వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/వికీలో మీవూరు 1
ఇది ప్రచారం నిమిత్తం తయారుచేస్తున్న వ్యాసం. మీ కూర్పులతో దీనిని ఉపయోగకరంగా చేయండి.
వికీపీడియా
[మార్చు]వికీపీడియా అనేది వివిధ భాషలలో వెబ్ ఆధారంగా, స్వచ్ఛంద రచయితలచే కూర్చబడుతున్న ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. ఆంగ్లంలో http://en.wikipedia.org/wiki/Main_Page అన్న వెబ్‌సైటులో దీనిని మీరు చూడవచ్చును. 2001లో ఆంగ్లంలో ప్రారంభమైన ఈ వికీపీడియా ఇప్పుడు 200 పైగా భాషలలో విస్తరించింది.
వికీపీడియా అంటే ఎవరైనా దిద్దుబాటు చెయ్యగల ఎన్సైక్లోపీడియా. వికీపీడియా విజయ రహస్యమంతా ఈ వికీ అనే మాటలోనే ఉంది. వికీపీడియాలో రాసేది ఎవరో ప్రముఖ విద్యావంతులో, ప్రత్యేకంగా అందుకోసం నియమితులైన రచయితలో కాదు. మనలాంటి వారంతా అక్కడ రాస్తున్నారు. వికీపీడియాలో ఎవరైనా రాయవచ్చు, ఏ విషయం గురించైనా రాయవచ్చు. కొన్ని నియమ నిబంధనలకు, కట్టుబాట్లకు లోబడితే చాలు.
- వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వం. ఇది మౌలిక డాక్యుమెంట్లు దొరికే వనరు కాదు, వార్తాపత్రిక కాదు. మీ స్వంత అభిప్రాయాలు, అనుభవాలు, వాదనలు ప్రచురించుకునే స్థలం అంతకంటే కాదు. సమాచారంలో సభ్యులంతా శ్రమించాలి.
- వికీపీడియా తటస్థ దృక్కోణాన్ని అనుసరిస్తుంది. అంటే వ్యాసాలు ఏ ఒక్క దృక్కోణాన్నీ ప్రతిబింబించవు. దీనికోసం ఒక్కోసారి వివిధ దృక్కోణాలను చూపవలసి రావచ్చు. దీనివలన చదువరులకు అది ఎవరి దృక్కోణమో తెలుస్తుంది. అవసరమైనచోట వ్యాస మూలాలను, వనరులను ఉటంకించాలి.
- వికీపీడియాలోని విషయ సంగ్రహం GNU ఫ్రీ డాక్యుమెంటేషన్ లైసెన్సు (GFDL) కింద పూర్తిగా ఉచితం. ఏ వ్యాసం కూడా, ఏ ఒక్కరికీ స్వంతమూ కాదు, ఎవరి నియంత్రణా ఉండదు. కాబట్టి మీరు చేసే రచనలను ఎవరిష్టం వచ్చినట్లు వారు మార్పులు, చేర్పులు చెయ్యవచ్చు.
- వికీపీడియా తోటి సభ్యులను - వారితో మీరు ఏకీభవించకపోయినా - గౌరవించండి. వ్యక్తిగతమైన దాడికి దిగకండి. వ్యర్థ వివాదాలకు తావివ్వకండి.
- వికీపీడియాలో మరే స్థిర నిబంధనలూ లేవు. వ్యాసాలలో మార్పులు చేర్పులు చేసేందుకు చొరవగా ముందుకు రండి. వ్యాసాన్ని చెడగొడతామేమోనని వెనకాడవద్దు. పాత కూర్పులన్నీ జాగ్రత్తగానే ఉంటాయి కాబట్టి, దానివలన వచ్చే నష్టమేమీ ఉండదు. అయితే, ఒక్క విషయం..మీరు ఇక్కడ రాసేది శాశ్వతంగా ఉండే అవకాశం ఉందని గ్రహించండి.
- సమాచారానమును ప్రచురంచు విషయములొ దయచేసి నిజయితితో వ్యవహరించమని మనవి.
