శరీర రక్షణ వ్యవస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జంతుజాలపు మనుగడకు శరీర రక్షణవ్యవస్థ చాలా అవసరం. సూక్ష్మాంగ జీవులు (బాక్టీరియా), విషజీవాంశాలు (వైరసస్), శిలీంధ్రాలు (ఫంగై), పరాన్నభుక్తులు, జీవవిషాలు (టాక్సిన్స్)[1], ఇతర మాంసకృత్తులు, శర్కర మాంసకృత్తులు (గ్లైకోప్రోటీన్స్) శరీరంలోనికి చొచ్చుకొని నిత్యం దాడి చేస్తుంటాయి. శరీర రక్షణవ్యవస్థ వాటిని తటస్థీకరించుటకు, నిర్మూలించడానికి ప్రయత్నిస్తుంది.

ఆక్రమణను అడ్డుకొనుట[మార్చు]

దాడి చేసే సూక్ష్మజీవులు, విషజీవాంశాలు ( వైరసస్, ఇవి జీవకణాలలో ఉత్పత్తి అయే అంశాలు, కాని జీవులు కాదు )[2], జీవవిషాలు శరీరంలోకి ప్రవేశించకుండా చర్మం, శ్వాసపథం, జీర్ణమండలం, మూత్ర జననాంగాలను కప్పే శ్లేష్మపు పొరలు చాలా వరకు నివారిస్తూ దేహానికి రక్షణ చేకూరుస్తుంటాయి.

వ్యాధి కారకాల బహిష్కరణ, నిర్మూలన[మార్చు]

దేహం, దగ్గు, తుమ్ము ప్రక్రియల వలన శ్వాస మార్గంలోని వ్యాధి కారకాలను, ప్రకోపకాలను శరీరం బయటకు నెట్టగలుగుతుంది. శ్వాస మార్గంలోను, జీర్ణ మండలం లోను శ్లేష్మం వ్యాధి కారకాలను బంధించి తొలగించ గలుగుతుంది. జీర్ణాశయంలోని ఉదజ హరికామ్లం, జీర్ణాశయంలోని రసాలు, జీవోత్ప్రేరకాలు (ఎంజైమ్స్) సూక్ష్మాంగ జీవాలను నిర్మూలించడానికి ఉపయోగపడుతాయి.

చెమటలోను, కన్నీళ్ళలోను, స్తన్యంలోను, శ్వాసపథ స్రావాలలోను, మూత్ర, జననాంగ పథంలోను ఉండే రసాయనాలు, లైసోజైమ్ వంటి జీవోత్ప్రేరకాలు, సూక్ష్మాంగ జీవాలను ధ్వంసం చేయడానికి ఉపయోగపడుతాయి.శరీరానికి గాయాలు తగిలిన వెంటనే స్రవించే రక్తం, గడ్డకట్టి గాయాల్ని పూడ్చడానికి తోడ్పడుతుంది. ఆపై గాయాల్ని మాన్చు ప్రక్రియకి దేహం పూనుకుంటుంది. రోగ జనకాలు గాయాల ద్వారా శరీరంలోకి చొరబడనీయకుండా నివారించడానికి ప్రయత్నం చేస్తుంది.

ప్రత్యేక రక్షణ వ్యవస్థ[మార్చు]

అంతేకాక శరీరములో ప్రత్యేక రక్షణవ్యవస్థ నిక్షిప్తమై ఉంది. ఎముకలలోని మజ్జలో బహుళ సామర్థ్య మూలకణాలు (ప్లూరిపొటెంట్ స్టెమ్ సెల్స్) నుంచి శ్వేతకణాలు ఉత్పత్తై శరీర రక్షణలో పాల్గొంటాయి.

థైమస్ గ్రంథి

థైమస్ గ్రంథి, గళగ్రంథి ( థైరాయిడ్ ) క్రింద నుండి ఛాతి పైభాగంలో యిమిడి ఉంటుంది. ఇందులో టి - రసికణాలు ఉత్పత్తై, పరిపక్వత పొందుతాయి. టి- రసికణాలు శరీర రక్షణలో ప్రముఖ పాత్ర నిర్వహిస్తాయి. స్వయంప్రహరణ కణాల (ఆటో రీయాక్టివ్ సెల్స్) నిర్మూలన కూడా థైమస్ గ్రంథిలో జరుగుతుంది. స్వయంప్రహరణ వ్యాధులు (ఆటో ఇమ్యూన్ డిసీజెస్) నివారించడానికి థైమస్ గ్రంథి తోడ్పడుతుంది.

