Jump to content

వికీపీడియా:తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్/ప్రాథమిక ప్రతిపాదన

వికీపీడియా నుండి

తెలుగు వికీమీడియా సముదాయం కలిసి ఒక యూజర్ గ్రూప్ పెట్టుకుని, వికీ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి సంస్థాగతంగా కృషిచేయాలని ప్రతిపాదిస్తూ, దానికి సంబంధించిన పూర్వాపరాలను ఈ పేజీ వివరిస్తుంది.

యూజర్ గ్రూప్ అంటే ఏమిటి?

[మార్చు]

వికీపీడియా, ఇతర సోదర ప్రాజెక్టుల సర్వర్లను నిర్వహించడం, ఈ ప్రాజెక్టులన్నిటి డొమైన్ పేర్లపై యాజమాన్యం కలిగి, అమెరికాలో నెలకొన్న ఛారిటబుల్ సంస్థ వికీమీడియా ఫౌండేషన్. దీనికి ఒక అఫ్లియేట్ (అనుబంధ) స్ట్రక్చర్ ఉంది- అంటే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల వికీమీడియా సంస్థలు (చాప్టర్లు), వివిధ భాషల, లేదంటే ప్రాజెక్టుల వికీమీడియా యూజర్ గ్రూపులు, వగైరా గ్రూపులు, సంస్థలు వికీమీడియా ఫౌండేషన్‌కు అధికారికంగా అనుబంధంగా ఉండే అవకాశం ఉంది. అలాంటి అనుబంధ వ్యవస్థలు మూడు రకాలుగా ఉన్నాయి- ఒకటి చాప్టర్లు (ఉదాహరణకు వికీమీడియా యుకె), రెండు యూజర్ గ్రూపులు (ఉదాహరణకు పంజాబీ వికీమీడియన్స్ యూజర్ గ్రూప్), థీమాటిక్ ఆర్గనైజేషన్స్ (వికీమీడియా మెడిసిన్). వీటిలో మనం ఇప్పుడు ప్రతిపాదించుకుంటున్నది వికీమీడియా యూజర్ గ్రూప్ ఏర్పాటును.
యూజర్ గ్రూప్ అన్నది కొద్దిపాటి నియమ నిబంధనలతో, చిన్న చిన్న సముదాయాలు సైతం ఏర్పాటుచేసి నిర్వహించుకోగలుగుతూ ఉండే వికీమీడియా ఫౌండేషన్ అఫ్లియేట్ (అనుబంధ) గ్రూప్. కావడానికి కాస్త తేలికైన నిబంధనలతో ఏర్పాటుచేసుకోగలిగేదే అయినా వీటిని సమ భాగస్వాములుగా వికీమీడియా ఫౌండేషన్ గుర్తిస్తోంది. కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా అనేకానేక భాషలు, ప్రాంతాలు, అంశాల వారీగా వికీమీడియా సముదాయాలు యూజర్ గ్రూపులుగా ఏర్పడి వికీమీడియా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాయి.

యూజర్ గ్రూప్ దేని మీద పనిచేస్తుంది

[మార్చు]

వికీపీడియాలో కానీ ఇతర సోదర ప్రాజెక్టుల్లో ఆన్‌లైన్‌లో ప్రభావితం చేసే పాలసీల మీదనో, ఇతరేతర అంశాల మీదనో ఈ యూజర్ గ్రూపులు నిర్ణయాలు తీసుకునే హక్కులు కలిగి ఉండవు. మరి దేనిమీద పనిచేస్తుంది అంటే ఆఫ్‌లైన్‌లో కానీ, ఆన్‌లైన్‌లో ఫలానా ఫలానా వికీమీడియా ప్రాజెక్టుల విస్తరణ చెందడానికి, అభివృద్ధి చెందడానికి సకారాత్మకమైన కార్యక్రమాలు చేపడతుంది. అందు కోసం కొన్ని నిబంధనలకు లోబడి కలసి పనిచేసే వ్యక్తులు, ప్రాజెక్టులతో ముందుకు సాగుతుంది. అలానే ఒక సముదాయానికి ఒక వికీమీడియా యూజర్ గ్రూపు ఉంటే ఆ సముదాయ సభ్యులందరూ తప్పనిసరిగా అందులో భాగస్వాములు కావాలనీ లేదు. ఈ గ్రూపులో భాగం కాకుండా విడిగా కూడా వ్యక్తిగతంగా కానీ, వ్యవస్థాగతంగా కానీ వికీమీడియా సంస్థలకు ప్రయోజనకరంగా ఉండే కార్యక్రమాలు ఎవరైనా చేయవచ్చు.

యూజర్ గ్రూప్ ఏర్పరుచుకోవడం ఎలా?

