విలాసిని నాట్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విలాసిని అనేది ఒక రకమైన నృత్య ప్రక్రియ. ఇది ఒక పురాతనమైన నాట్యప్రక్రియ.

రీతులు, పుట్టుక విశేషాలు[మార్చు]

‘విలాసిని’ నాట్యం షుమారు వెయ్యి సంవత్సరాల పూర్వ నుండి మన ఆంధ్రదేశంలో వున్న నృత్య సంప్రదాయం. విలాసిని నాట్య రూపాంతరములే రుద్రగణికలు, దేవదాసీలు, స్వామిని, భోగిని, సాని, భోగం కళావంతులు మొదలగు నాట్యరూపములు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంప్రదాయ నృత్యరీతి కూచిపూడి అని ఎవ్వరయినా తడుముకోకుండా చెపుతారు. కొంచెం ఆలోచించి చెప్పే జవాబు పేరిణి. కొద్దిమంది మాత్రమే ‘ఆంధ్రనాట్యం’ అని చెప్పగలరు.

దేవదాశీ వ్యవస్థలో విలాసిని నృత్యం[మార్చు]

విలాసిని నాట్యం, దేవదాసినాట్యం, ఆలయనాట్యం అనే పేర్లు కూడా ఉన్న ఈ నాట్యరీతి నిజానికి కూచిపూడి నృత్యరీతికన్నా పురాతనమైనది. కొన్ని సామాజిక కారణాలవల్ల పతనావస్థకి చేరకున్నది. కొందరు నాట్యాచార్యులు, సాహితీ పరిశోధకుల కృషి పుణ్యమా అని కొడిగట్టకుండా మిగిలి, ఉత్సాహవంతులైన నర్తకీ నర్తకులచేత ప్రదర్శింపబడుతోంది. రాజస్థానాల్లో ఎంత ఉన్నతమైన జీవితం గడిపిన దేవదాసీల జీవితాల్లో కాలక్రమంలో వచ్చిన మార్పులు ఈ నాట్యరీతి పతనానికి దారి తీశాయి. దైవారధనలో దేవనర్తకి చేసే నాట్యం దేవదాసి నాట్యం. ప్రాచీనమైన దేవదాసీ వ్యవస్థలో ఒకప్పుడు కులంతో నిమిత్తం లేకుండా సముచిత లక్షణాలున్న ఏ బాలిక అయిన దేవదాసి కావచ్చు. ఆలయాలలో వేకువజామున దేవుడికి మేలుకొలుపులు పాడడం నుంచి, రాత్రివేళ పవళింపుసేవ వరకు నృత్యగానాలు ప్రదర్శించిన దేవదాసిీలు రాజులు ఇచ్చిన మాన్యాలతో పొట్ట పోసుకుంటూ నిరాడంబర జీవితం గడిపేవారు. కాలక్రమంలో వీరి నృత్యం ఆలయం నుంచి రాజాస్థానానికి మారింది... ఫలితంగా వీరి జీవన విధానంలోనూ మార్పు వచ్చింది. విలాసాలకు, సౌఖ్యాలకు అలవాటు పడ్డారు. ఇలా దేవదాసి అన్నది ఒక కులంగా మారిపోయింది. రాజ్యాలు, జమీందారీలు అంతరించడంతో దేవదాసీలు ‘మేజువాణీ’ల దారిపట్టారు. ఫలితంగా దేవదాసీ నాట్యరీతికి గౌరవం తగ్గింది. రానురాను ఈ కళని ప్రదర్శించేవారు లేక అంతరించే దశకు చేరింది.

పరిసోధనలు, పరిశోధకులు[మార్చు]

ఆదరణ తగ్గిన ఈ నృత్యంపై ఆశక్తి కలిగిన కొందరు నృత్యంపై పరిశోధనకు పూనుకొని పూర్వవైభవం కలిగించే దిశాగా అడుగులు వేస్తున్నారు. వారిలో కొందరు

  • నర్తకి స్వప్నసుందరి
  • నాట్యాచార్య నాటరాజ రామకృష్ణ
  • కవి, చారిత్రక పరిశోధకుడు ఆరుద్ర

ప్రాచీన, అంతరిస్తున్న తెలుగు నాట్యరీతికి పునశ్శక్తిని కలిగించే ఉద్దేశంతో వీరంతా ఆరుద్ర నిర్దేశనం/మార్గ దర్శకత్వంలో ఈ నాట్య రీతిపై పరిశోధనలు ప్రారంభించారు. డా।। ఆరుద్ర ఈ దేవదాసి నృత్యాన్నే విలాసిని నాట్యంగా నామాంతరం చేశారు. ఈ నాట్యం గురించి తెలియని వారు ‘‘దేవదాసి’’ అనే పేరు వినగానే రకరకాల ఊహాగానాలు చేశారు, చేస్తున్నారు. నిజానికి ఈ నాట్యరీతిలో భక్తి, విరహం ఉంటాయి. అశ్లీలత, అసభ్యత ఉండవు. కృష్ణుడి కోసం ఎదురు చూసే సత్యభామ నవరసాలను - కూచిపూడి భామాకలాపానికి పూర్తి భిన్నంగా - ఈ నాట్యరీతిలో చూడొచ్చు. విగతమవుతున్న విలాసిని నాట్యాన్ని వికాసవంతం చేద్దాం.

మూలాలు[మార్చు]