వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2023 18వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2020 భారత చైనా సరిహద్దు కొట్లాటలు

2020 భారత చైనా కొట్లాటలు, భారత చైనాల మధ్య కొనసాగుతున్న సైనిక ప్రతిష్ఠంభనలో భాగం. 2020 మే 5 నుండి, భారత, చైనా దళాలు వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ప్రదేశాలలో దొమ్మీలకు, ముష్టి యుద్ధాలకూ, కొట్లాటలకూ పాల్పడ్డాయి. లడఖ్‌లోని వివాదాస్పదమైన పాంగోంగ్ సరస్సుకు సమీపంలోను, సిక్కింకు, టిబెట్ అటానమస్ రీజియన్ కూ మధ్య గల సరిహద్దు వద్దా ఈ కొట్లాటలు జరిగాయి. తూర్పు లడఖ్‌లో కూడా వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) వెంట ఘర్షణలు జరిగాయి. మే చివరలో, గల్వాన్ నది లోయలో భారతదేశం చేస్తున్న రహదారి నిర్మాణం పట్ల చైనా దళాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. భారత వర్గాల సమాచారం ప్రకారం, జూన్ 15/16 న జరిగిన కొట్లాట ఫలితంగా 20 మంది భారతీయ సైనికులు (ఒక అధికారితో సహా) మరణించారు. 43 మంది చైనా సైనికులు మరణించడం గాని గాయపడ్డం గానీ జరిగింది (ఒక అధికారితో కలిపి). ఇరువైపులా సైనికులను బందీలుగా పట్టుకొని, తరువాతి కొద్ది రోజుల్లో విడుదల చేసినట్లు మీడియా వార్తల్లో వచ్చాయి. భారత్ వైపు పది మంది సైనికులను బందీలుగా తీసుకున్నట్లు తెలిసింది, అయితే చైనా సంఖ్యలు ధృవీకరణ కాలేదు. తరువాత, భారత సైనికులను నిర్బంధించినట్లు వచ్చిన వార్తలను చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత సైన్యం రెండూ ఖండించాయి. జూలై 25 న, గల్వాన్, గోగ్రా హాట్ స్ప్రింగ్స్ వద్ద కొట్లాటలు ఆగిపోయాయని వార్తలు వచ్చాయి. జూలై 30 నాటికి, పాంగోంగ్ త్సో (త్సో అంటే టిబెట్ భాషలో సరస్సు అని అర్థం) వద్ద, గోగ్రాలోని పిపి 17 ఎ వద్దా కొట్లాటలు పూర్తిగా ఆగలేదు. భారత, చైనాల మధ్య "పూర్తి విరమణ" ఇంకా మిగిలే ఉంది. విరమణ ప్రక్రియ పూర్తి కాకపోతే శీతాకాలంలో కూడా దళాల విస్తరణను కొనసాగిస్తామని భారత సైన్యం చెప్పింది.
(ఇంకా…)