వీరేశలింగం టౌన్ హాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వీరేశలింగం టౌన్‌హాల్

వీరేశలింగం టౌన్ హాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి టౌన్ హాలుగా ప్రసిద్ధి చెందింది. దీనిని సంఘ సంస్కర్త అయిన కందుకూరి వీరేశలింగం పంతులు రాజమహేంద్రవరం పట్టణం నందు 1891లో నిర్మించారు.[1] [2]

టౌన్ హాల్ విశేషాలు[మార్చు]

ఈ టౌన్ హాలు నిర్మించి 125 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మే 27, 2015 న సపాద శత వార్షికోత్సవం నిర్వహించారు. సంస్కరణలకు, చైతన్యానికి మారుపేరుగా వుండే బెంగాల్లో దేశంలోనే మొట్టమొదటి టౌన్ హాలు ఏర్పడింది. రాజా రామ్మోహన్ రాయ్ కలకత్తాలో నిర్మించిన టౌన్ హాలుని స్ఫూర్తిగా తీసుకుని తెలుగునాట మొట్టమొదటి టౌన్ హాలు రూపుదిద్దుకుంది. శ్రీ వీరేశలింగం పంతులు స్వంత ధనంతో టౌన్ హాలు నిర్మించి, ట్రస్టు బోర్డు ఏర్పాటుచేసి, ట్రస్ట్ డీడ్ కూడా రిజిస్ట్రేషన్ చేసి, ప్రజాపరం చేసారు. అయితే ట్రస్ట్ బోర్డులో రిజర్వేషన్ సూత్రాన్ని కూడా ప్రతిపాదించి, ఆరోజుల్లో సంచలనం సృష్టించిన శ్రీ వీరేశలింగం పంతులు గారు ఆయన మాత్రం ఈ ట్రస్టులో లేకుండా, ఆదర్శంగా నిలిచారు. ఈనాటికీ ఈ సూత్రం ఇక్కడ అమలు అవుతోంది. అందుకే కేంద్ర పురావస్తు శాఖ అధికారులు ఇక్కడకు వచ్చి పరిశీలించి, హిందూ - ముస్లిం - క్రైస్తవ పద్ధతులకు అనుగుణంగా టౌన్ హాలు నిర్మించినట్లు తేల్చారు కూడా. మేధావులు ప్రతిరోజూ సాయంత్రం ఓ హాలులో కూర్చుని, దేశ - స్థానిక సమస్యలు చర్చించుకోవడం కోసం ఈ పురమందిరం ఆలోచన. సాంఘిక , సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, ఇన్ డోర్, అవుట్ డోర్ ఆటలు ఆడుకోవడం, గ్రంధాలయం, పఠనాలయం, ఇలా అన్ని ఓ చోట ఉండేలా పక్కా ప్రణాళిక తో ఈ టౌన్ హాలు నిర్మించారు.[1]

కాగా వితంతు వివాహం విషయం గురించి ప్రసంగం ఇవ్వడానికి ఎక్కడా అనువైన స్థలం దొరకని పరిస్థితుల్లో సర్వజనులకు ఉపయోగపడే ఓ ఉపన్యాస సభా భవనం ఉండాలని భావించి, పురమందిర నిర్మాణానికి వీరేశలింగం ఉపక్రమించినట్లు కూడా చెబుతారు.

సపాద శత వార్షికోత్సవంలో గోదావరి జిల్లాల్లో సాంస్కృతిక, సాంఘిక సేవలు అందించిన మహిళా మూర్తులు డాక్టర్‌ చిరంజీవినీకుమారి, ఎల్‌.శేషుకుమారి(కాకినాడ), మేజర్‌ చల్లా సత్యవాణి, డాక్టర్‌ కొక్కొండ సత్యవతి(రాజమహేంద్రవరం), డాక్టర్‌ చల్లా హైమావతి(తణుకు)లకు సన్మానం చేసారు.[3]

టౌన్ హాలు నిర్మాణ వ్యయం[మార్చు]

టౌన్ హాలు నిర్మాణానికి అప్పట్లో 7వేల 72రూపాయలు ఖర్చు అయిందట. 1 వెయ్యి 700 చ గ స్థలంలో నిర్మించిన టౌన్ హాలుని మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ లో సంస్కృత అధ్యాపకులుగా పనిచేసే ఎం రంగాచారి 1890 అక్టోబర్ 23న తొలి ప్రసంగంతో కార్యకలాపాలు మొదలయ్యాయి. 1897 డిసెంబర్ 2వ తేదీన టౌన్ హాలుకి ట్రస్టీలను నియమించి రిజిస్ట్రేషన్ చేసి మరీ ట్రస్ట్ బోర్డుకి శ్రీ వీరేశలింగం గారు అప్పగించారు. అప్పటికే బిలియర్డ్స్ రూం, జూబ్లీ పబ్లిక్ లైబ్రరీ రూం కూడా నిర్మించారు.

