వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2023 34వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్రెటేషస్-పాలియోజీన్ విలుప్తి ఘటన

క్రెటేషియస్-పాలియోజీన్ విలుప్తి ఘటన అనేది, సుమారు 6.6 కోట్ల సంవత్సరాల కిందట భూమ్మీద నాలుగింట మూడు వంతుల వృక్ష, జంతు జాతులు మూకుమ్మడిగా నశించిపోయిన సంఘటన. దీన్ని క్రెటేషియస్-టెర్షియరీ విలుప్తి అని కూడా పిలుస్తారు. ఈ ఘటన లోనే నేలపై నివసించే డైనోసార్లు అంతరించిపోయాయి. అంతేకాదు, సముద్ర తాబేళ్లు, మొసళ్ళ వంటి కొన్ని ఎక్టోథర్మిక్ జాతులు మినహా, 25 కిలోలకు పైబడి బరువున్న టెట్రాపోడ్స్ ఏవీ బతకలేదు. ఈ ఘటనతో క్రెటేషియస్ పీరియడ్ ముగిసింది. దానితో పాటే మెసోజాయిక్ ఎరా ముగిసి, సెనోజాయిక్ ఎరా మొదలైంది. ప్రస్తుతం జరుగుతున్నది సెనోజోయిక్ ఎరాయే. భౌగోళిక రికార్డులో K -Pg ఘటనను, K -Pg సరిహద్దు అని పిలిచే పలుచని అవక్షేప పొర ద్వారా గుర్తించవచ్చు. ఇది ప్రపంచవ్యాప్తంగా సముద్ర శిలలు, భూ శిలలు రెండింటి లోనూ కనిపిస్తుంది. ఈ సరిహద్దు పొర వద్ద ఉన్న బంకమట్టి సమ్మేళనంలో ఇరిడియం లోహం స్థాయి అసాధారణంగా ఎక్కువగా ఉంది. ఈ లోహం భూమి పైపెంకులో ఇంత స్థాయిలో ఎక్కడా ఉండదు. భూమిపై కంటే గ్రహశకలాలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. 1980 లో లూయిస్ అల్వారెజ్, అతని కుమారుడు వాల్టర్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ప్రతిపాదించినట్లుగా, K -Pg విలుప్తికి కారణం 6.6 కోట్ల సంవత్సరాల క్రితం 10 నుండి 15 కి.మీ. వెడల్పున్న భారీ తోకచుక్క లేదా గ్రహశకలం భూమిని గుద్దుకోవడమేనని ఇప్పుడు విస్తృతంగా భావిస్తున్నారు. దీని వలన ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం నాశనమైంది. ఈ గుద్దుడు వలన ఏర్పడిన కృత్రిమ శీతాకాలం సూర్యరశ్మిని అడ్డుకోవడంతో మొక్కల్లోను, పాచి లోనూ కిరణజన్యు సంయోగ క్రియ ఆగిపోయింది. అల్వారెజ్ పరికల్పన అని పిలిచే ఈ పరికల్పనకు, 1990 ల ప్రారంభంలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో లోని యుకాటాన్ ద్వీపకల్పంలో 180 కి.మీ. వ్యాసమున్న చిక్సులూబ్ బిలాన్ని కనుక్కోవడంతో బలం చేకూరింది.
(ఇంకా…)