రసి గ్రంథులు

శరీరంలో గజ్జలలోను, బాహుమూలాలలోను, మెడలోను, ఉదరం లోపల, ఛాతి లోపల సముదాయాలుగా ఉండే రసిగ్రంథులు (లింఫ్ గ్లాండ్స్) వ్యాధి కారకాలను వడగట్టి అవి కలిగించే వ్యాధులను ఆ యా ప్రాంతాలకు పరిమితం చేస్తాయి.

ప్లీహం

ఉదరంలో ఉండే ప్లీహం రక్తం ద్వారా వచ్చే ప్రతిజనకాలను (ఏంటిజెన్స్) వడగట్టుతుంది. ఇందులో ఉండే రసికణాలు (లింఫో సైట్స్), ప్రతిజనకాలను విచ్ఛేదించి, వాటికి ప్రతిరక్షకాలను (ఏంటిబాడీస్) స్రావక కణాల (ప్లాస్మా సెల్స్) ద్వారా తయారుచేసే ప్రక్రియకు దోహదకారి అవుతాయి. గొంతులో ఉండే గవదలు (టాన్సిల్స్), చిన్నప్రేవుల లోను, క్రిముకంలోను (ఎపెండిక్స్) ఉండే రసికణజాలం రక్షణ వ్యవస్థలో భాగాలే. చర్మం, శ్లేష్మపు పొరల ద్వారా వ్యాధి కారకాలు (పేథొజెన్స్) శరీరంలోకి చొచ్చుకొన్నపుడు శరీర రక్షణవ్యవస్థ రోగ జనకాలను నిర్మూలించి, వాటిని తటస్థీకరణం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ రక్షణవ్యవస్థ నిర్మాణం, వ్యాపారం క్లిష్టతరమైనా శాస్త్రజ్ఞుల కృషి వలన చాలా విషయాలు ఎఱుకలోకి వచ్చాయి.

ఈ శరీర రక్షణవ్యవస్థలో వివిధ కణాలు, స్రావకాలు పాలుపంచుకుంటాయి. రక్తంలో ఎఱ్ఱకణాలు, తెల్లకణాలు, రక్తఫలకాలు (ప్లేట్ లెట్స్), రక్తద్రవం ఉంటాయి. ఎఱ్ఱకణాలు ప్రాణవాయువును కణజాలానికి చేర్చడానికి ఉపయోగపడతాయి. రక్తఫలకాలు రక్తం గడ్డకట్టడానికి, రక్తస్రావాన్ని అరికట్టడానికి తోడ్పడుతాయి. తెల్లకణాలు రోగ జనకాలను కబళించడానికి, నిర్మూలించడానికి ఉపయోగపడుతాయి. రక్తద్రవంలో ఉండే ప్రతిరక్షకాలు, ఇతర స్రావకాలు వ్యాధి కారకాలను తటస్థీకరించడానికి తోడ్పడుతాయి.

కణ రక్షణ[మార్చు]

తెల్లకణాలు

తెల్లకణాలు శరీర రక్షణలో పాల్గొంటాయి. తెల్లకణాలు ఎముకల మజ్జలో బహుళ సామర్థ్య మూలకణాల (ప్లూరిపొటెంట్ స్టెమ్ సెల్స్) నుంచి పుడతాయి[3]. తెల్లకణాల్ని కణికలు గల కణాలు (గ్రాన్యులోసైట్స్), కణికలు లేని కణాలుగా (నాన్ గ్రాన్యులోసైట్స్) విభజించవచ్చు.వీనిలో కణికల కణాలు అధికశాతంలో ఉంటాయి. కణికల కణాలలో న్యూక్లియస్ లు పలు కణుపులతో భాగాలుగా (మూడు నుంచి ఐదు వరకు) విభజించబడి ఉంటాయి. హెమటాక్సొలిన్ - యూసిన్ వర్ణకాలు కలిపి సూక్ష్మదర్శినితో చూసేటప్పుడు కణద్రవంలో కణికలు చుక్కలు వలె కనిపిస్తాయి. కణికల రంగుబట్టి ఇవి తటస్థ కణాలు (న్యూట్రోఫిల్స్), ఆమ్లాకర్షణ కణాలు (ఎసిడోఫిల్స్ / యూసినోఫిల్స్), క్షారాకర్షణ కణాలు (బేసోఫిల్స్) అని మూడు రకాలు.

