శాంతి తెరెసా లక్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శాంతి తెరెసా లక్రా
అండమాన్ లో శాంతి తెరెసా లక్రా
జననం (1972-05-01) 1972 మే 1 (వయసు 51)
రంగట్, అండమాన్, భారతదేశం
వృత్తినర్స్
జీవిత భాగస్వామిషాజీ వర్గీస్‌
పురస్కారాలుపద్మశ్రీ
ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు
బెస్ట్ నర్స్ ఆఫ్ ది ఇయర్

శాంతి తెరెసా లక్రా ఆరోగ్య కార్యకర్త, నర్సు. 2004లో అండమాన్‌లో సునామి సంభవించినప్పుడు ఈమె ఒంగే తెగకు చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2011లో నాల్గవ అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీతో సత్కరించింది.[1]

జీవిత చరిత్ర[మార్చు]

శాంతి తెరెసా లక్రా 1972, మే 1 న అండమాన్ నికోబార్ దీవులలోని రంగట్ అనే చిన్న గ్రామంలో జన్మించింది. నర్సింగ్‌లో తన చదువును పూర్తి చేసిన తర్వాత, ఆమె 2001లో అండమాన్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్‌లో సహాయక నర్సు, మంత్రసానిగా తన వృత్తిని ప్రారంభించింది. ఆమె ఐదు సంవత్సరాలు డుగోంగ్ క్రీక్‌లోని పబ్లిక్ హెల్త్ సెంటర్‌లో పనిచేసింది, ఇక్కడ ఒంగే అనే గిరిజన తెగ  ప్రజలు ఉండేవారు. 2004 సునామి వచ్చినప్పుడు ఆమె  తన సొంత బిడ్డకు దూరంగా  రెండు సంవత్సరాలు బయట గుడారంలో నివసిస్తూ ఒంగే ప్రజలకు సహాయం చేసింది. [2]2 సంవత్సరాలపాటు ఈమె చేసిన సేవలు ఒంగే జనాభా ఆయుర్దాయంపై సానుకూల ప్రభావాన్ని చూపింది. అంతేకాకుండా కోవిడ్ సమయంలోను చాల సేవలు చేసింది. శాంతి తెరెసా లక్రా చిన్న వ్యాపారం చేసే షాజీ వర్గీస్‌ను వివాహంచేసుకుంది. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు.

అవార్డులు[మార్చు]

2010లో అండమాన్ నికోబార్ దీవుల కాథలిక్ హెల్త్ అసోసియేషన్ (CHAANI) నర్సు ఆఫ్ ది ఇయర్‌ అవార్డుతో సత్కరించింది. అదే సంవత్సరంలో, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ బెస్ట్ వాలంటీర్ అవార్డు, నర్సింగ్ హెల్త్‌కేర్ రంగంలో అత్యున్నత భారతీయ అవార్డు అయిన ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అందుకుంది.[3]ఇది డాక్టర్ బి.సి.రాయ్ జాతీయ వైద్యుల అవార్డుకు సమానం. ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆమెకు ప్రదానం చేశాడు. అవార్డు కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి, ఆమెను కలిసిన తరువాత ఆమె చేసిన సేవలు తెలుసుకొని ఆమెను పద్మశ్రీకి నామినేట్ చేసాడు. శాంతి థెరిసా లక్రా కథ మన నర్సింగ్ వృత్తి మానవాళి కోసం పనిచేయడానికి, అటువంటి అవార్డులను ఆశించడానికి ప్రేరణగా ఉండాలని భారతీయ కార్డియాలజిస్ట్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కె.కె.అగర్వాల్ రాశాడు.[4] 2011లో బెస్ట్ హెల్త్ వర్కర్ అవార్డు వంటి అనేక అవార్డులను అందుకుంది. భారత ప్రభుత్వం 2011లో శాంతి లక్రాను నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో సత్కరించింది. 2023, మే 12 న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం రోజున ప్రదానం చేసే గ్లోబల్ నర్సింగ్ అవార్డుకు నామినేట్ అయ్యింది.[5] ప్రపంచ వ్యాప్తంగా 50 వేల నర్సులు పోటీపడగా ఫైనల్ కి చేరిన చివరి పది మందిలో లక్రా కూడా ఉంది.[6]

మూలాలు[మార్చు]

  1. Tanima (2022-05-12). "How A Nurse Saved An Entire Tsunami Hit Tribe Of Andaman". lifebeyondnumbers.com. Retrieved 2023-05-13.
  2. "Shanti Teresa: Serving The Humanity | The Sip of Life". 2014-12-05. Archived from the original on 2014-12-05. Retrieved 2023-05-13.
  3. "National Florence Nightingale Award, 2010". Jagranjosh.com. 2010-10-12. Retrieved 2023-05-13.
  4. Aggarwal, Dr K. K. (2013-02-04). "eMedinewS Daily: Emedinews:Inspiration:Padma Shri to Shanti Teresa Lakra". eMedinewS Daily. Retrieved 2023-05-13.
  5. "Shanti Teresa Lakra". Aster Guardians. Retrieved 2023-05-13.
  6. "సాక్షి : Sakshi Telugu News Paper | Sakshi ePaper | Sakshi Andhra Pradesh | Sakshi Telangana | Sakshi Hyderabad". epaper.sakshi.com. Retrieved 2023-05-13.