Jump to content

వికీపీడియా:వాడుకరులకు సూచనలు/కాలదోషం పట్టినా వాక్యదోషం ఏర్పడకుండా రాయడం

వికీపీడియా నుండి

కాలదోషం పట్టినా వాక్యదోషం ఏర్పడకుండా రాయడం

[మార్చు]

వికీపీడియాలో వ్యాసాలను కొత్త సమాచారంతో తాజాకరించడం అనేది ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలి. లేదంటే సందర్భానికి కాలదోషం పట్టి కొన్ని వాక్యాలు మురిగిపోయి కనిపిస్తాయి. ఉదాహరణకు, "భారత సార్వత్రిక ఎన్నికలు 2024 ఏప్రిల్, మే నెలల్లో జరగనున్నాయి", "ఈ సినిమా 2020 జనవరి 4 న విడుదల కానుంది", "హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం 2008 నాటికి ప్రారంభమౌతుందని భావిస్తున్నారు". ఇలాంటివి చదివినపుడు, వ్యాసం పట్ల పాఠకులకు విముఖత కలిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని నివారించడానికి రెండు మార్గాలున్నాయి.

  1. సమాచారం చేర్చినపుడే భవిష్యత్తు తేదీల పక్కన తాజాకరణ అవసరం అని ఒక గుర్తు పెట్టడం. తద్వారా ఆ భవిష్యత్తు సమయం దాటినపుడు ఆ పేజీలే మాకు తాజాకరణ అవసరం అని సూచిస్తాయి. దీని గురించిన సమాచారం కోసం ఇదే పేజీలో కాలదోషం పట్టే వ్యాసాలను గుర్తించడం ఎలా అనే విభాగం చూడండి.
  2. రెండవ పద్ధతి - సమాచారానికి కాలదోషం పట్టినప్పటికీ, వాక్యాల్లో దోషం ఏర్పడకుండా రాయడం. దీని గురించి ఈ విభాగం తెలియజేస్తుంది.

ఈ పద్ధతిలో ముఖ్యమైన అంశం ఏమిటంటే వాక్యంలో దోషం ఏర్పడకుండా దాని నిర్మాణంలో జాగ్రత్త పడడం. దీని కోసం కింది పద్ధతులను పాటించవచ్చు

  • సాధ్యమైనంత వరకు "ప్రస్తుతం" అనే మాటను వాడవద్దు. "ప్రస్తుతం ఆమె బంగ్లాదేశ్ ప్రధాని పదవిలో ఉంది." అనే వాక్యం, 2024 ఆగస్టు 7 నుండి చెల్లదు, అందులో దోషం ఏర్పడుతుంది. దాని బదులు, "2024 ఆగస్టు 2 నాటికి ఆమె బంగ్లాదేశ్ ప్రధానిగా ఉంది" అని రాస్తే, దోషం ఏర్పడదు. ఆమె దిగిపోయాక, ఈ పేజీని తాజాకరించడంలో ఆలస్యమైతే, సమాచారం తాజాగా లేదు అనే లోపం ఉంటుంది తప్ప, "తప్పు" సమాచారమైతే ఉండదు (ఆగస్టు 6 న వ్యక్తి పదవి నుండి దిగిపోతే, ఆగస్టు 11 న "ప్రస్తుతం ఆమె ప్రధానిగా ఉంది" అనే వాక్యం తప్పే కదా!).
  • సంస్థల అధ్యక్షులు, చైర్మన్లు, గ్రామ పంచాయితీ అధ్యక్షులు,.. వగైరా పదవుల్లో ఉన్నవారి పేర్లను సమాచారపెట్టెలో రాయకపోవడం ఉత్తమం. ఒకవేళ రాసినా, తప్పనిసరిగా దాని పక్కనే బ్రాకెట్లో "ఫలానా తేదీ నాటికి" అని రాయాలి
  • ఇంగ్లీషు నుండి వ్యాసాలను అనువదించేటపుడు కూడా ఈ సంగతిని గుర్తుంచుకోవాలి. ఇంగ్లీషు లోని మూల వ్యాసంలో కూడా పాచిపోయిన సమాచారం ఉండే అవకాశం ఉంది. కాబట్టి అనువాదాన్ని ప్రచురించేటపుడు ఈ సంగతిని గమనంలో ఉంచుకోవాలి. "ఈ ప్రాజెక్టు 2012 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు." లాంటి వాక్యాలుంటాయి ("ఈ ప్రాజెక్టు నిరుడు పూర్తవుతుందని భావిస్తున్నారు" లాంటి వాక్యమే ఇది). అలాంటి సందర్భాల్లో తాజాసమాచారం కోసం వెతికి దాన్ని తగు మూలాలతో చేర్చడం అత్యుత్తమం. లేదా ఈ వాక్యాన్ని "ఈ ప్రాజెక్టు 2012 నాటికి పూర్తవుతుందని 2010 లో అంచనా వేసారు" లాగా మారిస్తే కొంత నయం - సమాచారం పాతదే అయినప్పటికీ, వాక్యంలో దోషం ఉండకుండా ఉంటుంది.