కణికలు గల తెల్లకణాలు[మార్చు]

తటస్థ కణాలు

నాలుగు తటస్థ కణాలు, ఎఱ్ఱ కణాలు.

రక్తములో హెచ్చు శాతపు (60- 70 శాతం) శ్వేతకణాలు తటస్థ కణాలు. హెమటాక్సిలిన్, యూసిన్ వర్ణకాలు చేర్చినపుడు వీటి కణద్రవాలలో కణికలు లేత ఊదా రంగులో చిన్న చిన్న చుక్కలుగా కనిపిస్తాయి[4][5] సూక్షజీవులు, శిలీంధ్రాలు శరీరంలో ప్రవేశించినపుడు వీటి ఉత్పత్తి పెరుగుతుంది. ఇవి సూక్ష్మజీవాలను, శిలీంధ్ర కణాలను కబళిస్తాయి. పలు సూక్ష్మజీవులను కబళించి, వాటిని నిర్మూలించిన తర్వాత ఈ కణాలు మరణించడంతో చీము ఏర్పడుతుంది.

ఆమ్లాకర్షణ కణాలు

హెమటాక్సిలిన్ - యూసిన్ వర్ణకాలతో కణద్రవంలో వీటి కణికలు ఎఱుపు రంగులో ఉంటాయి[6]. వీటి న్యూక్లియస్లు సాధారణంగా ఒక కణుపుతో రెండు భాగాలుగా చీలి ఉంటాయి. రక్తపు శ్వేతకణాలలో వీటి శాతం 2- నుంచి 4 వరకు ఉంటుంది. కొక్కెపు క్రిములు ( హుక్ వర్మ్స్), ఏటిక క్రిములు ( రౌండ్ వర్మ్స్), నారి క్రిములు (టేపు వర్మ్స్) వంటి పరాన్నభుక్తులు దేహములో ప్రవేశించినపుడు, అసహన వ్యాధులు కలిగినపుడు, ఉబ్బస వంటి వ్యాధులు కలిగినపుడు వీటి సంఖ్య పెరుగుతుంది. ఇవి విడుదల చేసే రసాయనాలు పరాన్నభుక్తులను చంపడానికి ఉపయోగపడుతాయి[7]. ఈ ఆమ్లాకర్షణ కణాలు భక్షణలో పాల్గొనవు.

క్షారాకర్షణ కణాలు

ఈ కణాలలో న్యూక్లియస్లు రెండు, లేక మూడు భాగాలుగా విభజించబడి ఉంటాయి. హెమటాక్సిలిన్, యూసిన్ వర్ణకాలు కలిపినపుడు కణద్రవములోని కణికలు ముదురు ఊదా రంగులో ఉంటాయి. ఈ కణికలలో హిష్టమిన్, హిపరిన్ , ప్రోష్టాగ్లాండిన్స్ వంటి రసాయనాలు ఉంటాయి[8]. రక్తపు శ్వేతకణాలలో వీటి శాతము 0.5 ఉంటుంది. కణజాలంలో ఉండే స్తంభకణాల ( మాస్ట్ సెల్స్ ) వలె ఇవి ఐ.జి- ఇ ని ఆకర్షిస్తాయి. ప్రతిజనకాలు ఈ కణాలపై ఉండే ఐ.జి- ఇ తో సంధానం అయినపుడు రసాయనాలను విడుదల చేసి అసహనాలు, రక్షణ వికటత్వాలను (ఎనఫిలాక్సిస్) కలిగిస్తాయి. తాప ప్రక్రియలలో కూడా ఇవి పాల్గొంటాయి.

