వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2023 43వ వారం
గుండమ్మ కథ |
---|
గుండమ్మ కథ కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో 1962 లో విజయ వాహినీ సంస్థ నిర్మించిన చిత్రం ఇది. ఇందులో సూర్యకాంతం, ఎన్. టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్. వి. రంగారావు, సావిత్రి, జమున ప్రధాన పాత్రలు పోషించారు. చక్రపాణి, డి. వి. నరసరాజు ఈ చిత్రానికి రచయితలు. ఈ చిత్రంలో పాటలన్ని పింగళి రాయగా ఘంటసాల సంగీతాన్నందించాడు. 1958 లో కన్నడంలో విఠలాచార్య తీసిన మనె తుంబిద హెణ్ణు అనే చిత్రానికిది పునర్నిర్మాణం. కథలో షేక్స్‌పియర్ రాసిన ద టేమింగ్ ఆఫ్ ద ష్రూ అనే నాటకంలోని కొన్ని పాత్రల చిత్రణను వాడుకుంటూ, తెలుగు సాంప్రదాయం ప్రకారం కొన్ని మార్పులు చేశారు. అప్పటి దాకా పౌరాణిక చిత్రాలకే దర్శకత్వం వహించిన కామేశ్వరరావు ఈ సినిమాతో మొదటిసారిగా సాంఘిక చిత్రాన్ని తీశాడు. అప్పటిలో ఇది అగ్రశ్రేణి నటులతో నిర్మించిన మల్టీ స్టారర్, కాని "గుండమ్మ కథ" అని సూర్యకాంతం పాత్ర పేరుమీద సినిమా పేరు పెట్టడమే గొప్ప వైవిధ్యం. హాస్యం, సంగీతం ఈ చిత్రానికి విజయాన్ని సమకూర్చాయి.
|