వికీపీడియా:వాడుకరులకు సూచనలు/సత్వర సాయం పొందాలంటే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీలో సత్వర సాయం పొందాలంటే[మార్చు]

వికీలో పనిచేస్తూ ఉంటే అనేక సందేహాలు వస్తూంటాయి. ఈ సందేహాల నివృత్తి కోసం ఇతర వాడుకరుల సాయం తీసుకోవడమనేది సాధారణ విషయం. సందేహాన్ని సందర్భాన్ని బట్టి మీ చర్చా పేజీ, వేరే వాడుకరి చర్చా పేజీ, రచ్చబండ, ప్రధాన పేరుబరికి చెందిన చర్చా పేజీ.. మొదలైన చోట్ల అడగవచ్చు. ఈ పేజీల్లో ఎక్కడైనా మీ ప్రశ్నను ప్రచురించగానే అది ఇటీవలి మార్పులు పేజీలో కనిపిస్తుంది. ఇతర వాడుకరులు అది చూసి మీకు అవసరమైన సాయం చేస్తారు. అయితే వికీలో మార్పు చేర్పులు జరిగే కొద్దీ, పాత మార్పులు వెనకబడిపోతూ చివరికి కనుమరుగై పోతాయి, మీ ప్రశ్నతో సహా. మరి, మీ ప్రశ్న కనుమరుగయ్యే లోపు దాన్ని ఎవరూ చూడకపోతే..! ఇక ఆ ప్రశ్న ప్రశ్నగానే ఉండిపోవాల్సిందేనా? అలా మిగిలిపోక పోయినా.., సాయం అందడానికి చాలా సమయం పట్టవచ్చు.

దీనికి ఒక ఉపాయం ఉంది.

ప్రశ్నను అడిగేటపుడు దానికి పైన {{సహాయం కావాలి}} అనే మూసను చేర్చాలి. అపుడది వర్గం:సహాయం కోసం ఎదురు చూస్తున్న సభ్యులు లేక పేజీలు అనే వర్గం లోకి చేరుతుంది. కొందరు నిర్వాహకులూ సీనియర్ వాడుకరులూ ఆ వర్గాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూంటారు. వాళ్ళకు మీ ప్రశ్న కనిపిస్తుంది, వెంటనే తగు సాయం చేస్తారు. అందువలన మీ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.

తగు పరిష్కారం దొరికాక, ఈ మూసను తీసేసి, దాని స్థానంలో మూస:సహాయం చేయబడింది అనే మూసను చేర్చాలి. ఒక వారం రోజుల్లో సరైన సహాయం దొరక్కపోతే మూస:సహాయం కావాలి-విఫలం అనే మూసను పెట్టాలి. ఇది ప్రశ్న అడిగినవారే చెయ్యాలి.