వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2023 35వ వారం
సియాచెన్ హిమానీనదం |
---|
సియాచెన్ హిమానీనదం, హిమాలయాల్లోని తూర్పు కారకోరం శ్రేణిలో, భారత పాకిస్తాన్ల మధ్య నున్న నియంత్రణ రేఖ ముగిసే NJ9842 బిందువుకు ఈశాన్యంగా, సుమారు 35.421226°N 77.109540°E వద్ద ఉన్న హిమానీనదం. 76 కిలోమీటర్ల పొడవైన ఈ హిమానీనదం, కారకోరంలోకెల్లా అత్యంత పొడవైనది. ధ్రువేతర హిమానీనదాల్లో అత్యంత పొడవైన వాటిలో ఇది రెండవ స్థానంలో ఉంది. ఇది, చైనా సరిహద్దులోని ఇందిరా కల్ వద్ద, 5,753 మీటర్ల ఎత్తున పుట్టి, 3,620 మీ ఎత్తున అంతమౌతుంది. సియాచెన్ హిమానీనదమంతా, అక్కడి అన్ని ప్రధాన కనుమలతో సహా, 1984 నుండి భారత పరిపాలనలో ప్రస్తుత లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో భాగంగా ఉంది. పాకిస్తాన్, సియాచెన్ హిమానీనదం తనదని వాదిస్తూ ఉంటుంది. హిమానీనదానికి పశ్చిమాన ఉన్న సాల్టోరో శిఖరాలకు పశ్చిమాన ఉన్న ప్రాంతం పాక్ నియంత్రణలో ఉంది. ఈ ప్రాంతం లోని పాకిస్తాన్ పోస్టులు, 100 పైచిలుకు ఉన్న భారతీయ పోస్టుల కంటే 3,000 అడుగులు క్రింద ఉంటాయి. సియాచెన్ హిమానీనదం, యూరేసియన్ ప్లేట్‌ను భారత ఉపఖండాన్నీ వేరుచేసే గొప్ప విభజన రేఖకు దక్షిణాన ఉంది. ఇది కారకోరం శ్రేణిలో బాగా హిమానీనదాలున్న ప్రాంతంలో ఉంది. దీన్ని కొన్నిసార్లు "మూడవ ధ్రువం" అని కూడా పిలుస్తారు.
|