వికీపీడియా:హైదరాబాదులో వికీపీడియా జన్మదిన వేడుక విశేషాలు - జనవరి 2012

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆహుతులకు స్వాగతం చెప్తూ సి.బి.రావు. చిత్రంలో పక్కన ఉన్న వికిపిడియన్లు వీవెన్ మరియు రాజశేఖర్.

ఉచిత విజ్ఞానసర్వస్వమైన వికీపీడియాను జిమ్మీ వేల్స్ ప్రారంభించి 11 సంవత్సరాలై, 12 వ సంవత్సరములో అడుగిడుతున్న సందర్భంలో, వికీమీడియా, భారతదేశం వారి ఆధ్యర్వంలో 29-01-2012 న వికీ జన్మదిన వేడుక జరిగింది. దోమలగూడలోని వికీపీడియన్ రాజశేఖర్ కార్యాలయంలో ఈ సభను ప్రారంభిస్తూ, సభకు అధ్యక్షత వహించిన వికీపీడియన్ సి.బి.రావు సభికులకు స్వాగతం పలికారు. ఎన్‌సైక్లోపిడియా ఆఫ్ బ్రిటానికా లాంటి విజ్ఞాన సర్వస్వాలు చందాదారులుకు మాత్రమే సేవలందిస్తాయని, వికీపీడియా ప్రపంచం లోని సకల జనులకూ ఉచితంగా విజ్ఞానం అందించటానికి కంకణం కట్టుకుందనీ ఇట్లాంటి సేవాసంస్థలను అందరూ ఆదరించాలని అన్నారు. వికీపీడియా వాడటం ద్వారా ఏ విషయం పై ఐనా విపుల సమాచారం మనకు సత్వరం లభ్యం అవుతుందని సి.బి.రావు చెప్పారు.

వికిపీడియా గురించి వివరిస్తున్న రెహమాన్

వికీపీడియన్ రహమానుద్దీన్ వికిపీడియా మొదటి పేజీ , వికీ ధ్యేయాల గురించి వివరించారు. వికీపీడియన్ వీవెన్, వికీపీడియాలో ఖాతా తెరవటం, మనకు కావలసిన సమాచారం కోసం వికీ లో ఎలా అన్వేషణ జరపవచ్చో, వికీ లో ఎలాంటి వ్యాసాలు వ్రాయవచ్చో వివరించారు. మొబైల్ ఫోన్లలో తెలుగులో అంతర్జాలాన్ని ఎలా వీక్షించవచ్చో వివరించారు. తెలుగులో, మొబైల్ ద్వారా చిన్న సందేశాలు పంపవచ్చని, ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా వికీపీడియ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ లను దిగుమతి చేసుకొని వికీపీడియా సేవలను మరింత క్రియాశీలకంగా పొందవచ్చని వీవెన్ వివరించారు.

కార్యక్రమం మధ్యలో అతిధులకు కేక్, మిఠాయి ఇంకా సమోసా తో కూడిన అల్పాహారం, శీతల పానీయం ఇచ్చారు.

ఈ సందర్భం లో వికీపీడియాను ప్రజలకు మరింత దగ్గరగా తీసుకొచ్చేందుకై రాజశేఖర్ ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. వికీపీడియా వాడకం లో ఎవరికైనా సందేహాలున్నా, మరింత సమాచారం కావాలన్నా తనను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చన్నారు. రాజశేఖర్ సెల్ సంఖ్య: 9246376622. తర్వాత 2011 లో వికీపీడియాకు విశిష్ట సేవ చేసిన వారి పేర్లను ప్రకటించి, సభలో ఉన్న ముగ్గురు వికీ విశిష్ట సేవకులకు కినిగె.కాం వారు అందించిన ఈ-పుస్తకాల బహుమతి కూపన్లు ఇచ్చారు. విశిష్ట వికీపీడియన్ల పూర్తి చిట్టా కొరకు Telugu Wikipedia 2011 Overview చూడండి. హాజరు కాని విశిష్ట వికీపిడియన్లకు బహుమతి వేగు ద్వారా పంపుతున్నారు. అధ్యక్షుడు సి.బి.రావు ఛాయాగ్రాహకులకోసం "చారిత్రాత్మక కట్టడాలను వికీ ప్రేమిస్తుంది" అనే కార్యక్రమం గురించిన ప్రకటన చేశారు. ఔత్సాహిక ఛాయాగ్రాహకులకు వికీ చారిత్రక కట్టడాల పర్యటన నిర్వహించి, ఉత్తమ ఛాయాచిత్రాలకు బహుమతులిచ్చి వాటిని వికిపీడియాలో ప్రచురిస్తారని చెప్పారు. ఈ విషయమై విపుల ప్రకటన త్వరలో వెలువరిస్తామన్నారు. వికీ గురించిన సభికుల పలు సందేహాలకు వీవెన్ బదులిచ్చారు. సభలోనే కొందరు ఆసక్తిపరులకు వికీలో ఖాతాలు తెరవటం లో రాజశేఖర్ మరియు రెహ్మానుద్దీన్ సహాయపడ్డారు. తమిళ వికీ లో రచయితలను ఎలా ప్రోత్సాహిస్తారో వికిపిడియన్ రవిశంకర్ వివరించారు. రహమానుద్దిన్ వందన సమర్పణ చేశారు. ఈ సభలో బెంగలూరు నుంచి,అంతర్జాలం ద్వారా, వికీమీడియ, భారత దేశ అధ్యక్షుడు అర్జునరావు, మరో వికీపీడియన్ సుజాత చెన్నై నుంచి పాల్గొన్నారు.

ఛాయా చిత్ర మాల

బయటి లింక్: దీప్తిధార