కణికలు లేని శ్వేతకణాలు[మార్చు]

రసికణాలు

రసికణాలు రక్తంలో తెల్లకణాలలో సుమారు ఇరవైశాతం ఉంటాయి. కణిక కణాల కంటె పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. వీటిలో న్యూక్లియస్లు పెద్దవిగా ఉండి కణద్రవ పరిమాణం తక్కువగా ఉంటుంది. ఈ రసికణాలు రెండు రకాలు. బి - రసికణాలు, టి - రసికణాలు. రక్తప్రసరణలో 10- 15 శాతపు రసికణాలు బి- రసికణాలు. 70- 80 శాతపు రసికణాలు టి. రసికణాలు. సూక్ష్మదర్శినిలో ఒకేలా కనిపించినా, ప్రతిరక్షకాలను ఉపయోగించి వీటిని వేఱుగా గుర్తించవచ్చు. బి - రసికణాలు ప్రతిరక్షకాల ఉత్పత్తికి తోడ్పడుతాయి. టి - రసికణాలు శరీరంలో కణాల ద్వారా జరిగే ఆలస్య రక్షణ ప్రతిస్పందనలలోను, మార్పిడి అవయవాల తిరస్కరణలలోను పాల్గొంటాయి.

ఏకకణాలు

రక్తంలో 3 నుంచి 10 శాతపు తెల్లకణాలు ఏక కణాలు. మిగిలిన తెల్లకణాల కంటె ఇవి పెద్దవిగా ఉంటాయి[6]. వీటి న్యూక్లియస్లు చిక్కుడు గింజల ఆకారంలో ఉంటాయి. వీటి కణ ద్రవంలో కణికలు ఉండవు. ఇవి సూక్ష్మజీవాలను భక్షిస్తాయి. రోగ కారకాల్ని భక్షించి వాటి భాగాలను టి - రసికణాలకు జ్ఞప్తికై అందిస్తాయి. భవిష్యత్తులో ఆ రోగ కారకాలు దేహంలోకి చొచ్చుకొన్నపుడు వాటిని రక్షణ స్రావకాలతో (ఇమ్యునోగ్లాబ్యులిన్స్) ఎదుర్కోడానికి ఈ చర్య తోడ్పడుతుంది. ఈ ఏకకణాలు ప్లీహంలో ఎక్కువగా నిలువుంటాయి. ఏకకణాలు రక్తం నుంచి అవయవాల కణజాలాలకు కూడా చేరి పృధు భక్షక కణాలుగా (మాక్రోఫేజెస్) మారుతాయి. పృధు భక్షకకణాలు సూక్ష్మజీవాలను భక్షిస్తాయి. మరణించిన కణజాల అవశేషాలను, సూక్ష్మజీవుల అవశేషాలను తొలగించడానికి, జీర్ణించుకోడానికి ఈ పృధుభక్షక కణాలు తోడ్పడుతాయి.

స్రావక కణాలు

స్రావక కణములలో (ప్లాస్మా సెల్స్) న్యూక్లియస్లు ఒక ప్రక్కగా ఒరిగి ఉంటాయి. న్యూక్లియస్లలో డి ఎన్ ఎ పదార్థము చుక్కలుగా గడియారపు ముఖము, లేక బండిచక్ర ఆకారములో పేర్చబడి ఉంటుంది. కణద్రవం క్షారకాకర్షణమై నీలవర్ణంలో కనిపిస్తుంది. స్రావక కణాలు, బి- రసికణాలు నుంచి ఉద్భవిస్తాయి[9]. ప్రతిజనకాలను కబళించిన బి రసికణాలు, ఏకకణాలు ఆ ప్రతిజనకాలను పెప్టైడు ఖండాలుగా భేదించి ఆ ఖండాలను టి-రసికణాలకు చేరుస్తాయి. ఆ టి-రసికణాల ప్రేరణతో రసిగ్రంథులలోను, ప్లీహంలోను బి- రసికణాలు స్రావక కణాలుగా మార్పు చెందుతాయి. స్రావక కణాలు ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసి ఆ ప్రతిరక్షకాలను రక్తంలోకి స్రవిస్తాయి. ప్రతిరక్షకాలు ప్రతిజనకాలను తటస్థీకరించే ప్రక్రియలో పాల్గొంటాయి.

