వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2023 03వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ కృష్ణదేవ రాయలు

శ్రీకృష్ణదేవ రాయలు (1471 జనవరి 17 – 1529 అక్టోబరు 17) విజయనగర చక్రవర్తి. ఇతను 1509 ఫిబ్రవరి 4 న తన ఇరవై సంవత్సరాల వయసులో విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాయల పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు, కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. ఆంధ్ర భోజుడుగా, సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా, కన్నడ రాజ్య రమారమణగా అతడు కీర్తించబడినాడు. శ్రీకృష్ణదేవరాయలు సాళువ నరసనాయకుడి వద్ద మహాదండనాయకుడుగా పనిచేసిన తుళువ నరసనాయకుని మూడవ కుమారుడు. నరసనాయకుడు పెనుకొండలో ఉండగా, రెండవ భార్య నాగలాంబకు జన్మించాడు. రాయలు తల్లి నాగలాంబ గండికోటను పాలించిన పెమ్మసాని నాయకులు ఆడపడచు. ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్, న్యూనిజ్‌ ల రచనల వలన తెలియుచున్నది. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించి "అప్పాజీ" (తండ్రిగారు) అని పిలిచేవాడు. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో 1509 ఫిబ్రవరి 4 న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డురానున్న అచ్యుత రాయలు నూ, వీర నరసింహ రాయలు నూ, అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించాడు.
(ఇంకా…)