వెన్నెల నాటకాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెన్నెల నాటకాలు

పూర్వం ప్రతి వైశాఖ పౌర్ణమికీ ఆరు బయట నిండు వెన్నెలలో రెండు మూడు రోజులు ఈ వెన్నెల నాటకాలు ఆడుతూ వుండే వారు. వీటిని రాస నాటకాలనే వారు. బందరులో కానుకొల్లు నరసింహం గారు బృందావనపురం ప్రాంతంలో ఈ రాసలీలలు ప్రదర్శించటం వల్లనే ఆ ప్రదేశానికి బృందావనపురమని పేరు వచ్చింది. భజన గీతాల మాదిరి భాగవతంలోని భ్రమర గీతాలను పాడేవారు.

ఈ ప్రదర్శనాలకు వెన్నెలలో, ఇసుక దిబ్బల మీద తులసి కొమ్మలు పాతి, ఆ తులసి కొమ్మల చాటున గోపికా లీలలు ప్రదర్శించే వారు. తులసి అంటే బృంద, అందుకే వాటిని బృందావన గీతాలనేవారు. ఇందులోని నటీ నటులు, ఆ యా కుటుంబాలకు సంబంధించిన బాల బాలికలు. బాలులందరూ కృష్ణులుగానూ, బాలికలందరూ గోపికలుగానూ, అందరూ ఒకే రకమైన బట్టలు ధరించేవారు.

జడకోలాటాల కోలాహలం

ఆ రోజుల్లో బందరులో పెద్ద పెద్ద పందిళ్ళలో జడ కోలాటాలు వేసేవారు. ఆ కోలాటాలు వేసే వారందరూ రాజ నాటకాలకు ప్రేక్షకలుగానూ వారి పిల్లలు నటీనటులుగానూ, వుండే వారు. ప్రదర్శనలు ఒక ఎత్తు దిబ్బ మీద జరుగుతూ వుంటే చుట్టూ ఎత్తుగా గ్యాలరీ మాదిరి ఇసుక తిన్నెలను ఏర్పాటు చేసేవారు. ఒక ప్రక్క తంబురా హర్మోనియం, మద్దెల మొదలైన వాటి శ్రుతితో భజనలకు సంబంధించిన భజన పరులు గోపికా గీతాలను పాడుతూ వుంటే బాల నటులందరూ రాధాకృష్ణులు గానూ, కృష్ణులూ గోపికలుగానూ అభినయిస్తూ వుండేవారు. పాట వచ్చిన పిల్లలు కూడ పాడుతూ వుండేవారు. ఈ ప్రదర్శనం చూడటానికి కొంత మంది ప్రేక్షకులు ప్రక్కనున్న చెట్లెక్కి కూర్చునేవారు. ఈ ప్రదర్శనాలకు దాదాపు వెయ్యి మంది ప్రేక్షకులు హాజరయ్యే వారు. వీటిని చిలకలపూడి ప్రాంతంలో కూడా ప్రదర్శించేవారు.