స్రావక రక్షణ[మార్చు]

శరీరంలో రసికణాలు, స్రావక కణాలు స్రవించే ప్రతిరక్షకాలు (ఇమ్యునోగ్లాబ్యులిన్స్) సూక్ష్మజీవాలను, విషజీవాంశాలను, జీవవిషాలను నిర్మూలించడానికి, తటస్థీకరించడానికి తోడ్పడుతాయి. శరీరంలోనికి చొచ్చుకొనే సూక్ష్మజీవాలు, శిలీంధ్రాలు, విషజీవాంశాలు, జీవవిషాలు, ప్రతిజనకాలుగా గుర్తించబడుతాయి. ప్రతిజనకాల ప్రేరణ వలన టి- రసికణాలు, ఏకకణాలు విడుదల చేసే సైటోకైన్లు బి రసికణాల సమరూప వృద్ధిని ప్రేరేపిస్తాయి. ఈ బి రసికణాలు స్రావక కణాలుగా మార్పు చెందుతాయి. సమరూప స్రావక కణాలు ఆ యా ప్రతిజనకాలకు ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తాయి. కొన్ని బి - రసికణాలు మాత్రం జ్ఞాపక కణాలుగా మిగిలి ఉంటాయి. భవిష్యత్తులో అవే ప్రతిజనకాలు శరీరంలోనికి చొచ్చుకొన్నపుడు ఈ జ్ఞాపక కణాలు వృద్ధిచెంది స్రావక కణాలుగా మారి ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తాయి. ఆ విధంగా స్ఫురణ రక్షణ కలుగుతుంది. తొలిసారిగా ఒక ప్రతిజనకం శరీరంలోకి చొచ్చుకున్నపుడు మొదటి 4-5 రోజులు ప్రతిరక్షకాలు రక్తంలో కనిపించవు. ఆపై రెండవదశలో మొదట ఐజి-ఎమ్ (ఇమ్యునోగ్లాబ్యులిన్ - ఎమ్) ప్రతిరక్షకాలు హెచ్చు ప్రమాణములో ఉత్పత్తి అవుతాయి. తరువాత 6-10 రోజులుకు ఆ ప్రతిజనకాలకు ఐజి-జి ప్రతిరక్షకాల (ఇమ్యునోగ్లాబ్యులిన్- జి) ఉత్పత్తి జరుగుతుంది. మూడవ దశలో ప్రతిరక్షకాల ప్రమాణాలు స్థిరపడి, నాల్గవ దశలో ప్రతిరక్షకాల ప్రమాణాలు మందగిస్తాయి. ఐజి-జి ప్రతిరక్షకాలు చాలా కాలం రక్తంలో ఉండి దీర్ఘకాలిక రక్షణను సమకూరుస్తాయి.

శరీరంలో ప్రతిరక్షకాలు శర్కరమాంసకృత్తులు. ఇవి Y ఆకారంలో ఉంటాయి. ప్రతి ప్రతిరక్షకంలోను రెండు తేలిక గొలుసులు, రెండు బరువు గొలుసులు ఉంటాయి. ఈ గొలుసులు చక్కెర, పెప్టైడుల (పెప్టైడులు ఎమైనో ఆమ్ల సంధానం వలన ఏర్పడుతాయి.) సముదాయాలను కలిగి ఉంటాయి.

ప్రతిరక్షకాల రకాలు[మార్చు]

క్షీరదాలలో ప్రతిరక్షకాలను ఐదు తరగతులుగా విభజించవచ్చును.

