వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2023 09వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాకాటకులు

వాకాటక రాజవంశం సా.శ. 3వ శతాబ్దం మధ్యలో దక్కనులో ఉద్భవించిన పురాతన రాజవంశం. వారి రాజ్యం ఉత్తరాన మాల్వా, గుజరాత్ ల దక్షిణపు అంచుల నుండి దక్షిణాన తుంగభద్ర నది వరకు, పశ్చిమాన అరేబియా సముద్రం నుండి తూర్పున ఛత్తీస్‌గఢ్ అంచుల వరకు విస్తరించి ఉందని భావిస్తున్నారు. వారు డెక్కన్‌లోని శాతవాహనుల వారసుల్లో అత్యంత ముఖ్యమైన వారు. ఉత్తర భారతదేశంలోని గుప్తులకు సమకాలికులు. వాకాటక వంశీకులు బ్రాహ్మణులు. ఈ వంశ మూలపురుషుడైన వింధ్యశక్తి గురించి చాలా తక్కువగా తెలుసు (సుమారు సా.శ. 250 –  270). అతని కుమారుడు మొదటి ప్రవరసేన పాలనలో రాజ్య విస్తరణ ప్రారంభమైంది. మొదటి ప్రవరసేనుడి తర్వాత వాకాటక రాజవంశం నాలుగు శాఖలుగా విడీపోయిందని భావిస్తున్నారు. వీటిలో రెండు శాఖల గురించి తెలియగా, రెండింటి గురించి తెలియదు. తెలిసిన శాఖలు ప్రవరపుర-నందివర్ధన శాఖ, వత్సగుల్మ శాఖ. గుప్త చక్రవర్తి రెండవ చంద్రగుప్తుడు తన కుమార్తెను వాకాటక రాజకుటుంబంలో వివాహం చేసాడు. వారి మద్దతుతో సా.శ. 4వ శతాబ్దంలో గుజరాత్‌ను శక సాత్రపుల నుండి స్వాధీనం చేసుకున్నాడు. వాకాటకుల తరువాత దక్కన్‌లో బాదామి చాళుక్యులు అధికారం లోకి వచ్చారు. వాకాటకాలు కళలు, వాస్తుశిల్పం, సాహిత్యాలకు పోషకులుగా ప్రసిద్ధి చెందారు. వారు ప్రజోపయోగ పనులు చేపట్టారు. వారు నిర్మించిన కట్టడాల్లో వారి వారసత్వం కనిపిస్తుంది.
(ఇంకా…)