[మార్చు]

ఈ కిందివి కనీసం ఉండాల్సినవి:

  • కనీసం 6 నెలలకు మించిన కాలం నుంచి ఎడిట్‌ బ్లాక్ కాని, 300 లేదా అంతకుమించిన ఎడిట్లు ఏదోక వికీమీడియా ప్రాజెక్టుల మీద ఉన్న కనీసం ముగ్గురు వికీపీడియన్లు ఉంటూ, ఓ పది మంది సభ్యులు ఉండాలి.
  • వీరిలో ఇద్దరిని వికీమీడియా ఫౌండేషన్‌తో సంప్రదింపులు కొనసాగేందుకు నియమించుకోవాలి.
  • వికీమీడియా ఉద్యమం ముందుకు తీసుకువెళ్ళగలిగే లక్ష్యాలు ఉండి, దాని కోసం ప్రణాళిక ఉండాలి. గతంలో కార్యక్రమాలు చేసిన చరిత్ర ఉంటే మంచిది.
  • మనం పనిచేసే విషయంలో సుస్పష్టమైన పరిధి ఉండాలి. (పరిధి గురించి కింద వివరణ ఉంటుంది) గ్రూపు గురించిన వివరాలు వికీమీడియా ప్రాజెక్టుల్లో దేనిలోనైనా ప్రచురణ పొంది ఉండాలి. (ఉదాహరణకు తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల్లోనూ, మెటా-వికీలోనూ) అలానే సముదాయంలో చర్చించడం విధాయకం. (ఈ పేజీలాగా)

ఇవి ఉన్నాకా, వీటితో యూజర్‌ గ్రూపుగా మనల్ని గుర్తించమని వికీమీడియా ఫౌండేషన్‌లో స్వతంత్రంగా పనిచేసే అఫ్లియేట్స్ కమిటీ (ఆఫ్‌కామ్‌గానూ వ్యవహరిస్తారు)కి సమర్పించాలి. ఆపైన, దరఖాస్తు పరిశీలించి అవసరమైతే సంప్రదింపుల కోసం ముందుకు వచ్చిన ఇద్దరు సభ్యులతో సంప్రదించి - ఆఫ్‌కామ్ ఈ గ్రూపును అఫ్లియేట్‌గా గుర్తిస్తూ రిజల్యూషన్‌ చేస్తుంది. అప్పుడు, అధికారికంగా వికీమీడియా ఫౌండేషన్ అఫ్లియేట్ (అనుబంధమైన) యూజర్‌ గ్రూప్‌గా గుర్తింపు పొందినట్టే.
ఒకసారి ఆ గుర్తింపు పొందాకా మనం భారత చట్టాల ప్రకారం సొసైటీ రిజిస్ట్రేషన్ చేయాలంటే చేయవచ్చు, లేదంటే లేదు.

  • ఏటా ఒక్కసారి మనం చేస్తున్న కార్యకలాపాలతో ఒకే ఒక వార్షిక నివేదిక సమర్పించాలి.

యూజర్ గ్రూప్ పరిధి

[మార్చు]

మన పరిధి లేదంటే ఫోకస్‌ ఏమిటన్నది ఒక ముఖ్యమైన ప్రశ్న. మన పరిధిని ఈ కింది విధాల్లో దేనిగానైనా నిర్ణయించుకోవచ్చు:

  • భాషా పరంగా: అంటే తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ అని కానీ, తెలుగు వికీమీడియా కమ్యూనిటీ యూజర్ గ్రూప్ అని కానీ పెట్టి తెలుగు వికీపీడియా, వికీసోర్సు, విక్ష్నరీ వంటి తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల అభివృద్ధి కోసం పనిచేయడం. వికీడేటా (కొంతవరకూ వికీడేటాలో తెలుగు లేబుల్స్ వరకూ లక్ష్యం పరిధిలోకి వస్తాయంతే), వికీమీడియా కామన్స్ వంటి ఇతర ప్రాజెక్టుల వృద్ధి కోసం పనిచేసినప్పుడు పరిధి అడ్డుపడవచ్చు.
  • ప్రాంతీయ పరిధిలో: అంటే వికీమీడియన్స్ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఆంధ్ర ప్రదేశ్ అని ఏర్పాటుచేసుకుని, తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన, సంబంధించిన ప్రతీవారినీ కలుపుకుపోతూ తెలుగు ప్రాజెక్టులతో సహా ఒక బహుళ భాషల, బహు ప్రాజెక్టుల యూజర్ గ్రూప్‌గా ముందుకుపోవడం. అంటే- హైదరాబాద్‌లో ఉర్దూ వికీమీడియా ప్రాజెక్టుల మీద పనిచేసేవారు, విశాఖ వైపు సంతాలి వికీపీడియా పైన పనిచేసేవారూ కూడా ఈ యూజర్ గ్రూప్ ఆధ్వర్యంలో తమ తమ భాషలపై పనిచేయగలరు, అలానే తోటి యూజర్ గ్రూప్ సభ్యులమైన మన సహాయ సహకారాలు కోరగలుగుతారు. అలానే మనం ఈ చర్చ వారితోనూ చేసి, వారినీ కలుపుకోవాల్సి ఉంటుంది.
  • భాషా, సంస్కృతుల పరంగా: తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ అన్నదే పేరుగా పెట్టి, తెలుగు భాషకు సంబంధించిన ప్రాజెక్టుల అభివృద్ధి (తెలుగు వికీపీడియా, వికీసోర్సు, వగైరా), తెలుగు సంస్కృతి, ప్రాంతాలకు సంబంధించి ఏ వికీ ప్రాజెక్టులోనైనా అభివృద్ధి (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఫోటోలు కామన్స్‌లో, డేటా వికీడేటాలో, అంశాలు ఇంగ్లీష్‌ వికీపీడియాలోనూ, హిందీ, ఉర్దూ వికీపీడియాలోనూ అభివృద్ధి చేయడం లక్ష్యాల్లో చేరుతుంది) లక్ష్యంగా పెట్టుకోవచ్చు.

