Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2024 40వ వారం

వికీపీడియా నుండి
ఆనీ లార్సెన్ వ్యవహారం

ఆనీ లార్సెన్ వ్యవహారం అనేది మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా నుండి భారతదేశానికి ఆయుధాలను అక్రమంగా రవాణా చేసే ప్రయత్నం. భారతీయులకు చెందిన గదర్ పార్టీ, ఐరిష్ రిపబ్లికన్ బ్రదర్‌హుడ్, జర్మన్ విదేశాంగ కార్యాలయం - ఈ మూడూ కలిసి చేసిన కుట్ర కార్యక్రమాలైన హిందూ జర్మను కుట్రలో ఇది భాగం. 1917 లో జరిగిన హిందూ -జర్మన్ కుట్ర విచారణలో ఇదే ప్రధానమైన నేరం. అమెరికా న్యాయవ్యవస్థ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన, అత్యంత ఖరీదైన విచారణగా దీన్ని వర్ణించారు. 1914 నాటికి, యావద్భారత విప్లవం కోసం ప్రణాళికలు రూపొందించబడ్డాయి. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు, గదర్ ప్రణాళికకు మద్దతు ఇవ్వాలని జర్మనీ నిర్ణయించుకుంది. దీని కోసం, జర్మనీలోని భారతీయ, ఐరిష్ ప్రజల మధ్య ఏర్పడిన లింకులను (రోజర్ కేస్‌మెంట్‌తో సహా), అమెరికా లోని జర్మనీ విదేశాంగ కార్యాలయాలనూ వాడి అమెరికా లోని ఇండో-ఐరిష్ నెట్‌వర్కుతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. 1914 సెప్టెంబరులో జర్మనీ ఛాన్సలర్ థియోబాల్డ్ వాన్ బెత్‌మన్-హాల్‌వెగ్, బ్రిటిషు భారతదేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేపట్టేందుకు అధికార మిచ్చాడు. ఈ ప్రయత్నాలకు పురావస్తు శాస్త్రవేత్త, ప్రాచ్యదేశాల కోసం కొత్తగా ఏర్పడిన నిఘా సంస్థ అధిపతీ అయిన మాక్స్ వాన్ ఒపెన్‌హీమ్ నాయకత్వం వహించాడు. భారతీయ విద్యార్థి సంఘాలను ఒక సంఘటిత సమూహంగా ఏర్పాటు చేసే బాధ్యత ఒప్పెన్‌హీమ్‌పై పడింది.
(ఇంకా…)