ప్రస్తుత పరిస్థితులు[మార్చు]

అభివృద్ధి లేక, నిర్వహణ లేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా అద్దె వసూలు చేయకూడదని ట్రస్ట్ డీడ్ లో శ్రీ వీరేశలింగం గారు పేర్కొన్నారు. అయితే ఆరు షాపులు నిర్మించి, వాటి ద్వారా వచ్చే అద్దెతో నిర్వహించాలని సూచించారు. ప్రస్తుతం నిర్వహణ కష్టంగా మారింది. అందుకే గతంలో ఈ పురమందిరాన్ని కేంద్ర పురాతత్వ శాఖకు అప్పగించడానికి చేసిన ప్రయత్నం మాత్రం ఫలించలేదు. కనీసం ఇప్పటికైనా కేంద్ర పురావస్తు శాఖ స్వాధీనం చేసుకుని, పరిరక్షించాలని అందరూ కోరుకుంటున్నారు. ఇందుకు నగర శాసన సభ్యులు డాక్టర్ ఆకుల సత్యనారాయణ కృషి చేస్తున్నారు. అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ప్రార్ధనా సమాజం[మార్చు]

ఇక శ్రీ వీరేశలింగం గారి గృహంలో ప్రార్ధనా సమాజం వుండేది. అయితే 1897లో టౌన్ హాలుకి చేర్చి 80గజాల స్థలం కొని, రెండంతస్తుల భవనం నిర్మించి అందులోకి ప్రార్ధనా సమాజం మార్చారు.1897ఏప్రియల్ 17న దీన్ని బందరు నోబెల్ కళాశాల అధ్యాపకులు, బ్రహ్మసమాజ ఉద్యమ నాయకులు శ్రీ రఘుపతి వెంకటరత్నం నాయుడు ప్రారంభించారు. శ్రీ పెద్దాడ సాంబశివరావు, శ్రీ గోటేటి కనకరాజు ప్రార్ధనా సమాజం ట్రస్టీ లుగా వుండేవారు.

తొలి పాలకవర్గం (ట్రస్ట్ బోర్డు)
 1. న్యాపతి సుబ్బారావు పంతులు (అధ్యక్షులు)
 2. చిత్రపు వెంకటాచలం పంతులు (సెక్రటరీ)
 3. రాజా కొచ్చర్లకోట రామచంద్ర వేంకట కృష్ణారావు(పోలవరం జమీందారు)
 4. నేతి సోమయాజులు
 5. గోడిశెట్టి నారాయణస్వామినాయుడు
 6. నాళం పద్మనాభం
 7. ఖాజా అహ్మదుల్లా ఖాన్ సాహెబ్
 8. మంతపూడి కామేశ్వరరావు
 9. కొటికలపూడి రామేశ్వర రావు
 10. రెబ్బాప్రగడ పాపయ్య
 11. రాజా కంచుమర్తి సీతారామచంద్ర మూర్తి (ధర్మవరం జమీందారు)
 12. అమెరికన్ లూధరన్ మిషన్ సీనియర్ మిషనరీ
 13. జూబ్లీ పబ్లిక్ లైబ్రరి కార్యదర్శి
ప్రస్తుత పాలకవర్గం (ట్రస్ట్ బోర్డు)
 1. మద్దూరి శివ సుబ్బారావు (అధ్యక్షులు)
 2. జమ్మి రామారావు (సెక్రటరీ)
 3. చేబియ్యం వెంకట్రామయ్య
 4. వి. భాస్కరరామ్
 5. బలభద్ర పాండురంగ వెంకట్రాజు
 6. షేక్ అసదుల్లా అహ్మద్
 7. వేదుల శేషగిరి వరప్రసాద్
 8. జాగారపు సత్యనారాయణ
 9. గరిమెళ్ళ చిట్టిబాబు
 10. బొమ్ముల దత్తు
 11. బి.వి.ఎస్. భాస్కర్
 12. డాక్టర్ ఏబెల్ రాజబాబు
 13. ఆకుల వీర్రాజు (జూబ్లీ పబ్లిక్ లైబ్రరి కార్యదర్శి)

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 కందుకూరి వీరేశలింగము స్వీయ చరితము (తాజా ముద్రణ 2015 మే), టౌన్ హాలు సపాద శత (125 ఏళ్ళు) వార్షికోత్సవ ప్రత్యేక సంచిక (27మే 2016)
 2. సరికొత్త సమాచారం పత్రికలో ఆర్టికల్[permanent dead link]
 3. పర్యాటక కేంద్రంగా వీరేశలింగం టౌన్ హాల్ సపాద శత వార్షికోత్సవంలో ఎం ఎల్ ఎ డాక్టర్ ఆకుల[permanent dead link]