వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2024 27వ వారం
భైరవకోన |
---|
భైరవ కోన ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలోని అంబవరం కొత్తపల్లి గ్రామానికి 5 కిమీ దూరంలో వున్న 9వ శతాబ్దానికి చెందిన శైవ పుణ్యక్షేత్రం. ఇక్కడ ఒకే కొండలో మలిచిన ఎనిమిది శివాలయాలున్నాయి. వీటిలో ఏడు దేవాలయాలు తూర్పుముఖంగా, ఒక్కటి మాత్రం ఉత్తర ముఖంగా చెక్కబడ్డాయి. వీటన్నింటిలోనూ గర్భాలయాలూ, వరండాలూ స్తంభాలూ అన్నీ ఒకే కొండ రాయితోనే మలచగలగడం విశేషం. శివలింగాలను మాత్రమే నల్లరాయి (గ్రానైట్) శిలలను చెక్కి ప్రతిష్ఠించారు. కొండల్ని తొలిచి ఆలయాలుగా చెక్కడం అన్నది భారతదేశంలో ప్రాచీనకాలంనుంచీ ఉన్నదే. ఆంధ్రప్రదేశ్లో గుంటుపల్లి, ఉండవల్లి, మొగల్రాజపురం, బొజ్జన్నకొండ, శ్రీపర్వతం, లింగాల మెట్ట గుహలన్నీ ఈ కోవకు చెందినవే. అయితే భైరవకోన గుహలకు పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. పల్లవరాజగు మహేంద్రవర్మ ధాన్యకటకమందు రాజప్రతినిధిగా వున్నప్పుడు గుహాలయ నిర్మాణాలను గూర్చి తెలుసుకొని కలప, ఇటుక, లోహనిర్మితాలకంటె శాశ్వతమైన వీటి నిర్మాణాలను ఆంధ్రదేశమందు ప్రోత్సహించాడు. ఆ తరువాత పల్లవులు ఓడిపోయి, రాజ్యం పెన్న పరిసర దక్షిణ ప్రాంతాలను ఆక్రమించారు. ఆ కాలంలో నిర్మించిన పర్వత గుహాలయాలకు భైరవకొండలోని శిల్పాలే తార్కాణమని ప్రొ॥ఆర్. సుబ్రమణ్యం అభిప్రాయపడ్డాడు. అయితే ఐదోగుహలోని స్తంభాలమీద ఉన్న నరనరేంద్రుడు, శ్రీత్రిభువనాదిత్యం... వంటి పదాలను చూస్తుంటే ఈ ఆలయాల నిర్మాణం ఏడో శతాబ్దం నుంచి చాళుక్యులకాలం వరకూ అంటే 11వ శతాబ్దంవరకూ కొనసాగి ఉంటుందని భావిస్తారు.
|