వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2024 07వ వారం
స్టాక్ మార్కెట్ |
---|
స్టాక్ మార్కెట్ లేదా షేర్ మార్కెట్ అనేది వ్యాపారసంస్థల్లోని వాటాల కొనుగోలు, అమ్మకాలు జరిపే విక్రేతల, కొనుగోలుదారుల సముదాయము. ఈ వాటాలు వ్యాపారంలో భాగస్వామ్యాన్ని సూచిస్తాయి. వీటిలో పబ్లిక్ స్టాక్ ఎక్స్చేంజిలో నమోదయ్యే సెక్యూరిటీలు, అలాగే ప్రైవేట్‌గా మాత్రమే ట్రేడ్ చేయబడే షేర్ల వంటివి ఉండవచ్చు. స్టాక్ ఎక్స్చేంజిలు స్టాక్ మార్కెట్లో ఒక ముఖ్యమైన భాగం. వ్యక్తిగత మదుపరులు, సంస్థాగత మదుపర్లు, హెడ్జ్ ఫండ్లు మొదలైనవారంతా స్టాక్ మార్కెట్ లో భాగస్వాములు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు చాలా తరచుగా స్టాక్ బ్రోకరేజ్‌లు, ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ మాధ్యమాల ద్వారా జరుగుతాయి. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతాయి.
ఐరోపాలో 13 వ శతాబ్దం నుంచే ఈ స్టాక్ మార్కెట్లు అందుబాటులో ఉన్నాయి. 1980లో ప్రపంచ బహిరంగ మార్కెట్లో ఉన్న షేర్ల మార్కెట్ విలువ 2.5 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు ఉండగా 2020 చివరి నాటికి వాటి విలువ 93.7 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరింది. అతిపెద్ద స్టాక్ మార్కెట్ అమెరికా సంయుక్త రాష్ట్రాల లోని న్యూయార్క్ నగరంలోని ఎన్.వై.ఎస్.ఈ (NYSE). ప్రపంచంలో ముఖ్యమైన స్టాక్ మార్కెట్లు, లండన్, ఆమ్‌స్టర్‌డామ్, ప్యారిస్, ఫ్రాంక్‌ఫర్ట్, హాంగ్ కాంగ్, సింగపూర్, టోక్యోల్లో ఉన్నాయి. ఇంకా ప్రతి అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటిలో ఈ స్టాక్ మార్కెట్లు ఉన్నాయి. భారత దేశపు స్టాక్ మార్కెట్ లో రెండు ముఖ్యమైన స్టాక్ ఎక్ఛేంజీలు రెండు ఉన్నాయి. అవి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ (NSE). వీటి సూచీలను సెన్సెక్స్, నిఫ్టీ అని అంటారు.
|