వి.రతన్ ప్రసాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వి.రతన్ ప్రసాద్

రతన్‌ప్రసాద్ ఆలిండియా రేడియోలో ప్రసారం కాబడిన "కార్మికుల కార్యక్రమం"లో "చిన్నక్క"గా సుప్రసిద్ధులు. ఆమె అసలు పేరు "రత్నావళి". ఆమె రత్నావళిలో "రతన్‌", భర్త "ప్రసాద్‌" పేరు ఇముడ్చుకుని రతన్‌ప్రసాద్‌ అయ్యింది. ఆమె 10 ఏళ్లు రమణక్కగా, 30 ఏళ్లు చిన్నక్కగా రేడియోలో కార్యక్రమాలు చేశారు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆమె 1933 నవంబరు 10 న జన్మించారు. ఆమె సంగీతం ఆడిషన్‌ కోసం ఆకాశవాణి కేంద్రానికి వెళ్ళినపుడు ఆమె స్వర మాధుర్యాన్ని గుర్తించి ఆమెను అనౌన్సర్‌గా తీసుకున్నారు."చేనుగట్టు" కథా పఠనంతో ప్రారంభమైన ఆమె ప్రస్థానం ఎన్నో మలుపులు తిరిగింది. 1955 నుండి కాంట్రాక్ట్‌ విూద ఉద్యోగంలో చేరారు. 1958కి పర్మినెంట్‌ అయ్యారు. అచట ఆమెకు ప్రముఖ సాహితీ ప్రముఖులు అయిన త్రిపురనేని గోపీచంద్, దేవులపల్లి, దాశరథి వంటి వారితో కలసి పనిచేసే అవకాశం కలిగింది. నాటకాల్లో కూడా పాల్గొని మంచి నటిగా పేరు తెచ్చుకున్నా అడపదడపా ప్రాంతీయ వార్తలు చదివేవారు. అప్పట్లో అన్నీ ప్రత్యక్ష ప్రసారాలే వుండేవి. అన్నిరకాల గ్రేడులు దాటి సెలక్షన్‌ గ్రేడు అనౌన్సర్‌గా 1992లో రిటైర్‌ అయ్యాను. ఆమె జాతీయ కవిసమ్మేళనాలకు, రేడియో సంగీత సమ్మేళనాలకు, ఆహూతుల సమక్షంలో ఎన్నోసార్లు అనౌన్స్‌ చేశారు.

కార్మికుల కార్యక్రమంలో

[మార్చు]

అనౌన్సర్‌నయినా "చంద్రి"గా తెలంగాణా మాండలికంలో చాలా కార్యక్రమాలను గ్రామసీమల్లో నిర్వహించారు. ఆదివారాలు కార్మికుల కార్యక్రమంలో ఆమె రమణక్కగా (తెలంగాణా మాండలికం), వట్టెం సత్యనారాయణ (జగన్నాథం) కలసి వాదించుకుంటుంటే మూడో పాత్ర ప్రవేశించి ఆ అంశంలో ప్రాధాన్యతనూ, ఉపయోగాల్ని చెప్పడం జరిగేది. ఈ కార్యక్రమంలో ఒకసారి "రమణక్క నీకు నోరు ఎక్కువ" అన్నాడు జగన్నాథం. ఆ విషయంపై శ్రోతల నుండి అనేక బెదిరింపు ఉత్తరాలు వచ్చి వివాదమై కార్మికుల కార్యక్రమం రెండు నెలలపాటు నిలిపివేశారు. ఆ తదుపరి ఆమె రమణక్కగా అవతారాన్ని చాలించి నేను చిన్నక్కగా, సత్యనారాయణ (జగన్నాథం) ఏకాంబరంగా పరకాయ ప్రవేశం చేసి కార్యక్రమాలను కొనసాగించారు.

ఇతర కార్యక్రమాలు

[మార్చు]

రేడియోలో ప్రసారమైన "కాంతం కథలు"లో కాంతంగా నటించారు. మునిమాణిక్యం ఎంతో మెచ్చుకున్నారు. స్త్రీల కార్యక్రమం 'రంగవల్లి" లో "అమ్మబడి" అనే శీర్షిక నిర్వహించారు. "గ్రామసీమలు"లో రామాయణం చదివి వినిపించేవారు. 1962లో చైనా యుద్ధ సమయంలో సైనికసోదరులు వారి భార్యలకు వ్రాసినట్లుగా దేశభక్తి పూరితమైన "హంస సందేశం" అనే ధారావాహిక ఉత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించారు. "వన్నెల విసనకర్ర" శీర్షికలో స్త్రీల వస్త్రధారణ, నగల గురించి వ్యాస పరంపర చేశారు. అనేక కథలు రచించి ప్రసారంచేశారు. చంద్రి, రమణక్క, చిన్నక్కలుగా స్టాఫు క్యారెక్టర్స్‌ నిర్వహించారు. ప్రపంచంలోని ప్రసార వ్యవస్థల్లో (బి.బి.సి. వాయిస్‌ ఆఫ్‌ అమెరికా) 28 సంవత్సరాలపాటు ఏకథాటిగా ఇలాంటి ఒకేపాత్రను నిర్వహించినవారు అరుదు. అలాగే 'నవలా స్రవంతి శీర్షికన దాశరథి రంగాచార్య గారి "చిల్లర దేవుళ్ళు" నవలను తెలంగాణా మాండలికంలో ఆరునెలలపాటు చదివారు.

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]