ప్రతిరక్షకం- జి (ఇమ్యునోగ్లాబ్యులిన్ - జి)

ఇవి ప్రతిజనకం శరీరంలో చొచ్చుకొన్న 10- 14 రోజులు తర్వాత ఉత్పత్తి అవుతాయి. అందువలన ఇవి ద్వితీయ రక్షణలో పాల్గొంటాయి. భవిష్యత్తులో శరీరం ప్రతిజనకాల పాలయినప్పుడు జ్ఞాపక కణాలచే ఇవి విరివిగా ఉత్పత్తి అయి స్ఫురణ రక్షణప్రక్రియకు ( రీకాల్ ఇమ్యూనిటీ ) తోడ్పడుతాయి. ప్రతిరక్షకాలు - జి లు పరిమాణంలో చిన్నవి. ఇవి కణజాలం మధ్యకు చొచ్చుకొని వ్యాధికారకాల్ని, నిర్మూలించడానికి తోడ్పడుతాయి.

ప్రతిరక్షకం- ఎమ్ (ఇమ్యునోగ్లాబ్యులిన్- ఎమ్)

ప్రతిజనకాలు శరీరంలో చొచ్చుకున్నప్పుడు తొలిదినాలలో ప్రతిరక్షకమం - ఎమ్ లు ఉత్పత్తి అవుతాయి. అందువలన ఇవి ప్రాధమిక రక్షణలో పాల్గొంటాయి. ఇవి పరిమాణంలో పెద్దవి. ప్రతిజనకాలతో కలిసి గుమికట్టి వాటి విచ్ఛేదనానికి తోడ్పడుతాయి.

ప్రతిరక్షకం- ఎ (ఇమ్యునోగ్లాబ్యులిన్- ఎ)

ఇవి శ్లేష్మపు పొరలలో ఉండి శ్లేష్మపు పొరలకు రక్షణ సమకూరుస్తాయి. ఇవి శ్వాస మార్గం, జీర్ణ మండలం, మూత్ర మార్గాలకు రక్షణ ఇస్తాయి. కన్నీళ్ళు, లాలాజలం, క్షీరం వంటి బహిస్స్రావకాలలో కూడా ప్రతిరక్షకం ఎ లు ఉండి ప్రతిజనకాలను ఎదుర్కొంటాయి.

ప్రతిరక్షకం- డి ( ఇమ్యునోగ్లాబ్యులిన్- డి )

ఇవి రక్తంలో తక్కువ ప్రమాణాలలో ఉంటాయి. ఇవి బి రసికణాలపై ఉండి ప్రతిజనకాలకు గ్రాహకాలుగా పనిచేస్తాయి. ఇవి క్షారాకర్షణ కణాల్ని, స్తంభకణాల్ని ఉత్తేజపరచి వాటిచే సూక్ష్మజీవులను విధ్వంసపరచే రసాయనాలను విడుదల చేయిస్తాయి.

ప్రతిరక్షకం- ఇ (ఇమ్యునోగ్లాబ్యులిన్- ఇ)

ఇవి రక్తంలో తక్కువ పరిమాణంలో ఉంటాయి. అసహనాలు ( ఎటోపి, ఎలర్జీ ) కలవారిలో వీటి ప్రమాణం అధికం కావచ్చు. ప్రతిజనకాలు శరీరంలో ప్రవేశించినపుడు ఇవి ఉత్పత్తై, క్షారాకర్షణ కణాలకు, స్తంభకణాలకు అంటుకొని ఉంటాయి. ప్రతిజనకాలు మరల శరీరంలో ప్రవేశించినపుడు వాటితో సంధానమయి ఆ కణాల నుంచి హిష్టమిన్, లూకోట్రైయీన్స్, ఇంటర్ లూకిన్స్ వంటి తాప జనకాల విడుదల చేయిస్తాయి. ఇవి పరాన్నభుక్తులను ఎదుర్కోవడానికి సహాయపడతాయి. ఇవి అసహనం, రక్షణ వికటత్వం కలిగించడంలో పాత్ర వహిస్తాయి.