మొదటి పద్ధతిలోనూ, మూడో పద్ధతిలోనూ చేస్తే పరిధి పూర్తిగా కవర్ కాక, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఇతర భాష వికీపీడియన్ల ప్రయత్నాలు కవర్ చేస్తూనే మన పరిధిలోకి చొచ్చుకునేలా వేరే పోటీ యూజర్‌గ్రూపులు ఏర్పరిచే ప్రయత్నాలూ జరగవచ్చు. కాబట్టి, మూడో పద్ధతిలో వెళ్ళినా కూడా దానిలో ఒక పాయింట్‌గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక పరిధిలోని వివిధ వికీ సముదాయాల వృద్ధికి కృషిచేయడం అన్నది పెట్టి తదనుగుణంగా అవసరమైతే ఎగ్జిక్యూటివ్ బాడీలో ఒకటి రెండు స్థానాలు కేటాయించి పనిచేసుకోవచ్చు.

భారతదేశం లోని యూజర్‌ గ్రూపులు

[మార్చు]

భారతదేశ వ్యాప్తంగా వివిధ యూజర్ గ్రూపులు ఇప్పటికే పనిచేస్తున్నాయి. అవి:

  • హిందీ వికీమీడియన్స్: భారతదేశంలోనూ, బయటా వివిధ హిందీ భాషా వికీమీడియా ప్రాజెక్టుల వృద్ధి కోసం ప్రాధమికంగా పనిచేస్తారు. అయితే, సంస్కృతం హిందీకి తల్లి వేరు కనుక సంస్కృత వికీమీడియా ప్రాజెక్టుల మీద, హిందీకి అత్యంత సన్నిహిత సంబంధం ఉన్న ఫిజీ హిందీ వికీమీడియా ప్రాజెక్టుల మీద కూడా పనిచేస్తారట.
  • వికీపీడియన్స్ ఆఫ్ గోవా: గోవా గురించి వివిధ భాషల వికీపీడియాల్లో సమాచారం అభివృద్ధి, గోవాలో వికీపీడియా సముదాయ విస్తరణ ప్రధాన లక్ష్యాలు. కావడానికి గోవా గురించి ఫోటోలు కూడా పెంచుతాం అన్నారు, అదొక్కటి మినహాయిస్తే వీరి పరిధి వికీపీడియానే. ఇవి కాక కొంకణీ భాష (ఇది గోవా కేంద్రంగా, అటు మహారాష్ట్రలోనూ, కింద కర్ణాటకలోనూ సముద్ర తీరంలో విస్తరించిన భాష) వికీపీడియా మీద పనిచేయడం కూడా వీరి లక్ష్యాల్లో ఒకటి.
  • వికీమీడియన్స్ ఆఫ్‌ కేరళ: కేరళలోనూ, బయటా ఉన్న కేరళీయుల్లో వికీమీడియా ప్రాజెక్టుల భాగస్వామ్యం పెంపొందించడం ప్రధాన లక్ష్యం. కేరళ గురించిన సమాచారం పెంపొందించడం, మలయాళ వికీమీడియా ప్రాజెక్టుల విస్తరణ కూడా ఉన్నాయి లక్ష్యాల్లో.
  • మరాఠీ వికీమీడియన్స్: మరాఠీ వికీమీడియా ప్రాజెక్టులు, వికీడేటా, వికీమీడియా కామన్స్ కలిపి అభివృద్ధి చేస్తామని ఉంది. స్పష్టత లేదు.
  • వికీమీడియన్స్ ఆఫ్ ఇండియా టెక్నికల్: భారతదేశంలో సాంకేతికాంశాల మీద పనిచేసే వికీమీడియా టెక్నికల్ వాడుకరుల సముదాయ విస్తరణ, ఆ కృషి పెంపు.
  • డెహల్వీ వికీమీడియా: ఉర్దూ వికీమీడియా ప్రాజెక్టుల అభివృద్ధి కోసం