తెలుగు వికిపీడియా
[మార్చు]తెలుగులో విజ్ఞాన సర్వస్వాలు చాలా అరుదు. అందునా ఎన్సైక్లోపీడియా బ్రిటానికా లాంటి బృహత్తర విజ్ఞాన సర్వస్వం అసలు లేనేలేదు. ఆవకాయ నుండి అంతరిక్షం దాకా, అటుకుల దగ్గర నుండి అణుబాంబు దాకా ప్రతీ విషయాన్ని వివరిస్తూ సాగే విశాల, విశిష్ట విజ్ఞాన సర్వస్వాన్ని తయారుచెయ్యడమంటే మామూలు విషయం కాదు. అటువంటి బృహత్కార్యాన్ని సాధించేందుకు నడుం కట్టారు, తెలుగువారు. ఐతే ఈ పనికి పూనుకున్నది ప్రభుత్వము, లక్ష్మీ పుత్రులూ కాదు.., కేవలం మనలాంటి సామాన్యులే భుజం భుజం కలిపి ఈ పని చేస్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. వందల మంది ఇందులో భాగస్తులు.
ఒక్కసారి http://te.wikipedia.org/wiki/ చూడండి. అనేకమంది ఔత్సాహికులు తమ తీరిక సమయాలలో ఎన్నో విషయాలను తెలుగులో తెలుగువారికోసం పొందు పరుస్తున్నారు. రాసిలోనూ, వాసిలోనూ మొదటి 20 స్థానాల సరసన తెలుగు వికీని నిలబెట్టాలని వికీ కార్మికులు శ్రమిస్తున్నారు. మీరూ ముందుకు రండి. సహకరించండి.
'విజ్ఞాన సర్వస్వం' అన్న పేరును బట్టే ఏ విషయమైనా (నిష్పాక్షికంగా, ఆధారపూర్వకంగా) తెలుగు వికీలో వ్రాయవచ్చును. అయితే ప్రస్తుతం తెలుగు వికీ ఒక విషయంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నది. అది తెలుగునాట అన్ని గ్రామాలు గురించిన సమగ్ర సమాచారాన్ని పొందు పరచడం. మీ వూరి చరిత్ర ఏమిటి? జీవనం ఎలాంటిది? అక్కడ జరుగుతున్న కృషి ఏమిటి? "ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీలెవ్వరు? ఏ శిల్పం? ఏ గాంధర్వం? ఏ వెల్గులకీ ప్రస్థానం?"
తెలుగువికీలో మీ వూరు గురించి
[మార్చు]రాష్ట్రంలో 25వేల పైగా గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఉన్నాయి. ఎంతో చిన్నదైన పల్లెకు కూడా వందల సంవత్సరాల చరిత్ర ఉంది. జీవన విధానం, కృషి ఉన్నాయి. సామాజిక, ఆర్ధిక స్వరూపం ఉన్నది. విజయాలున్నాయు. ఉత్పాతాలున్నాయి. సమస్యలున్నాయి. ప్రణాళికలున్నాయి. కాని వీటిని సమగ్రంగా ప్రచురించే వేదిక ఇంతకు ముందు లేదు. ఇప్పుడు తెలుగు వికీ ఆ లోటును పూరించడానికి కృత నిశ్చయంతో ఉన్నది. మీరు సహకరిస్తే.
గమనించండి. ఇది ఇంటర్నెట్‌లోనో, ప్రభుత్వ ఆఫీసులోనో దొరికే సమాచారం కాదు. మీవూరి గురించి, మీకు తెలిసిన వూళ్ళ గురించి వ్రాయండి. అది మారుమూల పల్లె గానీ, మండలి కేంద్రం గానీ, చిన్న పట్టణం గానీ, మహా నగరం గానీ - మీ వూరిగురించి మీరే వ్రాయండి.
