Jump to content

వికీపీడియా:తెలుగు వికీపీడియా కరదీపిక/తెవికీలో ఎలా రాయాలి: "మార్చు", "ప్రచురించు", ఎడిటింగు ఉపకరణాలు

వికీపీడియా నుండి

వ్యాసాలను సరిదిద్దే విషయమై అందరినీ చొరవగా, జంకు లేకుండా ముందుకు రమ్మని వికీపీడియా సభ్యులను ప్రోత్సహిస్తోంది. నిర్లక్ష్యంగా ఉండకండి! సరైన పద్ధతిలో రాయని మంచి వ్యాసం గానీ, మరీ పసలేని వ్యాసం గాని, చిన్న చిన్న పొరపాట్లు గానీ, తప్పుల తడక గాని, హాస్యాస్పదమైనది గాని, ఏదైనా మీకు కనిపిస్తే తప్పులు సరిదిద్దండి. వికీపీడియాలో మీరు చేసే దిద్దుబాట్ల వల్ల నష్టము వాటిల్లుతుందని భయపడవద్దు. ఎప్పుడైనా వాటిని సరిదిద్దడము లేదా మెరుగుపరచడము చేయవచ్చు. వ్యాసాల్లోని తప్పులను సరిదిద్దుతూ, వ్యాకరణ దోషాలను సవరిస్తూ, కొత్త విషయాలను జోడిస్తూ, భాషను మెరుగుపరుస్తూ ఉంటేనే వికీ చురుగ్గా వృద్ధి చెందుతుంది. అందరూ ఆశించేది అదే!

ఇప్పటికే ఉన్న వ్యాసంలో మార్పు చేర్పులు చెయ్యాలంటే రెండు పద్ధతులున్నాయి. ఒకటి, పైనున్న టాబుల్లోని మార్చు లింకును నొక్కడం. ఈ పద్ధతిలో మొత్తం వ్యాసమంతా మార్పుకు సిద్ధమౌతుంది. రెండో పద్ధతి.. వ్యాసంలోని ఏదో ఒక విభాగాన్ని మాత్రమే సరిదిద్దడం. వ్యాసంలోని ప్రతి విభాగానికి పక్కన మార్చు అనే లింకు కనిపిస్తుంది. ఆ లింకును నొక్కినపుడు కేవలం సదరు విభాగం మాత్రమే మార్పుకు సిద్ధమౌతుంది. క్లుప్తంగా దిద్దుబాటు చేసే విధానం ఇలా ఉంటుంది.

  • దిద్దుబాటు చెయ్యదలచిన పేజీ లేదా విభాగపు "మార్చు" లింకును నొక్కండి.
  • దిద్దుబాటు పేజీ ప్రత్యక్షమౌతుంది.
  • అక్కడ మీరు చెయ్యదలచిన మార్పులు చెయ్యండి.
  • మీరు చేసిన మార్పులను వివరిస్తూ ఒక చిన్న సారాంశాన్ని కిందనున్న పెట్టెలో రాయండి.
  • మీరు చేసింది చిన్న మార్పయితే, చిన్నమార్పు పెట్టెను టిక్కు చెయ్యండి.
  • ఆ పేజీ మీ వీక్షణ జాబితాలో చేర్చాలనుకుంటే.. ఆ పెట్టెను కూడా టిక్కు చెయ్యండి.
  • పేజీని భద్రపరచేముందు, సరిచూడు మీటను నొక్కి, మీరు చేసిన మార్పులను ఒక్కసారి సరిచూసుకోండి.
  • అంతా బాగుందనుకుంటే, భద్రపరచు మీటను నొక్కి, మీ మార్పులను భద్రపరచండి.

అయితే మీరు వ్రాసిన గద్యాన్ని ఒక ఆకృతిలో పెట్టదలిస్తే దానికి అనుగుణంగా తగు అలంకారాలు చెయ్యాల్సి ఉంటుంది. ఉదాహరణకు కొంత భాగాన్ని బొద్దుగా చెయ్యడం, ఇటాలిక్కుగా మార్చడం, ఒక కొత్త విభాగం తయారుచెయ్యడం, ఒక జాబితాను కూర్చడం, ఒక నిర్వచనాన్ని వ్రాయడం వంటి అనేక అలంకారాలు ఈ ఎడిటరు ద్వారా చెయ్యవచ్చు.

కొత్త పేజీని సృష్టించేందుకు, ఏదో ఒక పేజీలో మార్చు లింకును నొక్కండి. ఆ పేజీ లోని ఎడిట్ పెట్టెలో మీరు సృష్టించదలచిన పేజీ పేరును వ్రాసి దానికి లింకు ఇవ్వడి. ఉదాహరణకు మా ఊరు అనే పేజీని సృష్టించాలనుకుందాం.. ఏదో ఒక పేజీ మార్చు లింకును నొక్కి, ఆ పేజీలోని ఎడిట్ పెట్టెలో, అన్నిటి కంటె పైన మా ఊరు అని వ్రాసి, ఎడిట్ పెట్టెకు కింద ఉన్న సరిచూడు మీటను నొక్కండి. అప్పుడు ఎడిట్ పెట్టెకు పైన పేజీలో మా ఊరు అనే లింకు కనిపిస్తుంది. ఆ లింకును నొక్కండి, మా ఊరు పేజీ ఎడిట్ పెట్టె కనిపిస్తుంది. మీరు వ్రాయదలచింది వ్రాసేసి, భద్రపరచండి. అంతే.. పేజీ తయారు!