Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 38వ వారం

వికీపీడియా నుండి
భారత అమెరికా సంబంధాలు

భారత అమెరికా సంబంధాలు భారతదేశం, అమెరికా మధ్య అంతర్జాతీయ సంబంధాలను సూచిస్తుంది. స్వాతంత్ర్యానంతరం అధికారికంగా మొదలైన భారత అమెరికా సంబంధాల్లో అనేక మార్పుచేర్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. రిచర్డ్ నిక్సన్, ఇందిరా గాంధీల కాలంలో అత్యంత క్షీణ దశను, జార్జి డబ్ల్యూ బుష్, మన్మోహన్ సింగ్ ల కాలంలో ఎంతో స్నేహపూర్వక దశను చవి చూసాయి. కేవల ద్వైపాక్షిక విషయాలకే పరిమితంగా ఉండే ఈ సంబంధాలు, ద్వైపాక్షిక చర్చల్లో వివిధ అంతర్జాతీయ అంశాలను చర్చించే స్థాయికి ఎదిగాయి. భారత స్వాతంత్ర్య ఉద్యమంలోని ప్రముఖ నాయకులకు అమెరికాతో స్నేహపూర్వక సంబంధాలు ఉండేవి. 1947 లో యునైటెడ్ కింగ్‌డమ్ నుండి స్వాతంత్ర్యం పొందిన తరువాత కూడా ఇవి కొనసాగాయి. 1954 లో, అమెరికా పాకిస్తాన్‌ను సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్ (సెంటో) ఒప్పందంలో మిత్రదేశంగా చేర్చుకుంది. పాకిస్తాన్-అమెరికా సంబంధాలను ఎదుర్కోవటానికి భారతదేశం, సోవియట్ యూనియన్‌తో వ్యూహాత్మక సైనిక సంబంధాలను పెంపొందించుకుంది. అమెరికా సోవియట్ యూనియన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధంలో ఏ శిబిరంలోనూ చేరకుండా ఉండటానికి 1961 లో, భారతదేశం అలీనోద్యమంలో వ్యవస్థాపక సభ్యుడయింది. 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో నిక్సన్ ప్రభుత్వం పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వడంతో, భారత అమెరికా సంబంధాలు క్షీణించాయి. 1991 లో సోవియట్ యూనియన్ రద్దు అయ్యే వరకు ప్రతికూలంగానే ఉంటూ వచ్చాయి. 1990 లలో, భారత్ తన విదేశాంగ విధానాన్ని ఏకధ్రువ ప్రపంచానికి అనుగుణంగా మలచుకుని అమెరికాతో సన్నిహిత సంబంధాలను పెంచుకుంది.
(ఇంకా…)