  • కరావళీ వికీమీడియన్స్: కరావళీ అన్నది దక్షిణ కర్ణాటక, ఉత్తర కేరళల కోస్తా ప్రాంతానికి పేరుట. దీనికి ఒక విధంగా మంగళూరు కేంద్రమని చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతంలో మాట్లాడే భాషలైన- తుళు, కన్నడ, కొంకణి భాషల మీద పనిచేయడం లక్ష్యం. వాస్తవానికి తుళు, కన్నడ మీద, కరావళి ప్రాంతంలో ప్రధానంగా పనిచేస్తున్నారు వీళ్ళు.
  • మైథిలీ వికీమీడియన్స్: మైథిలి భాషా వికీమీడియా ప్రాజెక్టులు, వికీమీడియా ప్రాజెక్టుల్లో మైథిలీ సంబంధిత అంశాలు, స్థూలంగా నేపాల్ ప్రాంతంలో వికీమీడియా ఉద్యమం (అయితే క్రమేపీ వికీమీడియన్స్ ఆఫ్‌ నేపాల్ అని వేరే యూజర్ గ్రూప్ ఏర్పడి ఆ మేరకు పనిని దాని పరిధిలోకి తెచ్చుకుంది) వీరి ఫోకస్.
  • పంజాబీ వికీమీడియన్స్: పంజాబీ భాషలో వికీమీడియా ఉద్యమ వ్యాప్తి కోసం ప్రధానంగా పనిచేస్తారు.
  • ఒడియా వికీమీడియన్స్: వికీమీడియా ప్రాజెక్టులు అన్నిటిలోనూ ఒడియా భాషా సంస్కృతుల అభివృద్ధి, అలానే ఒడిశా రాష్ట్రంలో వికీమీడియా ఉద్యమ వ్యాప్తి. వీరు ఒడియా వికీమీడియా ప్రాజెక్టులతో పాటుగా తమ రాష్ట్రంలో సంతాలి భాషా వ్యవహర్తలు వికీపీడియా ఏర్పరుచుకోవడానికి కార్యశాలలు చేసి చేయూతనిచ్చారు. ఆపైన సంతాలీ వికీపీడియా, సంతాలీ వికీపీడియన్ల యూజర్ గ్రూప్ ఏర్పడ్డాయి.
  • వికీమీడియన్స్ ఆఫ్ సంతాలీ లాంగ్వేజ్: సంతాలీ భాషా వికీపీడియా విస్తరణ, సంతాలీ భాషా వ్యవహర్తలు మరింతమంది వికీపీడియన్లు కావడం వంటివి లక్ష్యాలు.
  • వెస్ట్ బెంగాల్ వికీమీడియన్స్: పశ్చిమ బంగ రాష్ట్రంలో విస్తృతమైన, వైవిధ్యభరితమైన, బలమైన వికీమీడియా వాడుకరుల సముదాయాలను అభివృద్ధి చేయడం ప్రాథమిక లక్ష్యంగా చెప్పుకున్నారు. సరిహద్దుకు ఆవల బెంగాలీ సోదరులకు వికీమీడియా బంగ్లాదేశ్‌ అన్న జాతీయ స్థాయి యూజర్ గ్రూప్ ఉంది.

ఇక బలమైన వికీమీడియా సముదాయాలు, గట్టి కృషి ఉన్నా ఇప్పటికీ యూజర్‌ గ్రూపులు ఏర్పరుచుకోని భారతీయ వికీమీడియా సముదాయాల్లో తమిళం, కన్నడం (వీరి పరిధిని కొంతవరకూ తినేస్తూ కరావళి వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ ఉంది), గుజరాతీ భాషా సముదాయాలు తెలుగుతో పాటుగా ఉన్నాయి.

సముదాయ యూజర్ గ్రూప్ ప్రతిపాదన

[మార్చు]

ఇటీవల జరిగిన తెలుగు వికీపీడియా 16వ వార్షికోత్సవాల్లో ఈ అంశం చర్చకు వచ్చిన మీదట, ఈ ప్రతిపాదనను సముదాయం ముందుకు ఆన్‌వికీ తీసుకువచ్చే ప్రయత్నంగా, ఉన్న అవగాహనకు తోడు వికీమీడియా యూజర్ గ్రూప్ వ్యవస్థను సాధ్యమైనంత పరిశీలించి రూపొందించిన పేజీ ఇది.

ఆకరాలు, మరిన్ని వివరాలకు

[మార్చు]