Jump to content

హాజీ మహమ్మద్ రహంతుల్లా సాహిబ్

వికీపీడియా నుండి
(వెంకటగిరి సంస్థానం దివాను రహంతుల్లా నుండి దారిమార్పు చెందింది)

హాజీ మహమ్మద్ రహంతుల్లా సాహిబ్ వెంకటగిరి సంస్థానం దివాను. 1828లో నెల్లూరులో పుట్టాడు. ఈయన, ఈయన తమ్ముడు హబీబ్ పార్శీ, ఉర్దూ భాషలలో గొప్ప పండితులు. నవాయత్ శాఖకు చెందిన వీళ్ళ పూర్వీకులు బీజాపురం నుంచి నెల్లూరు వచ్చి స్థిరపడ్డారు. రహంతుల్లా 'రసా' అనే కలంపేరుతో రాసిన కవితల్లో ఒకటిమాత్రం ఒక కవితా సంకలనంలో అచ్చై లభిస్తోందట.

రహంతుల్లా, వెంకటగిరి జమీందారీకి దివానుగా ఉన్న సమయంలో వెంకటగిరిలో ఒక బ్రాహ్మణ యువతిని పెళ్లాడి, ఆమెకు ఇజ్జతున్నీసా అని పేరు పెట్టి, నెల్లూరు పెద్దబజారులో తన మేడకు ఎదురుగా రోడ్డుకు ఆవలి వయిపు, మేడ నిర్మించి, తన మేడనుంచి ఆమె మేడకు వంతెన ఏర్పాటు చేసుకొన్నాడు. రాజాగారితో మనస్పర్థలు ఏర్పడడంతో దివాను పదవికి రాజీనామా చేసినా, సంస్థానంవారి కోర్ట్ కేసులు ఎదుర్కొనవలసి వచ్చింది. ఈయన కొంతకాలం శ్రీకాళహస్తి సంస్థానం దివానుగా చేశాడు. రహంతుల్లాకు ఒక్కడే కుమారుడు. ఆబాలుడు వెంకటగిరి సంస్థానం దివానుగా పనిచేసిన సుంకు నారాయణశెట్టి నెల్లూరులో ప్రారంభించిన హిందు స్కూల్లో ఐదవ తరగతి చదువుతూ, తన తండ్రికి వచ్చిన ఇంగ్షీషు పోస్ట్ కార్డ్ గడగడ చదివి వివరించడంతో, రహంతుల్లా సంతోషించి, బాడుగ ఇంటిలో జరుపుతున్న హిందూ స్కూల్ కోసం 1300 రూపాయలు వెచ్చించి, ప్రస్తుతం వి.ఆర్.విద్యాసంస్థలు కొనసాగుతున్న స్థలం, అందులో ఉన్న భవనాన్ని ఖరీదుచేసి బహూకరించాడు. రహంతుల్లా సహజీవనం చేస్తున్న వెంకటగిరి బ్రాహ్మణ యువతి ఇజ్జతున్నీసాతో తన కుమారుడికి అక్రమ సంబంధం ఉన్నట్లు అనుమానించి, కుమారుణ్ణి తన భవనానికి సమీపంలో నివసించే మత్స్యకారులచేత హత్యచేయించి, అందుకు ప్రతిఫలంగా వారికి చెరువులో పన్ను చెల్లించకుండా చేపలు పట్టుకొనే వెసులుబాటు కల్పించాడు. 1960 వరకు రహంతుల్లా సాహిబ్ నివసించిన మేడలు, వంతెన ఉన్నవి. నెల్లూరు, సంతపేట గోరీలమిట్టలో రహంతుల్లా సమాధి ఉంది. రహంతుల్లా తన కుమారుని స్మారకార్థం సంతపేటలో సరాయ్ (ధర్మసత్రం) కట్టించాడు.

రహంతుల్లా తమ్ముడు హబీబ్ (మహమ్మద్ హబీబుల్లా జూకా) మీద నెల్లూరు వి.ఆర్.కాలేజీ ఉర్దూ పండితుడు వహాబ్ సాహెబ్ పరిశోధించి డాక్టరేట్ పట్టా పొందాడు. హబీబ్ ఉర్దూలో, పారశీభాషలో కవితలు రాశాడు. ఆర్కాట్ చివరి నవాబు అజీం. ఏటా మద్రాసులో ముషాయిరాలు ఏర్పాటు చేసేవాడు. జూకా కవితలు అక్కడి ముషాయిరాలలో బాగా ప్రసిద్ధి. అసూయాపరులయిన పండితులు ముషాయిరాలలో ఎవరి కవితలు వారే చదవాలని నిబంధన పెట్టించారట. జూకాకు చెడ్డ నత్తి, అందువల్ల ఆ ఏడు అతను మూషాయిరాలో పాల్గొనకుండానే నెల్లూరు తిరిగి వచ్చేశాడు. ఆతని జీవితంలో ఇది పెద్ద మలుపు. ఆ తర్వాత 'హజా' అనే వ్యంగ్య తిట్టుకవిత్వం రాశాడు. జూకాకు, గాలిబ్ కు మధ్య ఉత్తరాలు నడిచాయి. జూకా ఉత్తరాలు పార్శీ భాషలో రాసినా, గాలిబ్ మాత్రం జూకాకు ఉర్దూ భాషలోనే జూకా కవితల మీద అభిప్రాయం రాశాడు. గాలిబ్ జూకా తిట్టు కవితల్ని మాత్రం హర్షించలేదట. జూకా తన కవిత్వాన్ని, వచన రచనలను అచ్చువేశాడని, ఆప్రతిని తాను సంపాదించినట్లు వహాబ్ చెప్పాడు.

రహంతుల్లా 1875లో చనిపోయాడు.

మూలాలు

[మార్చు]
  1. ఒంగోలు వెంకట రంగయ్య, కొందరు నెల్లూరు గొప్పవారు, 1933.
  2. వి.ఆర్.కాలేజీ ఉర్దు అధ్యాపకులు డాక్టర్ వహాబ్ సాహెబ్ గారితో డాక్టర్ కాళిదాసు పురుషోత్తం సంభాషణ
  3. డాక్టర్ కాళిదాసు పురుషోత్తం, వెంకటగిరి సంస్థాన చరిత్ర-సాహిత్యం, ఎమెస్కో ప్రచురణ, 2018.