Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2024 19వ వారం

వికీపీడియా నుండి
సిరియస్ నక్షత్రం

సిరియస్ అనేది సూర్యుని నుంచి 8.6 కాంతి సంవత్సరాల దూరంలో వున్న ఒక జంట నక్షత్ర వ్యవస్థ (Visual Binary System). దీనిలో సిరియస్-A , సిరియస్-B అనే రెండు నక్షత్రాలు వున్నాయి. టెలిస్కోప్ నుంచి చూస్తేనే సిరియస్ కి ఈ రెండు నక్షత్రాలున్నట్లు కనపడుతుంది. మామూలు కంటితో చూస్తే మాత్రం సిరియస్ ఒంటరి నక్షత్రంగానే కనిపిస్తుంది. భూమి మీద నుంచి చూస్తే ఆకాశంలో రాత్రిపూట కనిపించే నక్షత్రాలలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం ఈ సిరియస్ నక్షత్రమే. తెల్లని వజ్రంలా ప్రకాశించే ఈ నక్షత్ర దృశ్య ప్రకాశ పరిమాణం – 1.46. కానిస్ మేజర్ (బృహల్లుబ్దకం) అనే నక్షత్రరాశిలో కనిపించే ఈ నక్షత్రాన్ని బేయర్ నామకరణ పద్దతిలో Alpha Canis Majoris (α CMa) గా సూచిస్తారు. ఈ తారనే డాగ్ స్టార్ (Dog Star), మృగవ్యాధ రుద్రుడు అని కూడా వ్యవహరిస్తారు. సిరియస్ అనే జంట నక్షత్ర సముదాయంలో ఒకటి మహోజ్వలమైన నక్షత్రం (సిరియస్-A) కాగా మరొకటి కాంతివిహీనంగా కనిపించే వైట్ డ్వార్ఫ్ నక్షత్రం (సిరియస్-B). మహోజ్వలంగా మెరిసే సిరియస్ A నక్షత్రం తన పరిణామ దశలో ‘ప్రధాన క్రమం’ (Main Sequence) లో వున్న నక్షత్రం. A1V వర్ణపట తరగతికి చెందిన నీలి-తెలుపు (Blue-White) వర్ణనక్షత్రం. ఇది సూర్యునికంటే వ్యాసంలో 1.71 రెట్లు పెద్దది, తేజస్సు (Luminosity) లో సుమారుగా 25 రెట్లు పెద్దది. ఇకపోతే సిరియస్ B నక్షత్రం కాంతివిహీనంగా వున్న ఒక చిన్న నక్షత్రం. ఇది సూర్యుని కంటే వ్యాసంలో సుమారు 120 రెట్లు చిన్నది. భూమి కంటె కొద్దిగా చిన్నది. ఇది వైట్ డ్వార్ఫ్ (శ్వేత కుబ్జతార) నక్షత్రం. ఈ జంట నక్షత్ర వ్యవస్థ యొక్క వయస్సు సుమారు 20 నుంచి 30 కోట్ల సంవత్సరాల మధ్య ఉంటుంది.
(ఇంకా…)