Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2024 29వ వారం

వికీపీడియా నుండి
అలెగ్జాండర్

అలెగ్జాండర్ ప్రాచీన గ్రీకు రాజ్యమైన మాసిడోన్ కు రాజు (గ్రీకు సామ్రాజ్యంలో ఈ పదవిని బాసిలియస్ అంటారు), ఆర్గియడ్ రాజవంశస్థుడు. అతన్ని మాసిడోన్‌కు చెందిన అలెగ్జాండర్ III అని, అలెగ్జాండర్ ది గ్రేట్ (గ్రీకులో అలెగ్జాండ్రోస్ హో మెగాస్) అనీ పిలుస్తారు. అతను సా.పూ 356 లో పెల్లాలో జన్మించాడు. అతని తండ్రి ఫిలిప్ II మరణం తరువాత, 20 ఏళ్ళ వయస్సులో గద్దె నెక్కాడు. తన పాలనాకాలంలో ఎక్కువ భాగం పశ్చిమ ఆసియా, ఈశాన్య ఆఫ్రికాల్లో మున్నెన్నడూ ఎరగని సైనిక దండయాత్ర లోనే గడిపాడు. ముప్పై సంవత్సరాల వయస్సు నాటికే, గ్రీస్ నుండి వాయవ్య భారతదేశం వరకు విస్తరించిన, పురాతన ప్రపంచంలోని అతిపెద్ద సామ్రాజ్యాలలో ఒకదాన్ని సృష్టించాడు. అతను యుద్ధంలో అజేయంగా నిలిచాడు. చరిత్రలో అత్యంత విజయవంతమైన సేనాధిపతుల్లో ఒకరిగా అతన్ని పరిగణిస్తారు. అలెగ్జాండర్‌ 16 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు అరిస్టాటిల్ వద్ద విద్య అభ్యసించాడు. సా.పూ 336 లో ఫిలిప్ హత్య తరువాత, అతను సింహాసనం ఎక్కాడు. బలమైన రాజ్యాన్ని, అనుభవంగల సైన్యాన్నీ వారసత్వంగా పొందాడు. అలెగ్జాండర్‌కు గ్రీస్ సర్వసైన్యాధిపత్యం లభించింది. తన తండ్రి తలపెట్టి, మొదలుపెట్టలేక పోయిన పాన్-హెలెనిక్ ప్రాజెక్టును ప్రారంభించి, పర్షియాను ఆక్రమించడానికి ఈ అధికారాన్ని ఉపయోగించాడు.
(ఇంకా…)