్ణ స్వరాజ్యం కోసం మహాత్మా గాంధీ నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ (INC) బ్రిటిషు ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చెయ్యాలని పిలుపునివ్వడంతో ఉద్యమానికి బీజం పడింది. ఇది గాంధీ పెద్ద ఎత్తున ప్రజలను సేకరించి చేపట్టిన మొట్టమొదటి ఉద్యమం. ఆంగ్లేయుల ప్రభుత్వాన్ని పోషించే అన్ని రకాల పనులనుంచీ భారతీయులను తప్పుకోమని గాంధీజీ ప్రజానీకాన్ని కోరాడు. ఇందులో బ్రిటీష్ పరిశ్రమలు, విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. అహింసా పద్ధతిలో భారతీయులు ఆంగ్లేయుల వస్తువులు వాడటం మానేసి, ప్రాంతీయంగా ఉత్పత్తులు వాడటం ప్రారంభించారు. 1919 మార్చిలో రౌలట్ చట్టం, దేశద్రోహ విచారణలలో ప్రతివాదుల హక్కులను నిలిపివేసింది. భారతీయులు దాన్ని "రాజకీయ మేల్కొలుపు" గాను బ్రిటిషు వారు "ముప్పు" గానూ భావించారు. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా 1919 ఏప్రిల్ 13వ జలియన్ వాలాబాగ్లో భారతీయులు ఆందోళనకు దిగారు. బ్రిటిషర్లు ఆందోళన కారులపై సాముహిక హత్యాకాండకు పాల్పడ్డారు. ఆ సంఘటనకు సంబంధించి బ్రిటిషు ప్రభుత్వం బాధ్యులైన వారిపై చర్యతీసుకొనే బదులు విచారం వ్యక్తం చేసింది. మొదటి ప్రపంచయుద్ధంలో ఇస్లామిక్ దేశమైన టర్కీ ఇంగ్లాండ్ ను వ్యతిరేకించడంతో ఖలీఫా పదవిని రద్దు చేశారు.
(ఇంకా…)