ఏమి వ్రాయవచ్చు
[మార్చు]స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వంలో ఏమి వ్రాయాలో నిర్ణయించేది రచయితలు గాని అధికారులు కాదు. మీరు వ్రాసేది (1) నిజం (2) సార్వ జనీనం (3) నిర్ధారించుకోవడానికి వీలైన ఆధారాలున్నది (4) నిష్పాక్షికం అయి ఉండాలి. ఇంకా తెలుగు భాషలో వ్రాయాలి. వ్రాసినదానినిన మళ్ళీ మళ్ళీ మార్పులు చేయవచ్చును. అదనపు సమాచారం చేర్చవచ్చును. ఏమి వ్రాయడానికి వీలవుతుందో సూచనా ప్రాయంగా ఇక్కడ వివరిస్తున్నాము.
- ఏ వూరు? ఎక్కడ? మీ వూరు పేరు, మండలం, జిల్లా - ఈ మూడు వివరాలూ తప్పనిసరిగా కావాలి. లేకపోతే వికీలో దానిని వర్గీకరించడం, వెదకడం సాధ్యపడదు. ఇంకా మార్గము, సరిహద్దులు, గుర్తులు, దగ్గరి పట్టణం నుండి దూరం వంటి వివరాలు కూడా ఇవ్వవచ్చును. వీలయితే పంచాయితీ ఆఫీసు, పోస్టాఫీసు టెలిఫోను నెంబరులు.
- గణాంకాలు -జనాభా (స్త్రీలు, పురుషులు), వైశాల్యం, ఇండ్లు, వీధులు, అక్షరాస్యత వంటి వివరాలు.
- సదుపాయాలు - స్కూళ్ళు, కాలేజీలు, ఆసుపత్రులు , గ్రంధాలయాలు, పోస్టాఫీసు, బస్సు రైలు సౌకర్యం , దుకాణాలు, గుడులు, చర్చిలు, మసీదులు, సినిమా హాళ్ళు (సారాకొట్లు ఉండే ఉంటాయి. వ్రాయనవసరం లేదు. ఒకవేళ మద్యపాన నిషేధం మీ వూళ్ళో అమలు అయితే తప్పక వ్రాయండి)
- ఆర్ధికం - ప్రధానమైన ఉపాధి అవకాశాలు. ఎందరు ఏయే పనులు చేస్తున్నారు? ఏ యే పంటలు? నీటి వనరులేమిటి? ఇతర వృత్తులేమిటి? పాడి పరిశ్రమ, కోళ్ళ పెంపకం, నేతపనులు, టౌనులో పనిచేసేవారు, దుకాణాలు, ఫ్యాక్టరీలు - వగైరా
- చరిత్ర - చిన్న వూరికైనా పెద్ద వూరికైనా చరిత్ర ఉంటుంది. కాని మనకు వ్రాసే అలవాటు తక్కువ. పరిశోధించండి.
- సంస్కృతి - సాధారణంగా పాటించే సంస్కృతి. ప్రత్యేకతలు. సంబరాలు. తిరణాళ్ళు. మీవూరికి ప్రత్యేకమైన కధలు.
- విజయాలు - క్రొత్త వ్యవసాయ విధానాలు, నీటివనరుల అభివృద్ధి, అక్షరాస్యత, రోడ్లు, స్వచ్ఛంద సంస్థల సాధన, పొదుపు సంఘాల పనులు, వనరుల సమీకరణ.
- సమస్యలు - చాలా వుండవచ్చును, ముఖ్యమైనవి. వాటికి శాస్త్రీయమైన పరిష్కారాలు ఎవరైనా అధ్యయనం చేశారా? (ఎలక్షను వాగ్దానాలు కాదు)
- వార్తలలో - ఏవైనా ప్రమాదాలు, వరదలు, ఎన్‌కౌంటర్లు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, సంబరాలు.
- ప్రముఖులు - వివిధ రంగాలలో రాణించిన మన వూరి బిడ్డలు. ఇదివరకు గానీ, ఇప్పుడు గానీ. మీ వూరిలో ప్రత్యేకమైన నైపుణ్యం, ప్రతిభ గలవారు. సమాజసేవకులు. ఇంకా..