సంపూరక వ్యవస్థ[మార్చు]

శరీర రక్షణలో ప్రతిరక్షకాలతో బాటు సంపూరక వ్యవస్థ (కాంప్లిమెంట్ సిస్టమ్) ప్రముఖపాత్ర వహిస్తుంది. సంపూరక వ్యవస్థలో కణద్రవములో ఉండే కొన్ని మాంసకృత్తులు, శర్కర మాంసకృత్తులు, కణాల పొరలపై ఉండే గ్రాహకాలు పాలుపంచుకుంటాయి[10]. ఈ సంపూరకాలు శరీరంపై దాడి చేసే సూక్ష్మాంగజీవుల భక్షణకు, సూక్ష్మజీవుల కణకుడ్యాల విధ్వంసానికి, తాప ప్రక్రియను ప్రోత్సహించి భక్షక కణాలను ఆకర్షించడానికి సహాయపడతాయి.సంపూరకాలు సూక్ష్మజీవాలకు అంటుకొని ఆపై భక్షకకణాల గ్రాహకాలతో సంధానం అవుతాయి. అప్పుడు భక్షక కణాలు ఆ సూక్ష్మజీవాలను భక్షించి వాటిని ధ్వంసం చేస్తాయి. సంపూరకాలు తాప ప్రక్రియను ప్రోత్సహించి భక్షకకణాలను రోగజనకాల దగ్గఱకు ఆకర్షిస్తాయి. సంపూరకాలు (సి5బి, సి6, సి7, సి8, సి9) వ్యాధులు కలిగించే సూక్ష్మజీవాల కణాల పొరలపై పరంపరంగా సంధానమై కణవేష్టన ఆక్రమణ వ్యవస్థల్ని (మెంబ్రేన్ ఎటాక్ కాంప్లెక్స్ లు; ఎమ్ ఏ సి లు) ఏర్పరుస్తాయి. ఈ కణవేష్టన ఆక్రమణ వ్యవస్థలు సూక్ష్మజీవాల కణాల పొరలలో చిల్లులు పొడిచి సూక్ష్మజీవాలను ధ్వంసం చేస్తాయి. సంపూరకాలు విషజీవాంశాల ధ్వంసంలో కూడా తోడ్పడుతాయి. దేహంలో రక్షణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం వలన శరీరం అనేక వ్యాధుల నుంచి సహజంగా కోలుకోగలుగుతుంటుంది. సూక్ష్మాంగ జీవులు, శిలీంధ్రాలు, విషజీవాంశాలు, జీవవిషాల ఉధృతి అధికమైనపుడు తగిన ఔషధాల ప్రయోజనం బాగా కనిపించినా, సహజ వ్యవస్థలో లోపాలు విస్తృతంగా ఉంటే ఔషధాలు కూడా దీర్ఘకాలపు ప్రయోజనం చేకూర్చలేవు.

మూలాలు[మార్చు]

  1. "Definition of toxin | Dictionary.com". www.dictionary.com (in ఇంగ్లీష్). Retrieved 2023-05-06.
  2. "Definition of virus | Dictionary.com". www.dictionary.com (in ఇంగ్లీష్). Retrieved 2023-05-06.
  3. https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC4938003/
  4. Zen, Ke; Parkos, Charles A (2003-10-01). "Leukocyte–epithelial interactions". Current Opinion in Cell Biology (in ఇంగ్లీష్). 15 (5): 557–564. doi:10.1016/S0955-0674(03)00103-0. ISSN 0955-0674.
  5. "Neutrophil | Description, Characteristics, & Function | Britannica". www.britannica.com (in ఇంగ్లీష్). 2023-08-22. Retrieved 2023-09-10.
  6. 6.0 6.1 Paxton, Steve; Peckham, Michelle; Knibbs, Adele (2003). "The Leeds Histology Guide" (in ఇంగ్లీష్). {{cite journal}}: Cite journal requires |journal= (help)
  7. "Eosinophil & Eosinophilic Disorders". Cleveland Clinic (in ఇంగ్లీష్). Retrieved 2023-09-10.
  8. "Basophils: Function & Ranges". Cleveland Clinic (in ఇంగ్లీష్). Retrieved 2023-09-10.
  9. "Plasma Cell - an overview | ScienceDirect Topics". www.sciencedirect.com. Retrieved 2023-05-07.
  10. Uszewski, M. Kathryn; Farries, Timothy C.; Lublin, Douglas M.; Rooney, Isabelle A.; Atkinson, John P. (1996), "Control of the Complement System", Advances in Immunology, Elsevier, pp. 201–283, retrieved 2023-05-07

వెలుపలి లంకెలు[మార్చు]