- విశేషాలు - మీకే తెలియాలి.
- ఫొటోలు - ఏవైనా ఒకటి రెండు వివరణాత్మకమైన, లేదా ఆసక్తి కరమైన ఫొటోలు జోడించండి. మీరు పంపే ఫొటోలు మీరు తీసినవైతే మంచిది. అవి Public Domain ఫొటోలుగా పరిగణించబడుతాయి. అంటే వాటిని వేరెవరైనా వాడుకొనవచ్చును.
ఎలా వ్రాయవచ్చు
[మార్చు]http://te.wikipedia.org/wiki/ చూడండి. మొదటి పేజీలోనే "వికీపీడియాలో మీ ఊరు ఉందా?" అన్న లింకుపై నొక్కితే వివిధ జిల్లాలకు, వాటినుండి మండలాలకు, వాటినుండి గ్రామాలకు లింకులున్నాయి. మీ వూరి పేరుమీద ఇప్పటికే ఒకటి రెండు వాక్యాలు, లేదా ఎక్కువగా, ఎవరైనా వ్రాసి ఉండవచ్చును. దానికి మీరు వ్రాయాలనుకొన్నది అదనంగా చేర్చవచ్చును.
ఒకవేళ మీవూరి పేరుతో ఇప్పటికే ఒక పేజీ లేకపోతే మీరు సృష్టించవచ్చును. క్రొత్త పేజీలో ముందుగా వూరు పేరు, మండలం, జిల్లాలు తప్పక వ్రాయండి. తరువాత మిగిలిన విషయాలు వ్రాయండి. ఇదంతా తెలుగులోనే వ్రాయాలి. ఇప్పుడు వికీపీడియాలో తెలుగులో వ్రాయడం చాలా సులభం. అక్కడ సహాయం పేజీ కూడా ఉంది.
ఇదంతా చేయడానికి మీరు వికీలో సభ్యులుగా నమోదు చేసుకొనవలసిన అవుసరం లేదు. కాని సభ్యులుగా చేరితే కొన్ని సదుపాయాలున్నాయి. ఉదాహరణకు మీరు వ్రాసినదాని గురించి మీకు ఏవయినా సందేశాలు పంపడం సులభం అవుతుంది.
అక్కడితో ఆపకండి. ఇంకా వికీ క్రొత్త విషయాలు వ్రాస్తూ ఉండండి. ఉన్న వ్యాసాలు దిద్దుతూ ఉండండి. మీ సలహాలను, సూచనలను వ్రాస్తూ ఉండండి.
ఏమైనా సందేహాలుంటే
[మార్చు]తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి కీ బోర్డు వ్యాసం చూడండి.
చొరవగా ముందుకు రండి
[మార్చు]ఇక్కడ ప్రత్యేకంగా వక్కాణించే విషయాలు
- ప్రతి వూరిగురించి కనీసం రెండు పేజీల వ్యాసమయినా తెలుగు వికీలో ఉండాలని మా ప్రయత్నం.
- ఈ పని చేయడానికి మీరు పండితులు లేదా పరిశోధకులు కానవసరం లేదు. ఉత్సాహం కలిగి ఉంటే చాలు.
- మీరు వ్రాసిన దానిలో ఏమైనా తప్పులుంటే వాటిని సరిదిద్దేందుకు అందరికీ అవకాశమూ, హక్కూ కూడా ఉన్నాయి.
- దీనివలన మీకు, వికీపీడియాకూ ఏ మాత్రం ఆర్ధిక ప్రయోజనం లేదు. ఇది తెలుగు భాషను మరింత సుసంపన్నం చేయడానికి, తెలుగులో సమాచారాన్ని అందించడానికి చేస్తున్న ప్రయత్నం.
చొరవగా ముందుకు రండి. వికీ యజ్ఞంలో పాల్గొనండి. తెలుగునాట వూళ్ళ గురించి మాత్రమే కాదు. ఏ విషయం గురించయినా మీరు తెలుగు వికీలో వ్రాయవచ్చును.